విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర అగ్ని ప్రమాదం
పేలిన సిలిండర్ .. 16 మంది మృతి..
మరో ఎనిమిది మంది పరిస్థితి విషమం
విశాఖపట్నం,జూన్ 13 (జనంసాక్షి) : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో 16 మంది మృత్యువాతపడగా, ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఎంఎస్-2 విభాగంలోని కన్వర్టర్ రిటైల్ రన్ చేస్తుండగా ఆక్సిజన్ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో ఒక్కసారిగా మండలు ఎగిసిపడడటంతో ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది మృత్యువాతపడ్డారు. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం సమీపంలోని ఉక్కు జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం విస్తరణలో భాగంగా కొత్త ప్లాంట్‌లో స్టీల్ మెల్ట్షాపు (ఎస్ఎంఎస్)-2లో కన్వర్టర్‌ను పరీక్షిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం రాత్రి తొమ్మిది , పది గంటల మధ్య కొంతమంది అధికారులు,కార్మికులు కన్వర్టరు పనితీరు పరిశీస్తున్నారు. అనుకన్న మేరకు ఆక్సిజన్ ప్లాంట్ నుంచి ప్రెజర్(ఫోర్స్) రాకపోవడంథో కొందరు ఆక్సిజన్ సిలెండర్ల వద్దకు వెళ్లి ప్రెజర్‌ను పెంచి అదే విషయాన్ని కన్వర్టరు వద్ద ఉన్న సిబ్బందికి తెలిపారు. అయినా ప్రెజర్ రాలేదని వారు చెప్పడంతో మరింత ప్రెజర్‌ను పెంచారు. ఇలా రెండు,మూడు సార్లు పెంచడంతో ఒక్కసారిగా ఒత్తిడి పెరిగి ఆక్సిజన్ సిలెండర్లు పేలిపోయాయి. 20 మీటర్ల ఎత్తు, ఐదు మీటర్ల వ్యాసం ఉన్న ఆరు సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో మండలు ఎగిసిపడ్డాయి.