సామ్రాజ్యవాద ముట్టడిలో దండకారణ్యం
ప్రజలకోసం ఉపయోగించవలసిన వనరులను పాలకులు కార్పొరేట్, బహుళజాతి కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తున్న ప్రజాసమూహాలను తీవ్ర అణచివేతకు గురిచేస్తున్నారని అంటున్నారు దబ్బేటి మహేశ్
భారతదేశ రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులన కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికి గాని, ఏ వ్యక్తికి గాని లేదు. అపారమైన ఖనిజ సంపదనన కలిగి ఉన్న దండకారణ్యం నేడు ఒక యుద్ద క్షేత్రంగా మారుతోంది. ఇక్కడి ఆదివాసుల జీవనాన్ని అతలాకుతలం చేసే ఆపరేషన్ గ్రీన్‌హంట్ మొదలయింది. దాని పేరిట శభారతరాజ్యం తలపెట్టిన సాయుధ కార్యక్రమం ఆదివాసుల బతుకులను ఛిద్రం చేస్తున్నది. ఈ హరితవేట బయటకు మాత్రమే మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కనబడుతున్నా, దీని వెనుక ముమ్మాటికి ఆదివాసి సమూహాలను నిర్మూలించి, ఆ ప్రాంతాలను ఖాళీ చేయించి ఆ తరువాత అక్కడి ఖనిజ సంపదను వెలికితీసేందుకు దారులు సుగమం చేసి, బహుళజాతి కంపెనీలకు ధారధత్తం చేయడమే దీని అసలు లక్ష్యం. ఈ రాజ్యం నిజ స్వరూపం.
మన దేశంలో 329 మిలియన్ చదరపు కిమి విస్తీర్ణంలో అడవి ఉంది. ఇందులో 9.60 శాతం దట్టమైన అడవులు కలగి ఉన్నాయి. జియాలాజికల్ సేక్వ ఆఫ్ ఇండియా 1995 లెక్క ప్రకారం ఈ అడవి ప్రాంతంలో 4.386మిలియన్ టన్నుల డోలమైట్, 2,10,000 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు, 176 మిలియన్ టన్నుల జింక్, సీసమ్, 167మిలయన్ టన్నుల మాంగనీస్, 2.462మిలియన్ టన్నుల బాక్సైట్ , 340 మిలియన్ టన్నుల మాగ్నటైట్, 461 మిలియన్ టన్నుల రాగి, 10.052 మిలియన్ టన్నుల హైమటైట్, 86 మిలియన్ టన్నుల క్రీమైట్‌తోఎ పాటు 39 రకాల ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని తేల్చింది.
ఈ నిక్షేపాలు ఆదివాసి ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి ఆదివాసులను వేరు చేస్తుంటే ప్రతిఘటించేది మావోయిస్టులే కనుక ‘గ్రీన్‌హంట్’ పేరుతో భారత పాలక వర్గాలు తమ సాయుధ బలగాలతో వీరిని తుదముట్టించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. టాటా, జిందాల్, పోస్కో, ఎస్సార్, వేదాంత, మిట్టల్ వంటి బహుళ జాతి కంపెనీలు, ఇండియన్ కంపెనీలు లైన్‌లో ఉన్నాయి. ఈ సంపదను సులభంగా ధారాదత్తం చేయవచ్చు అనేది పాలక వర్గాల కుట్ర. ఈ కుట్రలో భాగమే సల్వాజుడుం.
