సిమెంట్ ధరలు తగ్గించాల్సిందే : మంత్రి
కడప, జూలై 20 : జిల్లా ప్రజల అవసరాల కోసం సిమెంట్ ధరలను తగ్గించాల్సిందేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ డిఎల్ రవింద్రారెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలోని రైతులు, ప్రజల సమస్యలపై శుక్రవారం నాడు ఆయన అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా అధికారులతో పలు అంశాలు చర్చించారు. జిల్లాలో భూమి, సహజ వనరులు, నీరు, విద్యుత్ ఉపయోగించుకుంటున్న ఫ్యాక్టరీల యాజమాన్యాలు జిల్లాలో అధిక ధరకు సిమెంట్‌ను విక్రయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగునున్న చిత్తూరు జిల్లాలో సిమెంట్ బస్తా ధర 285 రూపాయలు, హైదరాబాద్‌లో 270 రూపాయలు ఉండగా, జిల్లాలో 330 రూపాయలకు విక్రయించడం ఏమిటని అధికారులను, సిమెంట్ ఫాక్టరీల ప్రతినిధులను ఆయన నిలదీశారు. 1995 నుంచి జిల్లాలో ఇలాంటే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతినిధులు మాట్లాడుతూ, ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదని చేతులెత్తేశారు. ఫ్యాక్టరీల యాజమన్యాలతో చర్చించి ధరలు తగ్గించే చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. సమావేశంలో కలెక్టర్ అనిల్‌కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.