విత్తన బాండాగారంగా తెలంగాణ

C

– రైతులకు బీమా సౌకర్యం

– పంటల కాలనీగా మన రాష్ట్రం

– సీఎం కేసీఆర్‌

నల్గొండ మే 3 (జనంసాక్షి):

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పిన్రు. ఆదివారం నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్‌ శిక్షణ తరగతుల్లో కార్యకర్తలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని పంటల కాలనీగా మారుస్తామన్నారు. త్వరలో ఆదర్శ రైతులతో సమావేశం నిర్వహిస్తామని సీఎం హావిూ ఇచ్చిన్రు. రాష్ట్రంలో గోదాముల సంఖ్య పెంచుతామన్నారు. అలాగే వ్యవసాయదారులకు బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. రైతులకు అర్థమయ్యే భాషలోనే పరిశోధనలు, ఇతర అంశాలను బోధించాలని శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్‌ సూచించిన్రు. రాష్ట్రంలో 400కు పైగా విత్తన ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయని ఆయన తెలిపింన్రు. రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాజేంద్రనగర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఒకప్పుడు మంచి విత్తనాలు తయారు చేసేది.., కానీ తర్వాత అది భ్రష్టుపట్టిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన్రు. వ్యవసాయ విస్తరణ పనులు జరగటంలేదు, వ్యవసాయ శాఖను పునరుద్దరించాలని చెప్పిన్రు. మంచివిత్తనం అందుబాటులో ఉండాలి, నేల స్వభావాన్ని గుర్తించి పంటలు వేయాలని సూచించిన్రు. అవసరమైన మేరకే నీటి వినియోగం ఉండాలని సీఎం కేసీఆర్‌ చెప్పిన్రు. తెలంగాణ రాష్ట్రాన్ని పంటల కాలనీలుగా మార్చాలని అన్నరు. ఈ విషయంలో వ్యవసాయ యూనివర్సిటీ, వ్యవసాయ శాఖ చొరవ చూపాలని సీఎం కోరిన్రు. త్వరలోనే నిజమైన ఆదర్శ రైతులను హైదరాబాద్‌కు పిలిపించి మాట్లాడుతమని, వారితో చర్చించిన తర్వాత వ్యవసాయ విధానం ఖరారు చేస్తం అని సీఎం అన్నరు. వ్యవసాయం వల్ల ఆదాయం పెద్దగా రాదనే భావన ఉందని.., కానీ వ్యవసాయం వల్ల చాలా మంది ఉపాధి పొందుతున్నారని చెప్పిన్రు. పంటలు బాగా పండితే వ్యవసాయదారులు ఆర్థికంగా బలపడ్తరని అన్నరు. తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా మారడం ఖాయం ఆశాభావం వ్యక్తం చేసిన్రు. తెలంగాణలో 400లకుపైగా విత్తన ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయని, వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం అని సీఎం కేసీఆర్‌ అన్నరు. అధ్యయనం కోసం ఇజ్రాయెల్‌ పోవడంకాదు.., ఇజ్రాయెల్‌ వాళ్లే మన దగ్గరకు వచ్చి నేర్చుకునే పరిస్థితి రావాలని కోరారు. వ్యవసాయంలో ఉత్పత్తి పెరగడంకాదు, ఉత్పాదకత పెరగడమే నిజమైన అభివృద్ధి అన్ని అన్నరు. ఎక్కువ భూమిలో తక్కువ పంటలు పండటం కాదు తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండాలని సూచించిన్రు. ప్రతీ గ్రామానికి ఇద్దరు రైతులను ఎంపిక చేసుకుని ఆధునిక పద్దతులు, డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా మనమే వ్యవసాయం చేయించాలని అధికారులను ఆదేశించిన్రు. అది మిగతావారికి ఆదర్శంగా ఉంటుందని అన్నరు. పశుసంవర్ధక శాఖను బలోపేతం చేయాలని అన్నరు. పశు పోషణ కూడా చాలా ముఖ్యం అని సీఎం కేసీఆర్‌ చెప్పిన్రు. విత్తనాలు, ఎరువుల కొరతలేకుండా చూడాలని చెప్పిన్రు. పంటలకు మార్కెటింగ్‌ కల్పించాలని, గోదాముల సంఖ్యను కూడా బాగా పెంచుతున్నం అని సీఎం కేసీఆర్‌ అన్నరు. గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని చెప్పిన్రు. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కోసం రూ. 100 కోట్లు కేటాయించాం అని అన్నరు. వ్యవసాయదారులకు కూడా బీమా సౌకర్యం కల్పిస్తం అని సీఎం కేసీఆర్‌ అన్నరు. వ్యవసాయ విస్తరణాధికారులను దాదాపు 2 నుంచి 3 వేల మందిని నియమిస్తం అన్నరు. వ్యవసాయంలో సాంకేతికత, ఆధునికత పెరగాలని సీఎం కేసీఆర్‌ చెప్పిన్రు.