సంసంపాదకీయం

ఎవరిని మోసం చేద్దామని?

‘తెలంగాణ సాధన కోసం పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు ఈనెల 30న నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం’ అని ఈ ప్రాంత కాంగ్రెస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర నాయకులు ఇటీవల మూకుమ్మడి ప్రకటనొకటి చేశారు. తెలంగాణ సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు సీమాంధ్ర సర్కారు ఎన్నో ప్రయత్నాలు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఇందుకు ఆయన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది. దీంతో రెచ్చిపోయిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్కడికక్కడ పోలీసు పికెట్లు పెట్టి, వేలాది మంది పోలీసులను మోహరింపజేసి 15 వేలకు మందికి పైగా తెలంగాణవాదులను అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు వెళ్తున్న అన్ని రహదారులను దిగ్బంధించి నగరానికి ఎవరూ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. 20 వేల మందికి పైగా పోలీసులను నగరంలో మోహరింపజేసి చలో అసెంబ్లీని భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీకి ఐదంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. బారికేడ్లు, ముళ్ల కంచెలు సరేసరి. ఇంతటి నిర్బంధాన్ని అధిగమించి తెలంగాణ ప్రజలు అసెంబ్లీ వైపు దూసుకొచ్చారు. అసెంబ్లీ మొదటి గేట్‌ ఎదుట ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. వేలాది మందిని అరెస్టు చేసినా, హైదరాబాద్‌లో అప్రకటిత కర్ఫ్యూ విధించినా సీమాంధ్ర సర్కారు లక్ష్యం మాత్రం నెరవేరలేదు. అసెంబ్లీ గేట్‌ ఎదుట నల్లజెండాలతో తెలంగాణవాదులు జై తెలంగాణ అని నినదించారు. బాష్పవాయుగోళాలు, రబ్బరు బుల్లెట్లు, లాఠీలకు ఎదురొడ్డి నిలిచారు. నాలుగు దశాబ్దాలుగా తమ ఆకాంక్ష సాకారం చేస్తున్న పోరాట స్ఫూర్తి ఇనుమడింపజేశారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ చలో అసెంబ్లీ విజయవంతం కావడంతో సీమాంధ్ర సర్కారు దిమ్మ తిరగగా, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి మాత్రం గట్టి దెబ్బే తగిలింది. అణచివేత ద్వారా తెలంగాణ ఉద్యమానికి ముగింపు పలకాలని చేసిన ప్రయత్నం తుత్తినియలైంది. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కాస్త ఆలోచనలో పడినట్టుగా సంకేతాలు పంపుతోంది. అదే సమయంలో తెలంగాణ సమస్యకు ఏదో ఒకరకంగా చెక్‌ పెట్టాలని చూస్తోంది. ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎదుట ఉన్న మొదటి ప్రత్యామ్నాయం తెలంగాణకు భారీ నిధులతో ప్యాకేజీ ఇవ్వడం. అదీ కాదంటే రాయలసీమను రెండుగా విభజించి కర్నూల్‌, అనంతపురం జిల్లాలకు తెలంగాణతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయడం. లేదా రాష్ట్రాన్ని యథాతదంగా కొనసాగించి తెలంగాణ అంశాన్ని పూర్తిగా అణచివేసేందుకు ప్రయత్నించడం. ఇవేవి కాంగ్రెస్‌ పార్టీ బాహాటంగా చెప్పకున్నా ఏఐసీసీ కార్యాలయం, టెన్‌ జన్‌పథ్‌ నుంచి మీడియాకు ఈమేరకు లీకులందుతున్నాయి. చలో అసెంబ్లీని అణచాలని ప్రయత్నించి విఫలమైన కాంగ్రెస్‌ మళ్లీ తప్పిదం చేయకుండా ఉంటుందనుకుంటే అంతకు మించిన అత్యాశ మరొకటి ఉండదు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అంశాన్ని వీలైనంతగా సాగదీయాలనే ప్రయత్నించింది. ఇంకా అవే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అందులో భాగంగానే వివిధ ప్రత్యామ్నాయాలు తెలంగాణ ప్రజలకు చూపుతూ గందరగోళ పరిచే ప్రయత్నం చేస్తుంది. దానిని రక్తికట్టించేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు పెద్ద నాటకానికే తెరతీశారు. 