సాధారణ బడ్జెట్‌ను ఆమోదించిన మంత్రివర్గం

1
హైదరాబాద్‌,మార్చి13(జనంసాక్షి):అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే సాధారణ బడ్టెట్‌ను ఆదివారం మంత్రి వర్గం ఆమోదించింది.బడ్జెట్‌ రూపకల్పన విషయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. అన్నిశాఖలతో సవిూక్ష సమావేశాలు నిర్వహించి.. వాటి అవసరాలు తెలుసుకున్నారు. అటు ఇరిగేషన్‌ రంగానికి బడ్జెట్‌ లో పెద్దపీట వేయనున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇరిగేషన్‌ రంగానికి ప్రతియేటా 25 వేల కోట్లు బడ్జెట్‌ లో కేటాయిస్తామని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. అటు రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకాలకు బడ్జెట్‌ తో సంబంధం లేకుండానే ప్రభుత్వం నిధులు సమకూర్చుకుంది. అధికారం చేపట్టినప్పటి నుంచి సీఎం కేసీఆర్‌ సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకున్నప్పటికీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ లో పెద్దపీట వేసే అవకాశం ఉంది. మొత్తానికి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా.. అభివృద్ధిని వేగవంతం చేసేలా బడ్జెట్‌ ను రూపొందించినట్లు తెలుస్తోంది.