విద్యాసంస్థల బంద్‌ జయప్రదం చేయండి

శ్రీకాకుళం, జూలై 16: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 17న ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వై.చలపతిరావు పిలుపునిచ్చారు. స్థానిక క్రాంతిభవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీరుకు నిరసనగా చేపడుతున్న బంద్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా నేటికీ పాఠ్యపుస్తకాలు అందలేదన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎం.యుగందర్‌ మాట్లాడుతూ ఈ ఏడాది విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఇవ్వలేదని, గత ఏడాది ఇచ్చినవి నాసిరకంగా ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు ఆర్‌.మోహనరావు, ఎన్‌.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.