శాంతి ప్రవచనాల మధ్య రద్దయిన ట్రంప్, కిం చారిత్రక సింగపూర్ శాంతి సమావేశం – కేశవ్
అనుకున్నట్టుగానే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీ , ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం కీ మధ్య సింగపూర్ లో జూన్ 12 న జరగాల్సిన చారిత్రక సమావేశం రద్దయింది. కిం అణ్వాయుధాల రద్దును పెడ చెవిన పెడితే లిబియా పరిస్థితిని ఎదుర్కోవాల్సివస్తుందని మే 21 న అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వ్యాఖ్యలు మరలా శాంతియుత వాతావరణానికి విఘ్నం కలగజేశాయి. కానీ, ఉత్తర కొరియా మే 22 న అంతర్జాతీయ విలేఖరుల మధ్య తన అణ్వాయుధాల పరీక్షా స్థలాన్ని ధ్వంసం చేసింది. మైక్ పెన్స్ వ్యాఖ్యలు ఉత్తర కొరియా అత్మభిమానాన్ని గాయపరచింది. అణు నిరాయుధీకరణ ప్రయత్నంలో తాను ఉన్నప్పటికీ, లిబియా తరహాలో ఉత్తర కొరియాను అణచి ఉంచగలమనీ పెన్స్ చేసిన వ్యాఖ్యలు మరలా శాంతి ప్రక్రియల ప్రయత్నాలకు అడ్డు పడుతున్నాయని ఉత్తర కొరియా భావించింది. ఫలితంగా, సింగపూర్ శాంతి ఒప్పందాల కొనసాగింపు ప్రక్రియకు బ్రేకు పడింది. శాంతిని పెంపొందించుకునే అతి గొప్ప అరుదైన అవకాశాన్ని ఉత్తర కొరియా జార విడుచుకుందని అమెరికా అంటోంది. సింగపూర్ లోని శాంతి సమావేశాలకు ముందే లిబియా మోడల్ ని చవి చూపిస్తామంటూ తమకు రెచ్చగొట్టే విధానం సబబుగా లేదని ఉత్తర కొరియా అంటోంది. శాంతిని కోరుతూ ఇటీవలే శాంతి ప్రవచనాలతో ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచ ప్రజలు ప్రేక్షకుల్లా అంతర్జాతీయ నాటకాన్ని విస్మయంతో తిలకిస్తున్నారు.
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ల మధ్య శాంతి ఒప్పందంతో ఇరు దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. పన్ ముంజన్ ఒప్పందంతో ఘర్షణ వాతావరణానికి తెర పడింది. ద్వీప కల్పంలో అణ్వాయుధాల నిరాయుధీకరణ ఈ ఒప్పందంలో ముఖ్యమైన భాగం. శాంతి, అభివృద్ధి మరియు ఇరు దేశాల మధ్య ఐఖ్యత ఈ ఒప్పందం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. 1910 నుండి మొత్తం కొరియా జపాన్ కాలనీ గా ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ పై పరమాణు బాంబుని ప్రయోగం చేసింది. దాంతో బలహీనమైన జపాన్ కొరియాను తన కాలనీ గా కొనసాగించ లేకుండా స్వేచ్ఛనిచ్చింది. అయినా సరే, తమ సరిహద్దుల్ని తామే తేల్చుకోలేక 25 జూన్ 1950 లో ఉత్తర కొరియా దక్షిణ కొరియా మీద యుద్ధానికి కాలు దువ్వింది. రెండు కొరియాలు 1950 నుండి 1953 వరకు యుద్ధం చేసుకున్నాయి. ఏం సాధించాయో తెలీదు గాని, భారీగా నష్టపోయాయి. సాధారణ ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. తమ దేశాల్ని స్మశాన వాటికలుగా మార్చుకున్నాయి. 1953 వరకు కొనసాగిన ఈ యుద్ధంలో దాదాపు పది లక్షల కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం అంతమైన తర్వాత ఉత్తర కొరియా సోవియట్ రష్యా నియంత్రణ లోకి వెళ్ళింది. దక్షిణ కొరియాను అమెరికా నియంత్రిస్తుంది. ప్రజల జీవితాలు మెరుగు పడలేదు. 1994 నుండి 1998 వరకు ఉత్తర కొరియా భయంకరమైన క్షామాన్ని ఎదుర్కొంది. ఇందులో, రెండు లక్షల నుండి నాలుగు లక్షల ఇరవై వేల వరకు ప్రజలు చనిపోయారు.
