సజీవంగా ఉన్న ముఠాతత్వం

మఠాకక్షలు, ముఠా కొట్లాటల గురించి మాట్లాడితే అదేదో పాతకాలం విషయం అయినట్టు గడిచిపోయిన విషయాన్ని అనవసరంగా పదేపదే తవ్వి తీసి వినోదిస్తున్నారని మీడియాపైన, విశ్లేషకులపైన విరుచుకుపడడం రాయలసీమకు చెందిన నాయకులు ఈ మధ్య నేర్చుకున్నారు. ప్రతీ హత్యనూ ఫాక్షన్‌ హత్యగా ప్రతీ కొట్లాటనూ ఫాక్షన్‌ కొట్లాటగా వర్ణించే మీడియా అజ్ఞానం కూడా దీనికి దోహదం చేసింది. ఫాక్షన్లు ఇప్పటికీ ఉన్నాయా అంటే మనం దానికి ఇచ్చుకునే అర్థాన్ని బట్టి ఉంటుంది.
గుంపును పోగు చేసి సామాజిక పెత్తనం కోసం బల ప్రయోగం చేసే దురాచారంగా మొదలై, స్వాతంత్య్రనంతరం రెండవ తరం నుంచి రాజకీయ, ఆర్థిక ఆధిపత్యం కోసం ముఠాలు కట్టి బల ప్రయోగం చేసే విధ్వంసకర వ్యూహం రూపం తీసుకున్న సంస్కృతిగా దానిని అర్థం చేసుకుంటే అదెక్కడి పోలేదు. అవసరాన్ని బట్టి, ఇతర పరిస్థితులను బట్టి, దాని పద్ధతులూ పరికరాలూ మారి ఉండవచ్చు. ప్రతి చెట్టు చాటున, పుట్ట చాటున టీవీ కెమెరాలున్న ఈ రోజుల్లో బాంబులు పట్టుకొని తిరగడం తెలివితక్కువతనం అన్న గుర్తింపు వచ్చి ఉండవచ్చు. ప్రజల్లో తెలివితేటలు పెరగడం వల్ల హింస ప్రతిసారీ చేసి చూపించవలసిన అవసరం లేకుండవచ్చు. పెరిగిన తెలివిలో భాగంగా ఆత్మ సంరక్షణకు అవసరమైన భయం కూడా పెరిగిన కారణంగా బెదిరింపుతో సగం పనులు జరిగిపోతుండవచ్చు.
మొన్నటి ఎన్నికల్లో కడప, అనంతపురం జిల్లాలో రెండు ప్రధాన పక్షాలు నడుచుకున్న తీరు మారిందేమీ లేదని మరొక్కసారి రుజువు చేసింది. రెండు పక్షాలు అని నొక్కి చెప్పడం అవసరం, ఎందుకంటే దౌర్జన్యమంతా కాంగ్రెస్‌ వారిదే అన్న అభిప్రాయం ప్రధాన మీడియా బలంగా కలిగించింది. మీడియా అనుకూలంగా ఉండడం వల్ల చంద్రబాబు నాయుడంత ప్రయోజనం పొందుతున్న నాయకుడు సమకాలీన భారత రాజకీయల్లో లేడేమో. అతని అబద్ధాలు, కప్పదాట్లు సునాయాసంగా సాగిపోతున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో నోరున్న రెండు ప్రధాన రాజకీయ శక్తులను వామపక్షాలు, తెరాస తనవెంట తిప్పుకోవడం వల్ల అతని పని మరీ సులభం అయిపోయింది. ఉదాహరణకు రెండవ దశ పోలింగ్‌ జరిగిన రాత్రి మరుసటి రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన దౌర్జన్యమంతా జేసీ ప్రభాకర్‌రెడ్డి అకౌంట్‌కే జమ చేయబడిందిగానీ నిజానికి ఇద్దరూ యదేచ్చగా హింసకు పాల్పడ్డారు. ఇంకా చెప్పాలంటే మొదలపు పెట్టింది. తెలుగు దేశం వారే. అంతా అయిపోయిన తరువాత తూకం వేస్తే ఎక్కువ హింస చేసిది వారే.
అయితే ఈ తూకం దగ్గర ఆగిపోవడమే పొరపాటు అవుతుంది. ఆధిపత్య హింస కేవలం ఒక ఉదంతం కాదు, కాలక్షేపానికి వస్తువు అంతకంటే కాదు. సార్వత్రిక భయం దాని అని వార్య పర్యవసానం. రేపు తాడిపత్రిలో తెలుగు దేశం అభ్యర్థి గెలిచినా, కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచినా రాబోయే అయిదు సంవత్సరాల్లో వారి నిర్వాకాన్ని ఆ ఊరి ప్రజలు దైర్యంగా ప్రశ్నించిగలరా? ఏప్రిల్‌ 24 నాటి రాళ్ల వర్షాన్ని తలచుకొని నొరనొక్కేసుకొరే?
