విద్యుత్ సమస్యను పరిష్కరించండి
కడప, జూలై 8 : విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెండ్లిమర్రి మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఆదివారం కడప, పులివెందుల రహదారిపై బైఠాయించారు. ఉదయం 9గంటల నుంచి ఈ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పెండ్లిమర్రి మండలం గుర్రాలచింతల చీమలపెంట గ్రామాల ప్రజలు తీవ్ర విద్యుత్‌సమస్యను ఎదుర్కొంటున్నామని, సమస్యను పరిష్కరించాలని పలు మార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. దీంతో తాము రోడ్డున పడక తప్పలేదని గ్రామస్తులు రాంరెడ్డి తెలిపారు. విద్యుత్ కొరత కారణంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చినపంట కళ్లెదుటే ఎండిపోతుంటే ఏమీ చేయలేని స్థితిలో ఉండాల్సి వస్తుందని రైతులు విలపించారు. బోర్లలో నీరు ఉన్నా విద్యుత్ కొరత కారణంగానే పంటలను దక్కించుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతులకు పలు మార్లు విన్నవించినా ఫలితంకానరాలేదన్నారు. ఈ ఆందోళనతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.