సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే కాలగర్భంలో కలిసిపోతారు…
-బిజెపికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి హెచ్చరిక
మిర్యాలగూడ. జనం సాక్షి, మహోత్తరమైనటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించాలని ప్రయత్నం చేస్తే, భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం జరిగిన పోరాటాన్ని మతోన్మాద ఉద్యమంగా చిత్రీకరిస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించబోదని చరిత్ర మిమ్మల్ని కాలగర్భంలో కలిపి వేస్తుందని జూలకంటి రంగారెడ్డి తెలిపారు. మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని యూనియన్ సైన్యాలు చేత కాల్చి చంపబడ్డ అమరవీరులు కామ్రేడ్ దేవీ రెడ్డి చిన్న లక్ష్మి నర్సింహారెడ్డి,కామ్రేడ్ గుడా వెంకన్న, రైతాంగ సాయుధ పోరాట యోధులు సిపిఎం సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ గట్టిగొప్పుల రాంరెడ్డి గార్ల వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి కుటుంబ సభ్యులను సిపిఎం తడకమళ్ళ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి సి పిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి గారు మాట్లాడుతు
భారత రైతాంగ ఉద్యమ చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని వారు అన్నారు. నైజాం నిరంకుశ పాలనకు, జమీందారీ విధానానికి వ్యతిరేకంగా భూమి కోసం, విముక్తి కోసం తెలంగాణ ప్రజలు జరిపిన పోరాటం అది అన్నారు. ఈ పోరాట ప్రాముఖ్యత నేటి తరం తెలుసుకోకుండా పాలక పార్టీలన్నీ విమోచన నాటకాన్ని తెరమీదకు తెస్తున్నాయని నైజాం నవాబు ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎట్టి హక్కులు లేకుండా, వెట్టి చాకిరి చేస్తూ, దారుణ దోపిడీకి గురవుతున్న సమయంలో ఆంధ్రమహాసభ ఏర్పాటు జరిగిందని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టిందని వెట్టి చాకిరి రద్దు, కౌలు తగ్గింపు, దున్నే వానికే భూమిపై హక్కుల డిమాండ్‌ను ముందుకు తెచ్చిందని ప్రజల పెద్దఎత్తున సంఘటిత పడ్డారు. ”నీ బాంచన్ దొర” అన్న పేద ప్రజలు కమ్యూనిస్టు పార్టీ కలిగించిన చైతన్యంతో జమీందార్ల, దేశ్ ముఖ్‌ల, భూస్వాముల దోపిడీ దౌర్జన్యాలను ఎదిరించసాగారని
వెట్టిచాకిరిని వ్యతిరేకించారని భూమి కోసం పోరు ప్రారంభమైందని జమీందార్ల, దేశ్ ముఖ్‌ల గుండెల్లో వణుకు పుట్టిందని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన ఈ దాడులను తిప్పికొట్టేందుకు గెరిల్లా దళాలు ఏర్పడ్డాయని సాయుధ పోరాటం ద్వారా పది లక్షల ఎకరాల భూములు ప్రజలు స్వాధీన పర్చుకుని వేలాది గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారని అన్నారు.
ప్రజలతిరుగుబాటుకు భయపడి జమీందార్లు, దేశ్ ముఖ్‌లు, జాగీర్ధార్లు, పట్టణాలకు పారిపోయారని అన్నారు.
నిజాం నిరంకుశ ప్రభుత్వం రైతాంగ పోరాట ప్రాంతంలో మిలటరీ క్యాంపు పెట్టి గ్రామాలపై దాడులు సాగించిందని తీవ్ర చిత్ర హింసలకు గురిచేసిందని ప్రజలను ఒకేచోట మందవేసి పాశవికంగా హింసించారని స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడ్డారని పచ్చి బాలింతలను కూడా వదిలిపెట్టలేదని తల్లుల ఎదుటే పిల్లలను చంపటం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నాటి సాయుధ పోరాటాన్ని స్వార్థరాజకీయ ప్రయోజనాలకు వాడుకోకుండా ఆనాటి పోరాట అనుభవాలను నేడు యువతరానికి అందించాలనీ ఆ స్పుార్తితో ముందుకు పోవాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి రవి నాయక్, జిల్లా కమిటీ సభ్యులు మల్లు గౌతంరెడ్డి,రాగిరెడ్డి మంగారెడ్డి, చౌగాని సీతారాములు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు చౌగాని సైదమ్మ , జిల్లా నగేష్,వెంకన్న, శాఖ కార్యదర్శిలు గుంటి శీను, సుధాకర్, పుల్లయ్య, అమరవీరుల కుటుంబ సభ్యులు రామ్ రెడ్డి, గూడా వెంకన్న,వరలక్ష్మి, నాయకులు సోమయ్య,వెంకట్ రెడ్డి బక్కారెడ్డి, సైదులు, తదితరులు పాల్గొన్నారు