విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి
గుంటూరు, జూలై 30 : ప్రతి విద్యార్థి తనకు ఇష్టమున్న రంగాన్ని ఉన్నత లక్ష్యాలును నిర్దేశించుకోవాలని, నిరంతరం పట్టుదల కృషితో అనుకొన్న లక్ష్యాన్ని సాధించవచ్చునని హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ బి. చంద్రకుమార్ అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ మందిరంలో ”విద్యార్ధులు – సామాజిక స్పృహ” అనే అంశంపై అవగాహనాసదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన చంద్రకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకుంటున్నప్పుడే భవిష్యతులో తామేంకావాలనే అంశపై స్పష్టత ఏర్పరుచుకోవాలని సూచించారు. కొందరు కలెక్టర్ కావాలని, మరికొందరు జడ్జి, శాస్త్రవేత్త, లాయర్, డాక్టర్ ఇలా వేర్వేరు రంగాల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నారని, కోరుకోవటంలో తప్పులేదన్నారు. కానీ కోరుకున్న రంగం గురించి స్పష్టత ఏర్పరుచుకోవాలన్నారు. దీనికి ఆయా రంగాల్లో ఇప్పటికే ఉన్నతస్థాయికి వచ్చిన వారిని కలుసుకొని మెలకువలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారిని వారి స్థాయిలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డారో, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారో వంటి అంశాలను నేరుగా తెలుసుకోవచ్చని సూచించారు. ప్రతి వ్యక్తిలో అంతర్లీనంగా తెలియని శక్తిదాగి ఉంటుందని గుర్తించి వినియోగించుకోవాలన్నారు. లక్ష్యాలను ఎంచుకోవడమే కాదు వాటిని సాధించేందుకు మార్గం ఎలా వేసుకోవాలనేది తెలుసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి జీవితంలో అవరోధాలు ఎదురవుతూ వుంటాయన్నారు. వాటిని అదిగమిస్తూ లక్షసాధనపైనే ఆలోచనలు వుంటే అనుకొన్నది సాధించవచ్చునన్నారు. అబ్రహంలింకన్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మార్ ్స వంటివారు అట్టడుగువర్గాల అభ్యున్నతి కోసం పనిచేశారన్నారు. వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని సామాజిక సేవాదృక్పధం పెంచుకోవాలన్నారు. వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని సామాజిక సేవా దృక్పథం పెంచుకోవాలన్నారు. సదస్సులో సాంఘికా సంక్షేమశాఖా ఉపసంచాలకులు హన్మంతు, న్యాయసేవాధికారీ సంస్థ జిల్లా చైర్మన్ రమణకుమారి, సంచారకోర్టు న్యాయమూర్తి రామచంద్రరావు, నర్మద తదితరులు పాల్గొన్నారు.