సీటు మార్చమన్నందుకు ముస్లిం మహిళను విమానం నుంచి దించేశారు

2

చికాగో,ఏప్రిల్‌ 17(జనంసాక్షి): సీటు మార్చమని అడిగినందుకు ఓ ముస్లిం మహిళను విమానం నుంచి దింపేశారు ఆ సిబ్బంది. అమెరికాలోని చికాగోలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..మేరీల్యాండ్‌కు చెందిన హకీమా అబ్దుల్లే చికాగో నుంచి సియాటెల్‌ వెళ్లేందుకు సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎక్కింది. అయితే.. తనకు లభించిన సీటు అసౌకర్యంగా ఉందని వేరే సీటు ఇవ్వాలని హకీమా సిబ్బందిని కోరింది. ఇందుకు ఆ సిబ్బంది ఆమెను విమానం నుంచి దింపేశారు. దీంతో ఆమె ఎయిర్‌పోర్టు పోలీసులను ఆశ్రయించింది. అయితే హకీమాను ఎందుకు దింపేశారన్న దానిపై సౌత్‌వెస్ట్‌ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఆమె మిగతా ప్రయాణికులతో సౌకర్యవంతంగా లేదని మాత్రం చెబుతున్నారు. కారణం లేకుండా తమ సిబ్బంది ప్రయాణికులను దింపేయదని ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు చెబుతున్నారు. ఘటనపై వివరాలు సేకరిస్తున్నామన్నారు.ఆమెను దింపి విమానం వెళ్లిపోవడంతో ఆమె మరో విమానం వచ్చేంత వరకు ఎయిర్‌పోర్టులోనే ఉండాల్సి వచ్చింది. కాగా.. ఘటనపై ఆమె తీవ్రగ్భ్భ్రాంతికి గురైంది. జరిగినదానిపై హకీమా భర్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. కేవలం తమ మతం, వేషధారణ కారణంగానే ఆమెను విమానం నుంచి దింపేశారంటూ వాపోయాడు.ఏప్రిల్‌ 6న కూడా సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆక్లాండ్‌ నుంచి లాస్‌ ఏంజిల్స్‌ వెళ్తున్న మఖ్‌జూవిూ అనే వ్యక్తిని అరబిక్‌లో మాట్లాడారన్న కారణంతో విమానం నుంచి దింపేశారు.