సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చ

నంగునూరు,సెప్టెంబర్22(జనంసాక్షి):
నంగునూరు మండల కేంద్రంలో గురువారం రోజున ఎంపీపీ జాప అరుణా దేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 57 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులందరికీ కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన నేపథ్యంలో ముందుగా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సమావేశం కొనసాగించారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ, వైద్య, ఆరోగ్యశాఖ, రెవెన్యూ శాఖ, అటవీశాఖ, ఇరిగేషన్ శాఖ, ఆర్టీసీ శాఖ, ఉపాధి హామీ శాఖ, విద్యాశాఖ, ఎక్సైజ్ శాఖ, పశు పోషణ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఆర్ అండ్ బి శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పూర్తి నివేదికతో హాజరు కాగా కొన్ని శాఖల అధికారులు సర్వసభ్య సమావేశానికి రాలేదు.అదేవిధంగా మండలంలోని పలు గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు కూడా రాలేదు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆర్టీసీ, ఎక్సైజ్, కరెంటు శాఖల సమస్యలపై వాడి వేడిగా చర్చ జరిగింది. మండల విద్యుత్ శాఖ ఏఈ సర్వసభ్య సమావేశం నిర్వహించిన ప్రతిసారి హాజరు కాకపోవడంతో     విశేషం. మొదటగా వ్యవసాయ శాఖ అధికారిని గీతా గౌడ్ మాట్లాడుతూ.. ఈ వర్షాకాలంలో 21328 ఎకరాలలో వరి, 2974 ఎకరాల్లో పత్తి ,921 ఎకరాలలో మొక్కజొన్న ,1076 ఎకరంలో కంది, 37 ఎకరాలు ఇతర కూరగాయల పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 2021 సంవత్సరం చివరినాటికి రైతు బీమా ద్వారా 40 మంది రైతుల నామినీలకు 2.40 కోట్ల అందించడం జరిగిందని ఆమె చెప్పకొచ్చారు. అదేవిధంగా పామాయిల్  తోటలు పెంచడంలో మండలానికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి చేరుకున్నట్లు ఆమె తెలిపారు. విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ… మండలంలో వందకు వందశాతం పాఠ్యపుస్తకాల పంపిణీ జరిగిందని చెప్పారు. మండలంలో మొత్తం విద్యార్థులు 4782 మంది ఉండగా 202 మంది టీచర్స్ పిల్లలకు విద్యను బోధిస్తున్నట్లు తెలిపారు. ఇందులో 80 శాతం వరకు స్కూల్ పిల్లలకు ఏకరూప దుస్తుల పంపిణీ జరిగిందని, మిగతా 20 శాతం మంది పిల్లలకు త్వరలోనే ఇవ్వడం జరుగుతుందని గుర్తు చేశారు. గట్లమల్యాల, నంగునూరు, నాగరాజుపల్లి, అంక్షాపూర్ వేంకటాపూర్ గ్రామాలలో విద్యార్థులకు ఇంకా యూనిఫామ్స్ అందజేయాలని అన్నారు. ఎక్సైజ్ శాఖ తరఫున పాల్గొన్న అధికారులను మండల ప్రజా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడిగారు. మండలంలో ఉన్నటువంటి 3 వైన్స్ షాపులలో కొన్ని రకాల మద్యం బాటిల్స్ ను కేవలం బెల్ట్ షాపులకు మాత్రమే అమ్ముతూ ప్రజలకు నేరుగా ఇవ్వడం లేదని దీనికి కారణం ఏంటని ప్రశ్నించారు. అదేవిధంగా  మండల కేంద్రానికి ఒకప్పుడు దాదాపు 40 సార్లు బస్సులు  వస్తూపోతూ ఉండేవని కేవలం ఇప్పుడు పది నుంచి పదిహేను వరకే వస్తున్నాయని దీనివలన గట్ల మల్యాల, నంగునూరు హై స్కూల్ విద్యార్థులతోపాటు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా చాలా కాలం నుంచి నంగునూరు మీదుగా వెళుతున్న రెండు రాత్రి బస్సుల సర్వీసులను మళ్లీ పునరుద్ధరించాలని  మండల ప్రజా ప్రతినిధులు ఆర్టీసీ శాఖను కోరారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ జాపా అరుణాదేవి వైస్ ఎంపీపీ కర్ణగంటి రేణుక, సిద్దన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య, నంగునూర్ పిఎసిఎస్  చైర్మన్ కోల రమేష్ గౌడ్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎక్స్ అఫీషియస్ నెంబర్స్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.