సర్కారు మత్తు వదిలించేందుకు కుడంళంలోనూ జలసత్యాగ్రహం

కూడంకుళంసెప్టెంబర్‌ 13 (జనంసాక్షి)
కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రానికి నిరసనగా జరుగుతున్న ఆందోళన గురువారం కొత్తరూపు సంతరించుకుంది. మధ్యప్రదేశ్‌లో నర్మదా బచావో ఆందోళన్‌ చేపట్టిన జల సత్యాగ్రహం ఆందోళన స్ఫూర్తిగా తీసుకున్న ‘కూడంకుళం’ నిరసనకారులు గురువారం జల సత్యాగ్రహం ప్రారంభించారు. వేలాది మంది మత్స్యకారులు న్యూక్లియర్‌ పవర్‌ ప్రాజెక్టుకు పక్కనే ఉన్న సముద్రంలోకి వళ్లి నడుంలోతు నీళ్లలో నిలబడ్డారు. గురువారం ఉదయమే పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ ఎగెనెస్ట్‌ న్యూక్లియర్‌ ఎనర్జీ (పీఎంఏఎన్‌ఈ) కార్యకర్తలు ఇందింతకరాయి తీర ప్రాంతంలో నీటిలో మానవ హారంగా ఏర్పడి నిరసన కొనసాగిస్తున్నారు. ప్రధానంగా నాలుగు డిమాండ్లు నెరవేర్చే వరకూ వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. రియాక్టర్‌లలోకి ఇంధనాన్ని నింపే ప్రక్రియను నిలిపివేయాలని, ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమకారుల అరెస్టులను ఆపేయాలని, ఇప్పటికే అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడిచిపెట్టాలని, ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రాజెక్టు పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే యత్నం చేశారు. మరోపక్క తీర ప్రాంత గస్తీ దళం ఈప్రాంతంలో ఏరియల్‌ సర్వే చేపట్టింది. కూడంకుళం అణు విద్యుత్‌ కేంద్రంలో ఇటీవల యూరేనియం ఇంధనాన్ని నింపే ప్రక్రియ ప్రారంభించడంతో నిరసనకారులు తిరిగి ఉద్యమాన్ని పునఃప్రారంభించారు.