సమరోత్సాహం సరే.. కిందిమీదైతే ఏం చెప్తారు?
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సమరోత్సాహంతో దూసుకెళ్తున్నారు. ఇక తెలంగాణ ఇచ్చేస్తున్నాం.. అది తమ వల్లే సాధ్యపడిందని చెప్పుకుంటూ తెగ సంబరపడిపోతున్నారు. కానీ తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీకి మోసం చేయడం కొత్తకాదు. ఇప్పుడు ఎంతో ఊరిస్తున్న పార్టీ అధిష్టానం ఉసూరుమనిపిస్తే వీళ్లు ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు? ఏ ముఖం పెట్టుకొని వారి మధ్యకు వెళ్తారు? అంటే తెల్లమొహం వేస్తున్నారు. వీరిలో ఇన్ని ఆశలు కల్పించడానికి కారకుడు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్. ఆయన ప్రకటనతో ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో తెలంగాణలో సమరోత్సాహాన్ని తెచ్చినా సవాలక్ష సమస్యలకు ఏం సమాధానం చెబుతారన్నది ప్రశ్న వెంటాడుతోంది. వలసలు, అసమ్మతి, అలకలు, ప్రత్యేక, సమైక్య వాదాల నేపథ్యంలో ఎన్నికల దిశగా నడవండని దిగ్విజయ్ నాయకులకు పిలుపునిచ్చారు. తెలంగాణ నినాదం ఈ ప్రాంతంలో గట్టెక్కిస్తుందనే నమ్మకాన్ని పెంచుతున్నా పెరుగుతున్న దరలు, నిరుద్యోగం, విద్యుత్ కోతలకు గ్రామాల్లో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. దీనికి తెలంగాణతో సమాధానం చెప్పగలరా అన్నది ప్రశ్న. పెరిగిన ధరలు, కరెంట్ కోతలు, గిట్టుబాటు ధరలు, గ్యాస్ సిలిండర్ల భారం తదితర అంశాలపై ప్రస్తావనే లేదు. ఎవరికి వారు తమ గొప్పతనాన్ని చాటుకునేందుకు మాత్రమే తెలంగాణను ఉపయోగించుకున్నారని చెప్పక తప్పదు. విపక్షాలన్నీ ఉద్యమ కార్యాచరణతో విస్తృతంగా ప్రజల్లోకి వెళుతుంటే జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం అచేతనంగా ఉండిపోతున్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీకాక, ఒకింత అసహనంగా మారిన వారికి మాత్రం సీఎం హామీతో ఒకింత ఉత్సాహం వచ్చి ఉంటుంది. ఇటీవల కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం ఊరటనిచ్చినా ఎన్నికల కోడ్ కూయడంతో మళ్లీ బ్రేక్ పడిందనే చెప్పాలి. ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో దీనిని ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లేందుకు, మైనారిటీ రిజర్వేషన్లు ఎలాంటి పరిస్థితుల్లో చేపట్టిందీ వివరించేందుకు, 2014 ఎన్నికల్లో నగదు బదిలీ తమను తిరిగి అధికారంలోకి తీసుకురాగల మహత్తర పథకంగా చెప్పేందుకు నేతలు ప్రాధాన్యమివ్వాలన్న సందేశం మాత్రం వెళ్లింది. ప్రధానంగా ఉప ప్రణాళిక, బంగారుతల్లి పథకాలపై సీఎం ఫోకస్ పెట్టారు. ఎస్సీల్లో కొన్ని వర్గాలు ఇతర పార్టీల వైపు ఆకర్షితులవుతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నేరుగా బ్యాంక్ అక్కౌంట్లలోకి నగదు వచ్చి చేరటం విశేషంగా ఆకర్షిస్తుందని, ఇది పేద బడుగు వర్గాల్ని విపరీతంగా ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ కూడా రేపటి గెలుపుకు అంటే 2014 ఎన్నికలకు ట్రంప్ కార్డులు కాబోతున్నాయన్న ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా సీఎం కాంగ్రెస్ చేసిన, చేస్తున్న అభివృద్ధిని ప్రస్తావిస్తూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎవరూ ఇంతటి అభివృద్ధి చేయలేదని చెప్పుకుంటున్నారు. అందుకే ఈ రెండు పథకాలపైనే ప్రచారం చేసుకుంటున్నారు. స్థానికంగా ఉండే సమస్యలను ప్రస్తావించకుండా ఇలా నెట్టుకురావడం ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులకు తలకు మించిన భారం కాబోతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అసెంబ్లీలో తీర్మానం అన్న తేనెతుట్టెను కదిలిస్తారా? అనేది అందిరినీ వేధిస్తున్న ప్రశ్న. కాంగ్రెస్ అలాంటి చర్యకే దిగితే ఆ పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. నామినేటెడ్ పోస్టుల్ని తక్షణం భర్తీ చేయాలని పలువురు నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏమేరకు ఆచరణలోకి వస్తుందన్న దానిపై సమావేశంలోనే సందేహాలు వ్యక్తం అయినా కొంత ముందుకు వెళుతోంది. తెలంగాణ డిమాండ్ల నేపథ్యంలో ప్రచారంలో ఎలా వెళ్లాలన్న సందేహాలూ లేకపోలేదు. మొత్తానికి తెలంగాణ వ్యవహారం దిగ్విజయ్ వ్యాఖ్యలతో స్పష్టమయ్యిందని ప్రచారానికి వాడుకోవాలని చూస్తున్నారు. తామే తెలంగాణ తెస్తామన్న ప్రచారం చేపట్టనున్నారు. నామినేటెడ్ పదవుల్ని త్వరగా భర్తీ చేయటంతోపాటు జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయటం ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని, విపక్షాలకు దీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించడం కార్యకర్తలకు సంబంధించినంత వరకు శుభ పరిణామం. కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసేముందు వారికి ఈ మాత్రం ఆశనైనా కల్పించకపోతే ముందుకు బండి కదలదన్న సంగతి కాంగ్రెస్ పెద్దలకు బాగా తెలుసు. అందుకే ఎన్నికలకు సైరన్ మోగించారు. రథాలు, అంగ బలాలు సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు వ్యూహాలు పన్నుతారు. ఇక రానున్న రోజులన్నీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు కదిలేందుకు నిర్ణయించారు. ఎన్ని చేసినా తెలంగాణ సమస్య కాంగ్రెస్‌కు ప్రతిబంధకంగా మారక తప్పదు. 2014 ఎన్నికల వరకూ ఇలాగే లాగాలని చూస్తే ఆ పార్టీ బొక్కబోర్లా పడక తప్పదు.