ప్రజాస్వామ్యానికి అవసరమైన అన్ని వ్యవస్థాగతమైన లక్షణాలనూ ఆచరణ రీతులనూ ధ్వసం చేయడం, అసాధ్యం చేయడం, భయంతో కప్పేయడం హింసాత్మక ముఠారాజకీయాల గుణం. అదే దాని వల్ల ప్రజాజీవితానికి ఉన్న ప్రధాన నష్టం.
కడప జిల్లాలో దీని ముఖ చిత్రం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. హింసాత్మక సంఘటన లు అనంతపురంలో ఎక్కువగా జరగడం వల్ల కడపలో ముఠా రాజకీయాలు గడిచిపోయిన కాలానికి చెందినవన్న అభిప్రాయం కలుగవచ్చునుగానీ అది ముఠా రాజకీయాలను కేవలం బాంబుదాడులుగా, గృహ దహనాలుగా అర్థం చేసుకోవడం వల్ల కలిగే భ్రమ. ప్రపంచ జ్ఞానం తెలివితేటలు పెరగడం వల్ల ముందు చూపు తో మౌనంగా తల ఒగ్గడం ప్రత్యక్ష హింస కంటే బహుశా నష్టకరమైనది.
కడప జిల్లాలో మొదటి పులివెందుల్లోనూ కాలక్రమంలో ఇతర నియోజక వర్గాల్లోనూ చెప్పుకోదగ్గ మోతాదులో ఈ స్థితిని తీసుకురావడంలో వైఎస్‌ రాజశేఖరెడ్డి కృతకృత్యుయ్యాడు. పులివెందుల్లో సహితం చాలా గ్రామాల్లో రచ్చబండ దగ్గర ప్రజలతో మాట్లాడితే వైఎస్‌ను వ్యతిరేకించే వాళ్లు చాలా మందే ఉన్నారన్న సంగతి అర్థమౌతుంది. అయితే ప్రత్యామ్నాయ నాయకుడు ఎదిగే పరిస్థితి లేనప్పుడు మనం వ్యతిరేకించి ఎందుకు నష్టపోవాలి అన్న ఆలోచనతో అతనికి అనుకూలంగానైనా ఉంటారు లేదా నెరూమూసుకొనైనా ఉండిపోతారు.
ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒక రాజకీయ నాయకుడిని వ్యతిరేకించడానికి ప్రత్యామ్నాయ నాయకుడెందుకు, అతను నిలదొక్కువడం ఎందుఉ అన్న ప్రశ్న రావచ్చు. రాజకీయ జీవితం ముఠాలుగా చీలిపోయిఉన్న సంస్కృతిలో ఈ ఆలోచనకు తావులేదు. బలంగా ఉన్న ముఠాలో భాగం కాకపోతే, కనీసం తటస్థంగా నైనా ఉండకపోతే, మనపనీ ఏదీ జరగదు, ప్రభుత్వం నుంచి అందవలసినదేది అందరు, గ్రామ వనరుల్లో ఏ వాటా దక్కదు. ఇవేవి అక్కర్లేని అదృష్టవంతులకు వ్యక్తి స్వేచ్చ ఆచరీణయం అయి ఉండవచ్చునుగానీ సాదారణ మానవులకూ కాదు.
మరి ప్రత్యామ్నాయ నాయకుడెందుకు ఎదగలేదు? తెలుగు దేశం పార్టీ ఉంది వామపక్ష పార్టీలున్నాయి, వాటి ఆసరాతో ఎదగలేడా అన్న సందేహం రావచ్చు. ఎదిగితే చంపేస్తారా ఏం అనవచ్చు అక్కడిదాకా వస్తే ఆ పనీ చేస్తారనడానికి కావలసినన్ని దృష్టాంతాలు లేకపోలదు గానీ అక్కడి దాక రాక ముందే ఉక్కిరి బిక్కిరి చేసి విరమింప చేస్తారు. అతను కాంట్రాక్టరయితే అతనికి కాంట్రాక్టులు దక్కవు. అతని వ్యాపారాలు సజావుగా సాగవు. ముఠా సంస్కృతిలో ప్రభుత్వ ఉద్యోగులూ భాగమే కాబట్టి మండలాఫీసు నుంచి పోలీస్‌స్టేషన్‌ దాకా ఎక్కడా అతని పనులు జరగవు.