తెగ భూస్వామ్య అధికారానికి, పితృస్వామిక అధికారానికి సవాలుగా నిలిచిన ఆదివాసి రైతాంగాన్ని చూసి సహించలేని కల్మ మసాలు (మహేంద్ర కర్మ) లాంటి భూస్వామ్య ప్రతినిధులు రాజ్యంతో చేయి కలిపి ‘జన జాగరణ్’ పేరుతో కాలి కింద అణగదొక్కలని చూశారు. 1990లోనూ, 1997లోనూ, తెచ్చిన జనజాగరణ్‌ను ఆదివాసి రైతాంగం ఎదుర్కొని నిలదొక్కుకున్నారు. 2005 జూన్ నుండి జనజాగరన్ వేషం మార్చుకున్నది. సల్వాజుడుం ఆదివాసి ప్రజానీకాన్ని అణచివేస్తున్నది. 2005 నుండి దంతెవాడ, బస్తర్, బీజాపూర్‌లో నిలువనీడ లేకుండా చేసింది. ఇల్లు, పొలం, గుడిసె, కాలిబాట, ఇప్పచెట్టు, ఈతపొద ఎక్కడా ఆదివాసిలకు రక్షణ లేకుండా చేసింది. జుడుం మూకలు తోడేళ్ల గుంపులా మీదపడి మహిళలను నెత్తురోడే మాంసపు ముద్దలుగా చేశారు. నాగా, మిజో , సిఆర్‌పిఎఫ్ బలగాలు పశుత్వపు కోరలతో మహిళల శరీరాల్ని ముక్కలు చేశాయి. పోలీసుల భద్రతా బలగాల దాడులకు, లైంగిక అత్యాచారాలకు బలికాని గడప ఒక్కటికూడ మిగల లేదంటే, ఆ హింస స్థాయిని ఊహించవచ్చు.
భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్స్ 38,39 ప్రజల మధ్య ఆర్ధిక అసమానతలు తగ్గించాలని, దేశ సంపదను అందరికి అందుబాటులోకి తేవాలని, ఈ దేశ సంపదనంతటిని ఈ దేశ పౌరులకు సమానంగా పంచాలని చెపుతాయి. పాలకులు రాజ్యాంగ మీద ప్రమాణం చేసి రాజ్యాంగ బద్దంగా ఉంటామంటూ, నిత్యం ప్రజాస్వాయ్యం గురించి మాట్లాడుతూ ఎన్నికలలో నిలబడి గెలవడం దేశ సంపదను దోచుకోవడానికి అర్హతగా భావిస్తున్నారు. కాని ఈ దేశ రాజాంగం గురించి, రాజాంగ భావనల గురించి రాజ్యాంగ ఆదర్శాల గురించి తెలియని ఆదివాసిలు గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసుకుని వారి గ్రామ సంపదనంతటిని అఈందరు సమానంగా పంచుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు, అటువంటి వారిమీద ప్రభుత్వం యుద్దం ప్రకటించింది. జనజాగరణ సమితి సల్వాజుడుంగా మారి మళ్లీ రూపాంతరం చెంది ఇవాళ కోయ కమాండోగా పేరు మార్చుకున్నది. ప్రభుత్వమే వారికి ఆయుధాలు ఇచ్చి వారిని గిరిజన గూడెంల మీద గుండాయిజం చేయాడానికి ఉసికొల్పింది. అందుకే కొంతమంది దీనిని ఆదివాసి సమాజంలో అంతర్యుద్దం అంటున్నారు. నిజానికి ఇది అంతర్యుద్దం కాదు. ఆదివాసి సమాజం మీద ప్రభుత్వం, పారామిలటరీ బలగాలు చేసే పాశవిక దాడి, నేరం చేసిన వ్యక్తులను చట్ట ప్రకారం శిక్షించి వారిలో మార్పుకోసం ప్రభుత్వం కృషి చేయాలి కాని ప్రభుత్వమే వారికి ఆయుధాలిచ్చి మరిన్ని నేరాలు చేయమని ప్రోత్సహిస్తున్నది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(డి) ప్రకారం పౌరుడు భారతదేశంలోని ఏ ప్రాదేశిక భూ భాగంలోనైన స్వేఛ్చగా సంచరించడానికి హక్కు కలిగి ఉన్నాడు. అయితే షెడ్యూల్డు తెగల, కులాల వారి శ్రేయస్సు దృష్ట్యా పౌరుల సంచారంపై