సిద్ధిపేటలో ఆరుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల ఏకగ్రీవం

3

సిద్ధిపేట,మార్చి25(జనంసాక్షి):

సిద్ధిపేట మున్సిపాలిటీకి నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం ముగిసింది. పలువురు తమ నామినేషన్లను ఉపసం హరించుకున్నారు. ఆరు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. 34 వార్డులున్న సిద్ధిపేట మున్సిపాలిటీకి ఏప్రిల్‌ 6న పోలింగ్‌ జరగనుంది. 11న ఓట్ల లెక్కింపు పక్రియ కొనసాగనుంది. ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో 28 వార్డులకు పోలింగ్‌ జరగనుంది. ఏకగ్రీవమైన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఇందులో 3వ వార్డు – పల్లె వెంకట్‌ గౌడ్‌, 6వ వార్డు – రాజనర్సు, 8వ వార్డు – విజయలక్ష్మి,9వ వార్డు – పూజలత, 1వ వార్డు – మం తెన జ్యోతి,4వ వార్డు – బూర శ్రీనివాస్‌. ఉన్నారు. అయితే మంత్రి హరీష్‌ రావు రంగంలోకి దిగడంతోనే ఇది సాధ్యమయ్యిందని అంటున్నారు. దీంతో సిద్దిపేటలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కనీసం పది వార్డులను తెరాసకు ఏకగ్రీవం చేసే దిశగా రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు పావులు కదుపుతున్నారని సిద్దిపేటలో ప్రచారం జరిగింది. తెరాస నేతల కదలికలను బట్టి ఆ యత్నాలు సాగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీ-ఫారం ఇచ్చే అభ్యర్థిని మినహాయిస్తే పార్టీ నుంచి ఇబ్బడి ముబ్బడిగా నామపత్రా లు దాఖలు చేసిన వారందరితో పాటు ఇతర పార్టీల నుంచి బరిలోకి దిగిన నేతలను కూడా పోటీల్లోంచి తప్పించే లక్ష్యంతో తెరాస పనిచేస్తుండడం గమనార్హం.  ఇక తెరాసలోని ముఖ్య నేతలతో పాటు ఆయా వార్డుల ఇన్‌ఛార్జిలు ఇతర పార్టీల నుంచి నామపత్రాలు దాఖలు చేసిన నేతలపై ఫోకస్‌ చేశారు. నేరుగా వారిని సంప్రదించడం లేదంటే వారికి సంబంధించిన వారికి ఫోన్లు చేసి బరిలోంచి తప్పించడానికి యత్నించి కొంతమేర సఫలీకృతం అయ్యారు. మొత్తం విూద కనీసం పది వార్డుల్లో తెరాస అభ్యర్థులను ఏకగ్రీవం చేయడానికి కసరత్తు చేయగా ఆరు స్థానాల్లో విజయం సాధించారు. అధికార పార్టీలో చేరితే భవిష్యతు ఉంటుందని కొందరికి, అభ్యర్థితో డబ్బులు అందేలా చూస్తామని మరికొందరికి తెరాస నేతలు వల విసురుతున్నట్లుగా సమాచారం. తెరాస నేతలు మాత్రం ఇతర పార్టీల నేతలే వారంతట వారు నామపత్రాలు ఉపసంహరించుకొని తమ పార్టీలోకి వస్తున్నట్లు చెబుతున్నారు.