1953 తర్వాత మొదటి సారి రెండు దేశాల మధ్య జరిగిన శాంతి ఒప్పందం నిజంగానే రెండు దేశాల్లోనే కాకుండా మొత్తం ప్రపంచానికే హాయిగా ఊపిరి పీల్చుకోనిచ్చింది కానీ, మైక్ పెన్స్ వ్యాఖ్యలు ఉత్తర కొరియా అత్మభిమానాన్ని గాయపరచింది. అణు నిరాయుధీకరణ ప్రయత్నంలో తాను ఉన్నప్పటికీ, లిబియా తరహాలో ఉత్తర కొరియాను అణచి ఉంచగలమనీ పెన్స్ చేసిన వ్యాఖ్యలు మరలా శాంతి ప్రక్రియల ప్రయత్నాలకు అడ్డు పడుతున్నాయని ఉత్తర కొరియా భావించింది. ఫలితంగా, సింగపూర్ శాంతి ఒప్పందాల కొనసాగింపు ప్రక్రియకు బ్రేకు పడింది.. రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం ఒక ఆశా కిరణంగా ప్రజలు ఆశ పడ్డారు. ఎల్లప్పుడూ నిప్పులు కక్కే భారత్, పాకిస్తాన్ మధ్య కూడా ఇలాంటి శాంతి ఒప్పందం నిజంగానే తక్షణ కర్తవ్యం అని కొందరు భావించారు. శాంతి అనేది ఎవరికి అవసరం లేదు? సాధారణ ప్రజలు ప్రపంచం మొత్తం మీద ఎల్లవేళలా కోరుకునేది శాంతినే. యుద్ధం కోరుకునేది సాధారణ ప్రజలు కారు. ప్రజలు కోరుకునేది హిరోషిమా, నాగాసాకీల చీకటి జ్ఞాపకాలను కాదు. అశాంతి, యుద్ధాలూ, భయంకరమైన అణు బాంబులూ అవసరం రాజకీయ నాయకులకే. సామ్రాజ్యవాదులకే. ప్రజలకు కాదు.
ఉత్తర కొరియా యొక్క అణ్వయుధాల ఆపద ఈ రోజు కొత్త విషయం కాదు. 1990 ల లోనే కొరియా అణ్వాయుధాల కోసం సన్నాహం చేస్తోందనీ, ప్లుటోనియం నిల్వలను పెంచుకొని జాగ్రత్త పడుతుందనీ అమెరికన్ ఇంటలిజెన్స్ చెప్పింది. 2006 లో ఉత్తర కొరియా మొట్ట మొదటి సారిగా అణ్వాయుధాలను పరీక్ష చేసింది. 2017 లో ఉత్తర కొరియా దాదాపు 20 క్షిపణులు పరీక్ష చేసింది. అందులో మూడు అత్యంత ప్రమాదకరమైనవి. సెప్టెంబర్ 3 న ఉత్తర కొరియా అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలను పరీక్ష చేసిందని తెలుస్తోంది. నవంబర్ 28 లో ఉత్తర కొరియా అత్యంత ప్రమాదకరమైన హ్వసొంగ్ 15 ఐ సి బి ఎం (ICBM )ను పరీక్ష చేసి అమెరికాకు నిద్రా భంగం కలిగించింది.
