వెయ్యి మందిని పొట్టన బెట్టుకున్నారు
సోనియాగాంధీ, సీమాంధ్ర పార్టీలపై నాగం ధ్వజం
బలిదానాలు వద్దని వినతి
కరీంనగర్, డిసెంబర్ 3 (జనంసాక్షి) :
యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, సీమాంధ్ర పార్టీల అధ్యక్షులు వచ్చిన తెలంగాణను అడ్డుకుని వెయ్యి మంది విద్యార్థి, యువకులను పొట్టన బెట్టుకున్నారని తెలంగాణ నగార సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం కరీంనగర్‌లోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమాన్ని పోలీసు బలగాలతో అణచి వేసేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమించిన వారిపై వాటర్ కేనన్లు, భాష్పవాయు గోళాలు ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థుల శవయాత్ర కూడా చేసుకునే స్వేచ్ఛ ఇక్కడి ప్రజలకు లేదా అని ప్రశ్నించారు. ప్రజాగాయకుడు గద్దర్ మాట్లాడుతూ, కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రాహుల్‌గాంధీకి పట్టం కట్టేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు ఇక్కడి తల్లుల గర్భశోఖం కనిపించడం లేదా అని నిలదీశారు. తెచ్చేది ఇచ్చేది తామే అంటున్న కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక రాష్ట్రం తెచ్చి చూపించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు తెలంగాణ సాధన కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం భరోసా యాత్రను ప్రారంభించారు.