పరిమితులు విధించవచ్చు. అంటే ఇతర వర్గాలకు చెందిన ప్రజలతో ఆదివాసులు సంబంధాలు పెంచుకున్నప్పుడు వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని బయటి వ్యక్తులు వారిని మోసం చేసే అవకాశం ఉన్నదని దాని భావం. కాని ఇవాళ ఆదివాసి ప్రజలను అటవీ ప్రాంతంలోనే తిరుగకుండా కొన్ని ప్రాంతాలకు రానీయకుండా రాజ్యం నిర్బందిస్తున్నది. నిజానికి ఆదివాసిలపై జులుం ప్రదర్శించే జుడుంను ఆదివాసుల భద్రతకు ముప్పుగా పరిణమింప చేస్తూ రాజ్యాంగం ఉల్లంఘనకు పాల్పడుతున్న రాజ్యం ఆదివాసులను మాత్రం వారి కనీస అవసరాల కోసం తరగనివ్వడం లేదు. వారు సేకరించిన అటవీ ఉత్పత్తులను మార్కెట్‌లో అమ్ముకోవడానికి, కొనుక్కోడానికి వీలు కల్పించే ఆర్టికల్ 19(1)(జి), 19(6) అమలు కావడం లేదు. అటువంటిది ఆదివాసులు అడవిలో ఆరుగాలం కష్టపడి సేకరించిన అటవీ ఉత్పత్తులను అమ్ముకోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నది.
ఆదివాసులపై ప్రభుత్వం దాడి ఇవ్వాళ్లిది కాదు. ఇంద్రవెళ్లి నుండి చింతల్‌నాదు మొదలుకొని బాసగూడ వరకు వారు ఈ దేశ సంపదను కాపాడడానికి, ఈ దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టడానికి నిత్యం నిర్బందాన్ని అనుభవిస్తూ, ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రాణాలను కోల్పోయిన మననుషులను దహనం చేసిన, ఖననం చేసిన స్థలాలకు ప్రాధాన్యత ఉంటుంది. సామాన్య ప్రజల అంత్యక్రియలు చేసి ప్రదేశంలో ఒక గోరినో, ఒక రాయినో పాతుకుంటరు. ఆరోరిని, ఆ రాయిని అప్పుడప్పుడు చూసుకుంటారు. నలుగురికీ చెప్పుకుంటారు. కానీ ఈ ప్రజలకు తమవాళ్లు ఎక్కడ మట్టిల కలిశారో తెలియనే తెలియదు. ఈ పేద ప్రజలు మట్టిలో కలిసిపోయిన స్ధలాలన కనీసం అప్పుడప్పుడు తమ ఆత్మీయులు చూసుకోవడానికి కూడా వీల్లేకుండా చేయడం ఎంత అమానుషత్వం? నిజానికి తమ వాళ్లను ఆకరి చూపు చూసుకోవడం అనేది ఏదో భావోద్వేగమో మరొక్కటో కాదు. అది చట్ట ప్రకారం ప్రతి ఒక్కరికీ సంక్రమించాల్సిన హక్కు.
చట్టాన్ని, న్యాయాన్ని పరిరక్షించడమే కతమ లక్ష్యమని చెప్పుకునే కోర్టులు కూడా ఇటువంటి విసయాల్లో కళ్లూ, చెవులూ మూసుకుంటున్నాయి. ఈ బాధిత పేద ప్రజలు తమంతట తాము కోర్టులకు పెళ్లకపోయినా కోర్టులు ఈ విషయంలో జోక్యం చేసుకోవచ్చు ప్రభుత్వాలకు ఇబ్బంది కలిగిన ఎన్నో సందర్బాల్లో ఇలా కోర్టులు జోక్యం చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రసార మాద్యమాలు చిన్న చిన్న విషయాలనే సెన్షేషనల్‌గా మార్చి అసలు ఏమీ లేనిచోట కూడా వార్తలను సృష్టించి ప్రజల దృష్టినంతా ఆకర్షించే విధంగా ప్రసారం చేస్తున్నాయి. కాని ఇటువంటి దారుల పట్ల, ప్రజల దృష్టికి నిజంగా తీసుకెళ్లాల్సిన విషయాల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. లేదంటే వక్రీకరిస్తున్నాయి.