అమెరికా కోణంలో చూస్తే, శత్రువును ఎదుర్కోవాలి. లేదా ఆంక్షలను విధించి, ఇతర దేశాలు కూడా వాటిని పాటించేలా చేసి ఆర్థికంగా బలహీనం చేసి, గత్యంతరం లేని పరిస్థితిని సృష్టించాలి. శాంతి ఒప్పందాలకు లొంగడం తప్ప మరో మార్గం ఉండకూడదు. అమెరికా సిరియాలో మొదటి ఎత్తుగడ వాడితే, ఉత్తర కొరియాలో రెండో ఎత్తుగడను వాడింది. ఒక వైపు శాంతి ఒప్పందాలను ఆహ్వానిస్తున్న అమెరికా మరో వైపు దక్షిణ కొరియాలో 28,500 మంది సైన్యాన్నిమోహరించి ఉంది. కొరియా యుద్ధం అంతమైన 1953 నుండే ఉత్తర కొరియాకు పక్కలో బల్లెంగా దక్షిణ కొరియాలో ఈ సైన్యం ఉంది. ఆర్థిక ఆంక్షల కారణంగా ఉత్తర కొరియా ఎగుమతులు 30 శాతానికి పడిపోయాయి. చైనా కూడా ఈ ఆర్థిక ఆంక్షలకు వత్తాసు పలకడం కారణంగా చైనాకు ఉత్తర కొరియా ఎగుమతులు దాదాపుగా 35 శాతం పడిపోయాయి. ఉత్తర కొరియా మీద విధించిన ఆంక్షలు కిం ని ఇలా ఒప్పందానికి వచ్చేలా దారి తీసేలా చేసాయా అనే అనుమానం కూడా ఉంది.
అంతర్జాతీయ శాంతి ప్రవచనాలు పలుకుతూ, అటు ఇరాక్ ని అణ్వాయుధాల సాకుతో ధ్వంసం చేసిన అమెరికాను నమ్మాలా, ఇటు హిరోషిమా, నాగాసాకి అణ్వాయుధాల భీభత్సం కంటే మూడు రెట్లు శక్తివంతమైన అణ్వాయుధాలను పరీక్ష చేసి మరో హిరోషిమాకు మానవాళిని గురి చెయ్యబోయే ఆయుధాలను పరీక్ష చేసిన కిం చేపట్టిన శాంతి చర్య ను నమ్మాలా అనేది సంశయమే. అందుకే, అటు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం, ఇటు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ చెట్టపట్టాలు వేసుకుంటూ కనిపిస్తే ఆనందపు హరివిల్లు ఒకవైపూ, అస్పస్టతలతో కూడుకున్న కారు మేఘాలు మరోవైపు చోటు చేసుకుంటున్నాయి. శాంతి కోరుకున్న ట్రంప్ కి దక్షిణ కొరియాలో అతి పెద్ద సంఖ్యలో సైనిక మోహరింపు అవసరమెందుకు? పైపెచ్చు, దక్షిణ కొరియా లో మోహరించిన అమెరికా సైనిక దళాలు శాంతి ఒప్పందం తర్వాత కూడా వెనుతిరగక పోవడం, అమెరికా సైనిక మోహరింపు చర్యను మూన్ సమర్ధించడం, శాంతి చర్చలకు ఈ సైన్యం అవసరమని చెప్పడం మరింత విస్మయం కలిగించే విషయం. శాంతి చర్చలకు ఇంత పెద్ద సంఖ్యలో బయటి దేశం సైన్యం అవసరమేమిటి? ఉత్తర కొరియా ఆరవ పరీక్ష సెప్టెంబర్ 2016 లో జరిపింది. 2017 లో ఏడవ పరీక్ష జరిపింది. ఈ రెండు పరీక్షలు అత్యంత శక్తివంతమైన అణ్వాయుదాలను ఉత్తర కొరియా కు అందించాయి. హిరోషిమా నాగాసాకి ల్లాంటి నగరాల్ని మూడింతలు భయంకరంగా నాశనం చెయ్య గలిగే శక్తి ఈ పరీక్షలు కొరియాకు ఇచ్చాయనే విమర్శలు కిం మీద ఉన్నాయి.
