సర్కారు ఏర్పాటు చేస్తాం

2

– గవర్నర్‌తో మెహబూబా ముఫ్తీ భేటీ

శ్రీనగర్‌,మార్చి26(జనంసాక్షి):జమ్మూకాశ్మీర్‌ లో రెండు నెలల రాజకీయ అనిశ్చితికి బ్రేక్‌ పడింది. జమ్ముకాశ్మీర్‌ ప్రథమ మహిళా ముఖ్యమంత్రిగా పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ రికార్డు సృష్టించనున్నారు. కమలంతో కలిసి ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు ముందుకొచ్చిన మహబూబా.. బీజేపీ నేత నిర్మల్‌ సింగ్‌ తో కలిసి ఆ రాష్ట్ర గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోరాతో సమావేశమయ్యారు. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్లు గవర్నర్‌ కు లేఖలు ఇచ్చారు. వెంటనే రాష్ట్రపతి పాలనను రద్దు చేసి.. సర్కార్‌ ఏర్పాటుకు పిలవాలని విజ్ఞప్తి చేశారు.తమ మధ్య ఎలాంటి విభేధాలు లేవన్న మహబూబా.. ప్రధాని మోడీ ఇచ్చిన హావిూలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎటువంటి షరతులు లేకుండా మద్దతు ఇస్తున్నందుకు బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు.

ఇప్పటికే పీడీపీ శాసనసభ పక్షనేతగా ఎన్నికైన మెహబూబా.. బీజేపీ మద్దతుతో త్వరలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. నిర్మల్‌ సింగ్‌ కూడా బీజేపీ శాసనసభాపక్షనేతగా ఎన్నికయ్యారు. దీంతో, ఆయన మెహబూబా ముఫ్తీ కేబినెట్‌ లో డిప్యూటీ సీఎంగా పని చేస్తారు. 87 మంది సభ్యులున్న జమ్ముకాశ్మీర్‌ శాసనసభలో పీడీపీకి 27, బీజేపీకి 25 మంది సభ్యుల బలముంది. ఇప్పటికే పదవుల పంపకాలపై కూడా ఓ అవగాహనకు వచ్చిన ఇరు పార్టీలు? పాత పద్ధతి ప్రకారమే మంత్రి పదవులు కొనసాగించాలని నిర్ణయించాయి. పరస్పర సమన్వయంతో ముందుకెళ్లాలని డిసైడ్‌ అయ్యారు. త్వరలో ప్రమాణస్వీకారం చేసి.. బడ్జెట్‌ సమావేశాలు కూడా నిర్వహించే ఆలోచనలో ఉన్నారు.