సంపాదకీయం

శాంతి స్థాపనే

ధ్యేయం కావాలి

కీయం    ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్‌-పాకిస్తాన్‌ వైపు చూస్తున్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్‌లో రెండో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడింది. నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) ఈ ఎన్నికల్లో విజయఢంకా మోగించింది. ఎన్నికల ప్రచారంలోనూ, ఎన్నికల మేనిఫెస్టోలోనూ నవాజ్‌ షరీఫ్‌ దేశంలో శాంతిస్థాపనకు ప్రాధాన్యమిస్తానని పేర్కొన్నారు. సోదర దేశం భారత్‌తోనూ స్నేహాన్ని కోరుకుంటున్నామని, చర్చల ద్వారా సమస్యలేమైనా ఉంటే పరిష్కరించుకుంటామని ప్రకటించారు. పాక్‌ మాజీ సైనిక పాలకుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ భారత్‌తో అనుసరించిన సంబంధాలకు పూర్తిగా భిన్నమైన హామీలు నవాజ్‌ షరీఫ్‌ ఇచ్చారు. పాకిస్తాన్‌ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం దక్కని మాజీ సైనిక పాలకుడు ముషారఫ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టిస్తున్న భారత్‌తో యుద్ధం చేస్తామని ప్రకటించి తన యుద్ధకాంక్షను మరోసారి వ్యక్త పరిచాడు. దేశంలో ఎప్పుడూ అల్లకల్లోలం, అశాంతి, అలజడి, బాంబుదాడులు, హత్య ప్రతిహత్యలు, సున్నీలు-షియాల మధ్య ఘర్షణలతో పాకిస్తాన్‌ ఆర్థికంగా చితికిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ప్రజలు భయంభయంగా బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 2008లో ముషారఫ్‌ నేతృత్వంలోని సైనిక పాలన అంతమొందింది. అప్పుడు నిర్వహించిన ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తున్న పాకిస్తాన్‌ పీపుల్‌ పార్టీ అధినేత్రి బేనజీర్‌ భుట్టోను అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఆ ఎన్నికల్లో పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ ఘన విజయం సాధించింది. బెనజీర్‌ భర్త అసీఫ్‌ అలీ జర్దారీ పాకిస్తాన్‌ అధ్యక్షుడయ్యాడు. ఆ పార్టీ ముఖ్య నేతలు యుసుఫ్‌ రాజా గిలానీ, రాజా పర్వేజ్‌ అష్రఫ్‌ ప్రాధానులయ్యారు. పాకిస్తాన్‌లో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడిందన్న మాటగానే పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పేమీ రాలేదు. ఫలితంగా ప్రజలు అదే అశాంతి, అలజడి మధ్య జీవనం సాగించాల్సి వచ్చింది. ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. అమెరికా ఆధిపత్యం సరేసరి. అధికార పక్షంలో పెరిగిపోయిన అవినీతి పీపీపీపై తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్‌(ఎన్‌) ఘన విజయం సాధించింది. నవాజ్‌ షరీఫ్‌ పాకిస్తాన్‌కు మూడో సారి ప్రధానమంత్రి అయి రికార్డు సృష్టించారు. ప్రజల్లో పెరిగిన పోయిన అసహనాన్ని తీర్చేందుకు ప్రయత్నిస్తానని, శాంతి స్థాపన తన ధ్యేయమని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. పేదరిక నిర్మూలనకు పాటు పడతానని పేర్కొన్నాడు. ఈ హామీలే పీఎంఎల్‌ (ఎన్‌) గెలుపునకు దోహదపడ్డాయి. తమ బతుకులు మార్చే పాలకుల కోసం పాకిస్తానీలు ఎంతగా ఎదురు చూస్తున్నారో తేటతెల్లమైంది. అన్నట్టుగానే పాకిస్తాన్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నవాజ్‌ షరీఫ్‌ మీడియాతో మాట్లాడుతూ భారత్‌కు స్నేహ హస్తమందించారు. కాశ్మీర్‌తో సహా అన్ని సమస్యలను చర్చల ద్వారా సుహృద్భావ పూరిత వాతావరణంలో పరిష్కరించుకుంటామని తెలిపారు. అయితే పాకిస్తాన్‌లో ప్రజాస్వామిక ప్రభుత్వాల కంటే సైనికులే శక్తిమంతులు అని పలు సందర్భాల్లో స్పష్టమైంది. ప్రజాస్వామిక ప్రభుత్వాలను దింపి సైనికాధిరులు అధికారపగ్గాలు చేపట్టిన విషయం విధితమే. ఇప్పుడు శాంతిస్థాపనకు నవాజ్‌ చేపడుతున్న చర్యలకు సైన్యం నుంచి ఎంత వరకు మద్దతు లభిస్తుందనేది నిలకడమీదనే తేలే అవకాశముంది.
ఆయన ప్రకటన చేసిన మరుసటి రోజే పాకిస్తాన్‌ సైనిక బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పూంచ్‌ సెక్టార్‌లో కాల్పులకు తెగబడ్డాయి. ఓ సైనికాధికారిని హత్య చేశాయి. ఇది యాథృచికంగా జరిగిందో లేక సైన్యం కావాలని చేసిందోగాని సైన్యం ప్రతిఘటనకు సంకేతంగా చూడాల్సిన అవసరమైతే లేదు. భారత్‌-పాకిస్తాన్‌ దేశాలు తమ వార్షిక బడ్జెట్‌లో 75 నుంచి 80 శాతం వరకూ రక్షణ రంగానికి ఖర్చు చేస్తున్నాయి. ఫలితంగా ఇరు దేశాల్లోనూ ప్రాథమిక విద్య కునారిల్లింది. పిల్లలు, ప్రజలకు పౌష్టికాహారం కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఇరు దేశాల్లోని అశాంతిని ఆసారాగా చేసుకొని ప్రపంచంలోని అగ్రదేశాలు తమ ఆయుధాలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాయి. ఫలితంగా ఇరుదేశాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఇప్పుడు ఇరు దేశాలు దయాదుల్లా కాకుండా సోదర దేశాల్ల వ్యవహరించాలి. రక్షణ రంగానికి బడ్జెట్‌ కేటాయింపులను తగ్గించుకొని దేశాల అభివృద్ధికి పాటుపడాలి. శాంతిస్థాపన అంటే చర్చలు మాత్రమే కాదు. ఎల్‌వోసీలో ముళ్ల కంచె మాత్రమే ఉండాలి. ఇరు దేశాలు సైన్యాన్ని ఉపసంహించుకునే స్థాయికి స్నేహబంధం బలపడాలి. ఇందుకోసం ఇరు దేశాలు ఒక్క అడుగు ముందుకు వేయాలి.