అయితే ఈ ఒప్పందాలు ఈ రోజు కొత్తేమీ కాదు. కానీ ఇవి అమలయిన దాఖలాలు లేవు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఈ రకమైన ఒప్పందాలు రెండు దేశాల మధ్య జరిగాయి. 1992 లో ఒకసారి ప్యోంగ్ యాంగ్ సియోల్ తో అణ్యాయుధాల నిరాయుధీకరణ ఒప్పందం జరిగింది. 1994 లో కూడా అమెరికాతో ఇలాంటి ఒప్పందం జరిగింది. 2005 లో ఉత్తర కొరియా యొక్క నాలుగు పొరుగు దేశాలతో కూడా ఒప్పందం జరిగింది. 2012 లో మరో ఒప్పందం ప్యోంగ్ యాంగ్ కీ, వాషింగ్టన్ కి మధ్య జరిగింది. కానీ, ఒప్పందాలు ఒప్పందాలు గానే మిగిలిపోయాయి.
అన్ని వ్యాపారాల్లాగానే యుద్ధం కూడా వ్యాపారమే. యుద్ధం సామ్రాజ్యవాద దేశాలకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. రెండు ప్రపంచ యుద్ధాలను బహూకరించిన సామ్రాజ్య వాద దేశాల నుండి ప్రపంచ మానవాళికి చేదు అనుభవాలు ఇదివరకే ఉన్నాయి. పెట్టుబడులు అంతర్జాతీయ మార్కెట్లో స్వైర విహారం చెయ్యడానికీ, పెట్టుబడిదారీ వ్యవస్థ పదిలంగా ఉండి కార్పోరేట్లకు బంగారు పంటల్ని అందించడానికీ, ప్రపంచీకరణ మాయ మాటలతో ప్రపంచమంతా గ్లోబల్ మార్కెట్ గా మార్చేసి, ప్రపంచాన్ని ఓ సంతగా తీర్చి దిద్ది వ్యాపారం చేసుకోవడానికీ అప్పుడప్పుడూ వీరికి కూడా కాస్త శాంతియుతమైన పరిస్థితులు కావాలి, శాంతి ఈ కోణంలోనే వచ్చిందా, లేదా సహజంగానే ఇరు దేశాలు శాంతిని కోరుకున్నాయా అనేది కాలమే చెబుతుంది. ఒక వైపు, చమురు దేశాల్లో చమురు మీద ఆధిపత్యం కోసం విధ్వంసం జరుపుతూనే, మరోవైపు ఉత్తర దక్షిణ కొరియాల్లో శాంతి కోరుకోవడంలోని. సామ్రాజ్య వాద దేశాల ద్వంద్వ నీతిని అర్థం చేసుకోవడంలోనే మన చైతన్యం ఉంది. ఇండియా, పాకిస్తాన్ అయినా, చమురు దేశాలయినా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా లయినా యుద్ధం గురించి మాట్లాడినా, శాంతి గురించి మాట్లాడినా ప్రయోజనం పొందేది ఒక శాతం ధనికులూ, నలిగి పోయేది తొంబై తొమ్మిది శాతం పేదలే. ఉత్తర, దక్షిణ కొరియా ప్రజలు శాంతినే కోరుకుంటున్నారు. కానీ, అమెరికా, రష్యాలు, చైనాలు కొరియాలో ఏం కోరుకుంటున్నాయో, ఆయుధాలమ్మే దేశాలూ, ఆయుధాలతో వ్యాపారం చేసే దేశాలూ ఏం కోరుకుంటున్నాయో కాలమే చెప్పాలి. అందుకే, శాంతి ఒప్పందం ఆదిలోనే బెడిసి కొట్టింది. అన్ని శాంతి ఒప్పందాల్లాగానే ఇది కూడా తాత్కాలిక ఉపశమనం కోసమేనా అన్నది కిం, ట్రంప్ ల శాంతి ఒప్పందం తర్వాత రద్దయిన జూన్ 12 సింగపూర్ శాంతి సమావేశం మరిన్ని గుణ పాఠాలను నేర్పుతోంది. 9831314213