ప్రజలు భాగమే కాబట్టి ఊరిలో అతని మనుషుల దైనందిన బతుకులు కూడా దుర్బరంగా తయారవుతాయి. ఇవన్నీ తట్టుకుని ఒక పరిమిత ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా ఎదిగినవారు లేకపోలేదు గానీ అది చాలా కష్టం కాబట్టి పరిమితంగానే ఉండిపోయింది. ఈ స్థితి ఇతరులకు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోనూ ఉంటుంది గానీ అక్కడ మాత్రం తనకున్న అన్ని వనరులూ అవకాశాలూ వెచ్చించి ప్రత్యామ్నాయ నాయకులను ఏరి ప్రోత్సహించడం, ఎదగడానికి సకల వసతులూ కల్పించడం, కొట్లాలు పెట్టి ప్రత్యర్థిని లొంగదీసుకోవడం వైఎస్‌ అమలు చేసిన వ్యూహం ఇందులో ఎప్పటికప్పుడు విజయం సాధించడం అతని సక్సెస్‌ వెనకున్న రహస్యం. ఇది కలిగించగల నష్టానికి తట్టుకోలేని వారు దారిలోనే దాసోహం అంటారు.
ఈఎన్నికల్లో మైదుకూరు తెలుగు దేశం అభ్యర్థి స్వంత ఊరిలో అతని బంధువులనుంచే కాంగ్రెస్‌ వారు ప్రత్యర్థులను తయారు చేసి చీలికకు బీజం వేయగా, ఆ ఊరికి కడప పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రచారానికొచ్చినప్పుడు దీనికి నిరసనగా తెలుగు దేశం వారి ప్రోదల్బలంతో గ్రామస్థులంతా ఇళ్లకు తాళాలు వేసి పుణ్యక్షేత్రాలకు వెళ్లిపోయారు. బహుశ అతని ప్రోగ్రాం జరిగితే ప్రత్యర్థులు వచ్చిన వారి అండ చూసుకొని కాలుదువ్వి గొడవ పెట్టుకుంటారన్న భయం కూడా దీనికి కారణం కావచ్చు కానీ చివరకు పోలింగ్‌ జరిగేనాటికి ఊరిలో మెజారిటి అయిన తెలుగు దేశం వారు రాజీకొచ్చి అసెంబ్లీకి తెలుగుదేశానికి పార్లమెంటుకు కాగ్రెసూకు వోట్లు వేయించారని వినికిడి. ఇది నిజమైతే వైఎస్‌ వ్యూహాలంటే ఎంత భయమో అర్థం అవతుంది.
ఆ ఒక్క నియోజక వర్గంలోనే కాదు ఫాక్షనిస్టులు నిలబడ్డ అన్ని నియోజక వర్గాల్లోనూ ఇరు పార్టీల వైఖరీ ఒకటే. తమకు ప్రాబల్యం ఉన్న గ్రామాలకు ఇతరులు ప్రచారానికి రావడానికి వీలులేదు. కానీ ఇతరులకు ప్రాబల్యం ఉన్న గ్రామాలకు తాము పెద్ద గుంపును తీసుకుని రచ్చ చేస్తూ ప్రచారానికి పోతారు. అట్లా వచ్చిన వారిపైన ప్రత్యర్థులు గతంలో బాంబులు వేసేవారేమో గానీ ఇప్పుడు తెలివిగా తమ అనుచరుల్లోని స్త్రీలనూ దళితులనూ రంగంలోకి దింపి వాళ్లచేత తిటిస్తున్నారు. రాళ్లు వేయిస్తున్నారు. దెబ్బలు తింటే ఈ ప్రజలు తింటారు. ప్రత్యర్థులపైన స్త్రీని అసభ్యంగా అవమానించారనీ, దళితులను కులం పేరు పెట్టి దూషించారనీ కేసు అవుతుంది. ఈ సిగ్గుమాలిన ఎత్తుగడను కడప జిల్లాలో రెండు పార్టీలూ వాడుకున్నాయి.
దురదృష్టమేమిటంటే ప్రజల ఆలోచనలు కూడా ఈ సంస్కృతిలో భాగమే ఎవరికి ఆధిపత్యం ఉన్న గ్రామాల్లో వారికి మాత్రమే స్వేచ్చ ఉంటుంది. ఇతురులు తమ గ్రామాలకు పరిమితం కావాలి అధికారంలో ఉన్నవారు తమ వారికి మాత్రమే చేసుకుంటారు. ఇతరుల తమ ముఠా నాయకుడు అధికారానికొచ్చే దాకా ఆగాలి. ప్రభుత్వ అధికారులు అధికారంలో ఉన్న వారి పనులే చేస్తారు తప్ప వారి ప్రత్యర్థులకు న్యాయం చేయరు. ఇవన్నీ సహజమైన విషయాలుగా, ఇవే జీవితనియమాలుగా సగటు ప్రజలు స్వీకరిస్తున్నారు. దురదృష్టం కొద్ది దీనిని పోగోట్టే రాజకీయ కృషి ఏదీ రాయలసీమలో లేదు. ఎవరూ చేపట్టడం లేదు. అది జరిగేంత వరకూ ముఠా సంస్కృతికి రాజకీయాల్లో ముఠా తత్వం వర్థిల్లుతూనే ఉంటాయి.
కె. బాలగోపాల్‌