విడిపోయి కలిసుందాం
తెలంగాణ ` ఆంధ్ర ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసిందామని అందరూ కోరుకుంటున్నారు. పిడికెడు మంత్రి సీమాంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు తప్ప. ఆ పిడికెడు మందిలో ఒకరిగా, సమైక్యాంధ్రవాదాన్ని ఢల్లీిలో కాంగ్రెస్ అధిష్టానం ఎదుట ఇంతవరకూ బలంగా వినిపించిన ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తన పిడివాదాన్ని కాస్త పక్కన బెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రులు రాజీ పడక తప్పదని చెప్పారు. రాజకీయాల్లో ఎవరికీ వ్యక్తిగత అభిప్రాయాలుండవని, పార్టీ అభిప్రాయమే అందరూ పాటించాలని సూచించారు. కావూరి సాంబశివరావులో వచ్చినట్లుగానే సమైకాంధ్య్ర అనే పిడివాదాన్ని పట్టుకు వేలాడుతున్న సీమాంధ్ర నేతలందరిలో మార్పు రావాలని ప్రతి తెలంగాణ పౌరుడూ కోరుకుంటున్నాడు. మొదటి ఎస్సార్సీ సూచించిందని భాషా ప్రయోక్త రాష్ట్రాల పేరుతో హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాలను కలిపి అప్పటి జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసింది. ఇరు ప్రాంతాల మధ్య వివిధ అంశాలపై పెద్దమనుషుల ఒప్పందం చేసుకున్నాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నాటికి ఆంధ్ర రాష్ట్రం దుర్గతి, దుస్థితి చెప్పనవలవి కాదు. కర్నూల్ రాజధానిగా కొనసాగిన ఆంధ్ర రాష్ట్రంలో కనీసం కార్యాలయాలకు కూడా భవనాలు లేని దయనీయ పరిస్థితి. టెంట్లు, డేరాల కింద ఆఫీసులు నిర్వహిస్తే ఫైళ్లను ఎలుకలు కొట్టిన దుర్గతి. లోటు బడ్జెట్‌లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్‌లో ఉన్న హైదరాబాద్ స్టేట్‌ను కలిపినప్పుడు చేసుకున్న ఒడంబడికలేవి సీమాంధ్ర పెత్తందారులు తర్వాతికాలంలో అమలు చేయలేదు. పెద్దమనుషుల ఒప్పందం బుట్టదాఖలైంది. ముల్కీ నిబంధనలను తుంగలో తొక్కారు. అపారమైన ఖనిజ సంపద, విలువైన భూములు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పుష్కలమైన జళ వనరులను ఆంధ్రాకు తరలించుకుపోయారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకూ హైదరాబాద్ స్టేట్‌లో అధికార భాషగా ఉన్న ఉర్దూ జవసత్వాలు కోల్పోయేలా చేశారు. ఉర్దూ చదివిన వారికి ఉపాధి అవకాశాల్లేకుండా చేశారు. తెలంగాణ పరిశ్రమలను మూసి వేసే పరిస్థితులు కల్పించారు. ఉన్న పరిశ్రమల్లో ఉన్నత స్థానాల్లో తమ వారిని నియమించుకొని కార్మికులుగా మాత్రం తెలంగాణ వారికి అవకాశం కల్పించారు. ఏ తెలుగు భాష ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటనే కుట్రకు తెర తీశారో అదే తెలుగు భాషను, తెలంగాణ భాషను, యాసను అవహేళన చేశారు. అవమానించారు. వారి చేతుల్లో కేంద్రీకృతమై ఉన్న పత్రికా, సినిమా రంగాల్లో ప్రతి నాయకుల భాషగా తెలంగాణ భాషను మార్చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా పేరున్న నిజాం నవాబులు నిర్మించిన భవనాల్లోనే అసెంబ్లీ, హైకోర్టు తదితర ముఖ్య కార్యనిర్వాహక కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిలో తెలంగాణ వారికి చోటు లేకుండా చేశారు. తెలంగాణ ప్రజల చెమటతో నిర్మితమైన హైదరాబాద్‌లో వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేశారు. ఐదున్నర దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వారు రాజ్యం చేసిన కాలం అతిస్వల్పం. నాలుగు జిల్లాలే ఉన్న రాయలసీమ నేతలు ఎక్కువకాలం అధికారంలో కొనసాగారు. తర్వాతి స్థానం ఆంధ్ర ప్రాంతానిది. సీమాంధ్ర ప్రాంతాల నేతల పాలనలో తెలంగాణ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగింది. గత రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ చుట్టు పక్కల భూములను కూడా సీమాంధ్ర పాలకులు బలవంతంగా లాక్కొని తెలంగాణ ప్రజలను దిక్కులేని వారుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అన్నింటా వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతం సీమాంధ్ర నేతలు, పెత్తందారుల నుంచి విముక్తి కోసం నాలుగు దశాబ్దాలుగా పోరాడుతోంది. ఇప్పటి వరకూ 1500 మంది విద్యార్థులు, యువత (1969, 2009 నుంచి ఇప్పటి వరకూ) ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష సాకారం కావాలని కోరుతూ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షాలు దానిని పెడచెవిన పెట్టాయి. 2009లో తెలంగాణలోని ఊరూ వాడ ఒక్కటై ఉద్యమాన్ని హోరెత్తించడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు అదే ఏడాది డిసెంబర్ 9న ప్రకటన చేసింది. అది మొదలు సీమాంధ్ర నేతలు, పెత్తందారులు తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్రల కత్తులు దూయడం ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ నుంచి వెళ్లగొడతారని, అక్కడికి వెళ్లే అవకాశమే ఉండబోదంటూ సీమాంధ్ర ప్రజల్లో అనవసర భయాందోళనలు కల్పించారు. అయినా ఎవరూ స్పందించకపోవడంతో స్వయంగా పెట్టుబడి పెట్టి కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారు. దానికి సీమాంధ్ర మీడియా అనవసర ప్రచారం కల్పించి రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందంటూ అబద్ధాలను వల్లెవేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తెలంగాణ వనరులపై గుత్తాధిపత్యం కోసం సీమాంధ్ర పెత్తందారులు ఢల్లీిలో లాబీయింగ్ చేసి ఇచ్చిన ప్రకటన వెనక్కు తీసుకునేలా చేశారు. నాలుగు దశాబ్దాల పోరాటం సాకారమవుతుందనుకున్న వేళ తెలంగాణ ప్రజలకు మళ్లీ భంగపాటు తప్పలేదు. ఆరోజు మళ్లీ తెలంగాణ ఉద్యమ కేంద్రమైంది. కేంద్రంలో కాస్త కదలిక రాగానే సీమాంధ్ర శక్తులు ఏకమై ఢల్లీిలోని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను ఎలాగో ఒప్పించుకోవడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో కావూరిలో వచ్చిన మార్పు ఆహ్వానించదగ్గదే. మంత్రి పదవి ఇచ్చినందుకే ఆయన అలా మాట్లాడుతున్నారని కొందరు అనవచ్చు, ప్రజల ఆకాంక్షలపై కాకుండా పదవి కోసం కావూరి అలాంటి ప్రకటన చేసిండొచ్చు. కానీ అలాంటి మార్పు సీమాంధ్ర పెత్తందారులందరిలోనూ రావాలి. ప్రజలు తెలంగాణ ` ఆంధ్రగా విడిపోయి కలిసి ఉండేందుకు ఎప్పుడో సిద్ధపడ్డారు. ఇప్పుడు సిద్ధం పడాల్సింది సంసిద్ధం కావాల్సింది పెట్టుబడిదారులు మాత్రమే. విడిపోయి కలిసుందామనే భావన వారిలోనూ రావాలని తెలంగాణ ప్రజలందరూ కోరుతున్నారు. దోపిడీదారులైనా వారు తెలుగు వారేనని, తమ సోదరులేనని భావిస్తున్నారు.