2009లో వీర తెలంగాణవాదిగా ముద్రవేసుకొని మంత్రి పదవి ఇవ్వగానే సందర్భాన్ని బట్టి తెలంగాణపై స్పందిస్తున్న జానారెడ్డి ఈ నాటకాన్ని రక్తికట్టించే ప్రయత్నం చేశారు. అధిష్టానం డైరెక్షన్‌లో తనదైన స్క్రీన్‌ ప్లే అల్లి తెలంగాణ సాధన కోసమంటూ ఈనెల 30న నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఒక అంశంపై సభలు సమావేశాలు పెట్టుకుంటే తప్పులేదు. కానీ కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సభ పెట్టి ఏం చెప్తారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే రెండు పర్యాయాలు తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. 2009లో తెలంగాణ వ్యాప్తంగా ప్రజ్వరిల్లిన మహోద్యమంతో బెంబేలెత్తి అదే ఏడాది డిసెంబర్‌ 9న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. తర్వాత శ్రీకృష్ణ కమిటీ పేరుతో కొంత, సంప్రదింపుల పేరుతో మరికొంత సమయాన్ని వృథా చేసింది. మూడేళ్లుగా తెలంగాణ అంశాన్ని వీలైనంతగా సాగదీయాలనే ప్రయత్నించింది. ఆ కొనసాగింపుల్లో భాగమే 30 నాటి కాంగ్రెస్‌ నాయకుల బహిరంగ సభ. ఆకాంక్షల సాధన కోసం ప్రజలు సత్యాగ్రహాలు, ఉద్యమాలు, సమ్మెలు నిర్వహిస్తారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన పోరాటం సాగిస్తాయి. కార్మిక సంఘాలు డిమాండ్ల సాధన కోసం హర్తాల్లూ, సమ్మెలు చేస్తాయి. కానీ అధికారంలో భాగస్వాములుగా ఉన్న వ్యక్తులు సభ పెట్టడం దేనికి సంకేతం. తాము అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నా వివిధ కారణాలతో తెలంగాణ ఏర్పడటం లేదని ప్రజలకు చెప్పుకోవాలనా. తాము తెలంగాణ సాధన కోసం ముందుండి ఉద్యమాల్లో పాల్గొన్నామని చెప్పేందుకా? లేక తాము అశక్తులమని చేతనైనంత వరకూ పోరాడుతున్నామని, తెలంగాణ కోసం పోరాడుతున్న తమకు ఓట్లు వేసి గెలిపించాలనా? అసలు టీ కాంగ్రెస్‌ నేతల వైఖరేంటో? 30 సభ వెనుకున్న వ్యూహ ప్రతివ్యూహాలేమిటో ఎవరికీ అంతు పట్టని విషయం. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు పదవులు లేకుండా ఉండలేరనే అభిప్రాయం కాంగ్రెస్‌ అధిష్టానానికి బలంగా ఉంది. కాంగ్రెస్‌ అధిష్టానానికి వీరంటే చులకన భావం కూడా అందుకే. ఆ కారణంగానే తెలంగాణ నేతలు ఎన్ని డెడ్‌లైన్లు పెట్టినా సోనియా అంతగా పట్టించుకోలేదని అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో సానుభూతి పెంచుకునేందుకు తాము పోరాడుతున్నామనే భావన కల్పించడం కలిసి వస్తుందని టీ కాంగ్రెస్‌ నేతలు అనుకుంటున్నారు. పనిలో పనిగా అధిష్టానం నుంచి ఏదో చిన్నపాటి కదలిక వచ్చినా అది తమకు లాభిస్తుందనే యోచనలో ఉన్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మూకుమ్మడిగా అధిష్టానంపై ఒత్తిడి పెంచితే తెలంగాణ ఏర్పాటు అంత కష్టమేమీకాదు. కానీ ఆ దిశగా ప్రయత్నించడానికి కూడా వీరు సిద్ధంగా లేరు. తెలంగాణ ఇచ్చే శక్తులో ఉన్న పార్టీ నేతలు వీధి పోరాటాలకు దిగితే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయి. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సభలే కాదు వీధి పోరాటాలెన్ని చేసినా వారిని ప్రజలు విశ్వసించరు. పదవులు వదలుకునేందుకు సిద్ధపడితే అధిష్టానం దిగిరావడం ఖాయం. సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఏ తప్పటడుగు వేసినా తెలంగాణలో ఆ పార్టీకి తమిళనాడు, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ లాంటి పరిణామాలకు ఎదురుకాక తప్పదు. ప్రజలను మోసం చేద్దామని కాంగ్రెస్‌ పార్టీ అనుకుంటే అందుకు తగ్గ ప్రతిఫలాన్ని కూడా అనుభవించి తీరుతుంది. పాదకీయం