సాగునీటిని వృధా చేయవద్దు

కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌
శ్రీకాకుళం, జూలై 20 : సాగునీటిని వృదా చేయకుండా పంట అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ రైతులకు సూచించారు. నారాయణపురం ఆనకట్ట కుడి, ఎడమ కాలువ ద్వారా సాగు నీటిని శుక్రవారం ఆయన విడిచిపెట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కుడి కాలువ ద్వారా సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల, ఆమదాలవలస, శ్రీకాకుళం మండలాల్లోని సుమారు 18,500 ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా బూర్జ, ఆమదాలవలస, శ్రీకాకుళం, గార మండలాల్లోని 20 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందన్నారు. జిల్లాకు కొంత వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎగువున ఉన్న విజయనగరం, ఒడిశా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నందున ఖరీఫ్‌ సాగుకు నీటికొరత ఉండకపోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.