భారత పాలక వర్గాలు ఆదివాసి ప్రజానీకంపై తలపెట్టిన ఈ దాడి రెండవ దశకు చేరుకునే సరికే విధ్వంసం కనబడితే, ఈ దాడి ఉదృతం అయితే ఇక్కడ ఆదివాసి జాతి నాశనం జరుగుతుందనడంలో సందేహం లేదు. సామ్రాజ్యవాదులకూ, బహుళజాతి సంస్థలకూ ఇక్కడి అటవీ సంపదను ధారాదత్తం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నందువల్లే, ఈ అడవి మాదే అని నినదిస్తున్నందువల్లే ఆదివాసి ప్రజానీకంపై పాలక వర్గాలు ఇంతటి అమానుషకాండన తలపెట్టినాయి. స్వాతంత్య్రం వచ్చిందని ప్రకటించుకొని 60 ఏళ్తు దాటినా ఏనాడు ఆదివాసి ప్రాంతాల అభివృద్దిని పాలకవర్గాలు పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం అభివృద్ది జపం చేస్తూ అభివృద్దికి ఆటంకంగా ఉందంటూ మావోయిస్టు పార్టీని అణచివేస్తాయని ప్రకటిస్తోంది. నిజానికి నేడు దేశం ముందు ఎన్నో పెను సవాళ్లు ఉన్నాయి. రోజురోజుకు పేదరికం పెరిగిపోయి ప్రజల జీవన ప్రమాణాలు అడుగంటుతున్నాయి. నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి చావులు, అనారోగ్యం, ఆవిద్య, అభద్రత, అవినీతి, ఆహార కొరత వంటి ఎన్నో సమస్యలతో ప్రజల జీవితాల అతలాకుతలం అవుతున్నాయి. ప్రస్తుతం ఆర్దిక సంక్షభం దేశాన్ని కుదుపుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించే శక్తి, చిత్తశుద్దిఈ రెండు లేని పాలకవర్గాలు ఈ సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం నక్సలైట్ల సమస్యలను భూతద్దంలో పెట్టి చూపిస్తూ వామపక్ష తీవ్రాదం మాత్రమే నేడు దేశం ముందున్న పెను సవాల్‌గా దుష్రచారం చేస్తున్నది. మావోయిస్టు పార్టీని అణచివేసే సాకుతో పెద్ద ఎత్తున సాయుధ బలగాలు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టి ఇక్కడి ప్రజల్ని విచక్షణా రహితంగా చంపుతూ, సర్వం విధ్వంసానికి పాల్పడుతూ ఒక భయానక, భీభత్స వాతావరణాన్ని సృష్టించాయి. ఈ గడ్డ నుంచి ప్రజలను తరిమేయాలనే కుటిల పథకాన్ని సామ్రాజ్యవాదుల అండదండలతో పాలక వర్గాలు రచించాయి. ఈ పధకాన్ని ఓడించాల్సిన తక్షణ అవసరం నేడు దేశ ప్రజలందరిపైన, ప్రజాస్వామిక వాదులందరిపైనా ఉంది. ఈ అడవి మాదే అని నినదిస్తోన్న ఈ ఆదివాసిల పోరాటం కేవలం వాళ్లకు సంబంధించినది మాత్రమే కాదు. దేశాన్ని దోచుకుంటున్న సామ్రాజ్యవాదులకూ, దళారీ పాలకులకూ వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన ఈ పోరాటం దేశ సార్వభౌమత్వానికి స్వాతంత్య్రానికీ, స్వావలంబనకూ, స్వయం ప్రతిపత్తికి సంబంధించిన విషయం. ఈ పోరాటంపై పాలక వర్గాలు తలపెట్టిన దమనకాండను వ్యతిరేకించడం బుద్దిజీవుల కర్తవ్యం