సమరదీక్ష కొనసాగుతుంది
అడ్డుకుంటే తెలంగాణంతట దీక్షలు మొదలు కావాలి
కోదండరామ్
హైదరాబాద్, జనవరి 26 (జనంసాక్షి) :
రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా తెలంగాణ సమరదీక్ష కొనసాగుతుందని టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ స్పష్టం చేశారు. దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శనివారం ఆయన జేఏసీ నేతలతో కలిసి రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. శాంతియుతంగా చేపట్టనున్న దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరారు. శాంతిభద్రతలను సాకుగా చూపి పోలీసులు దీక్షకు అనుమతి నిరాకరించడంపై ఆయన మండిపడ్డారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదనడానికి ఇంతకుమించిన ఉదాహరణలు ఏమి కావాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ సమరదీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపట్టి .
తీరుతామన్నారు. సమరదీక్షకు అనుమతి ఇప్పించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రాంత మంత్రులదేనని, ఒకవేళ అనుమతి రాకుంటే అందుకు బాధ్యత కూడా వారే వహించాలన్నారు. తెలంగాణ ప్రజలు ఎంతమాత్రం అధైర్య పడవద్దని ఎవరికి అవకాశం ఉన్న చోట వారే నిరసన తెలపాలన్నారు.