శ్రీనగర్‌ నిట్‌లో ఉద్రిక్తత

3A

– ఆందోళనలో ఆంధ్రా, తెలంగాణ విద్యార్థులు

శ్రీనగర్‌,ఏప్రిల్‌ 6(జనంసాక్షి): శ్రీనగర్‌లోని నేషనల్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఆప్‌ టెక్నాలజీ (నిట్‌) క్యాంపస్‌ ఉధ్రిక్తంగా మారింది. ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా నిట్‌ క్యాంపస్‌లో స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య గొడవ కాస్తా ఇప్పుడు తీవ్రం అయ్యింది. దీంతో కాశ్మీరీయేతర విద్యార్థలుపై దాడులు పెరిగాయి. ఈమేరకు మ్యాచ్‌ రోజున భారత్‌కు మద్దతునిచ్చారని ఆరోపిస్తూ బుధవారం తెలుగు రాష్టాల్రకు చెందిన పలువురు విద్యార్థులపై దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా, క్యాంపస్‌లోని మరో 65 మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. అయితే  ఉదయం కూడా నాన్‌లోకల్‌ విద్యార్థులపై స్థానికులు దాడి చేసిన ఘటనతో క్యాంపస్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మేనేజ్‌మెంట్‌ వర్సిటీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. కాలేజీ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేయాలని డిమాండ్‌ చేశారు. క్యాంపస్‌లో జాతివ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నాన్‌ లోకల్‌ విద్యార్థులపై రాళ్లతో దాడి చేస్తున్న ఘటనలు ఈ మధ్య క్యాంపస్‌లో ఎక్కువయ్యాయి. దాంతో భద్రతను పెంచాలని ఆ విద్యార్థులు నిట్‌ డైరక్టర్‌ను కోరారు. ఎన్‌ఐటీ విద్యార్థులపై స్థానికులు రాళ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ విద్యార్థులు మంగళవారం చేపట్టిన శాంతియుత ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో పలువురు తెలుగు విద్యార్థులు చదువుతుండటంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి వెళ్లిన  ద్విసభ్యకమిటీ బుధవారం నిట్‌ను సందర్శించింది. కళాశాల అధికారులతో ద్విసభ్య కమిటీ సభ్యులు చర్చలు జరిపారు. ఇక్కడ చదువుకుంటున్న ఇతర రాష్టాల్ర  విద్యార్థులు కమిటీ ముందు ఐదు డిమాండ్లను ఉంచారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కళాశాల సిబ్బందిపై చర్య తీసుకోవాలని  డిమాండ్‌ చేశారు.  తెలుగు విద్యార్థి హిమవంత్‌ తన ఆవేదనను విూడియాకు ఫోన్‌ చేసి పంచుకున్నాడు. భారత్‌- పాక్‌ మ్యాచ్‌ ప్రారంభంలో స్థానికులు మాపై రాళ్లు విసిరారు. దీనిని నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన చేపట్టిన తమపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్‌కు చెబితే మమ్మల్ని ఫెయిల్‌ చేస్తామని బెదిరించారు. శ్రీనగర్‌ నిట్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన 120 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 50 మందికి లాఠీఛార్జి సందర్భంగా గాయాలయ్యాయి. ఐదుగురు విద్యార్థులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. చాలామంది నడవలేని స్థితిలో ఉన్నారు. విద్యార్థులందరూ

సురక్షితంగానే ఉన్నారని డైరెక్టర్‌ చెబుతున్నప్పటికీ… అందరినీ లోపల కొడుతున్నారు. ఎవరినీ లోపలికి రానివ్వడంలేదు. మమ్మల్ని బయటకు పోనివ్వడం లేదు. విూడియా సాయం కూడా అందనివ్వడం లేదు. ఆడవాళ్లని కూడా చూడకుండా విద్యార్థినులపైనా లాఠీ ఝళిపించారు. వికలాంగులను కూడా గదుల్లోకి తీసుకెళ్లి మరీ కొడుతున్నారు. అమ్మాయిలపై అత్యాచారం చేస్తాం… ఎవరేం చేస్తారని పోలీసులు భయపెడుతున్నారు. మమ్మల్ని శ్రీనగర్‌ ఎన్‌ఐటీ నుంచి వేరే ఎన్‌ఐటీకి మార్చాలని కోరాడు.

నిట్‌ వ్యవహారాలపై స్మృతి ఆరా

శ్రీనగర్‌లోని ఎన్‌ఐటీ పరిణామాలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. జమ్ముకశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీతో తాను మాట్లాడినట్లు ఆమె తెలిపారు. విద్యార్థులకు భద్రత కల్పిస్తామని ఆమె తెలిపారన్నారు. ఈ ఘటనపై విచారణ కమిటీని వేస్తామని ఆమె చెప్పారన్నారు. ఇప్పటికే శ్రీనగర్‌ ఎన్‌ఐటీకి కేంద్ర బృందం చేరుకొంది. ఈ బృందం 11 వరకు శ్రీనగర్‌లోనే ఉంటుంది. ఎన్‌ఐటీలోనే ఉండి పరిస్థితిని సవిూక్షిస్తుందని స్మృతి పేర్కొన్నారు.