సీమాంధ్ర సర్కారు దమనఖాండ

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీజేఏసీ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన చలో అసెంబ్లీపై సీమాంధ్ర సర్కారు దమనఖాండ సాగించింది. నాలుగు రోజులుగా జిల్లాల్లోంచి హైదరాబాద్‌కు వచ్చే రోడ్లపై పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి వేలాది మంది తెలంగాణవాదులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌లో అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. పౌరులకు రాజ్యాంగపరంగా ప్రాప్తించిన హక్కును కాలరాశారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఏం చేసినా చెల్లుతోందన్నట్టుగా ఉంది కాంగ్రెస్‌ పార్టీ వ్యవహార శైలి. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ పదే పదే ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది కూడా. ఆ హామీని నెరవేర్చాలని తెలంగాణ ప్రజలు ఎన్నో ప్రజాస్వామిక పోరాటాలు సాగించారు. అయినా సర్కారు స్పందించకపోవడంతో చలో అసెంబ్లీ కార్యక్రమానికి ముందస్తుగానే పిలుపునిచ్చారు. తాము నిరసన తెలుపుకునేందుకు అనుమతివ్వాలంటూ ప్రభుత్వాన్ని, పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అయినా ప్రభుత్వం ససేమిరా అంది. మావోయిస్టులు చలో అసెంబ్లీకి మద్దతు తెలపడాన్ని సాకుగా చూపి నాలుగున్నకోట్ల ప్రజల ఆకాంక్షలను చిదిమేయ ప్రయత్నించింది. జిల్లాల్లో పోలీసు పికెట్లు, తెలంగాణవాదుల ముందస్తు అరెస్టులు, బైండోవర్లకు తెగపడింది. చట్టాన్ని అతిక్రమించి కొందిరిని మూడు, నాలుగు రోజుల పాటు పోలీస్‌ కస్టడీలోనే ఉంచింది. హైదరాబాద్‌కు వెళ్లే రైలు మార్గాల్లో పికెట్లు ఏర్పాటు చేసి ప్రయాణికులను తనిఖీల పేరుతో ఇబ్బంది పెట్టింది. కూలీలు, విద్యార్థులను వెనక్కు వెళ్లగొట్టింది. ఉద్యమ నాయకులను గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులతో అడ్డుకుంది. ఇంతచేసినా చలో అసెంబ్లీకి పోరుబిడ్డలు కదిలిపోయారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భద్రతా వలయాలను ఛేదించుకొని శాసనసభ వైపునకు చొచ్చుకుపోయారు. ఎమ్మెల్యే శాసనసభ భవనంపై నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. ఒకటో గేట్‌ ఎదుట సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. గేటు వద్ద ఎమ్మెల్యేలతో పాటు వందలాది మంది కార్యకర్తలు నిరసనకు దిగగా, పోలీసు బలగాలు వారిని బలవంతంగా అరెస్టు చేసి ఠాణాలకు తరలించాయి. కేవలం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సీమాంధ్ర సర్కారు 20 వేల మందికి పైగా పోలీసులు, భద్రతా బలగాలను వినియోగించింది. ఫ్లై ఓవర్లు మూసేసింది. ఎక్కడి రైళ్లను అక్కడే నిలిపివేసింది. బస్సులు తిరగనివ్వలేదు. 144 సెక్షన్‌ విధించి గుంపులు గుంపులుగా ప్రజలు తిరుగకుండా కట్టడి చేసింది. ముళ్ల కంచెలు, బారికేడ్డు, భద్రతా బలగాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను వ్యక్తం చేయకుండా అడ్డుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డింది. హైదరాబాద్‌ నగరమంతా అడుగడుగునా ఖాకీల దాష్టీకాలు, దారుణాలు, పేలిన బాష్పవాయు గోళాలతో నిండిపోయింది. ప్రజాస్వామిక ఆకాంక్షను చాటేందుకు ముందుకువెళ్తున్న తెలంగాణవాదులను అడ్డుకునే క్రమంలో పోలీసులు ప్రదర్శించి అత్యుత్సాహం ఓ విద్యార్థిని తీవ్రగాయాల పాలు చేసింది. చావుబతుకుల మధ్య విద్యార్థి ఇప్పుడు చికిత్స పొందడానికి కారణం సీమాంధ్ర సర్కారు పెద్దలు అనుసరిస్తున్న అణచివేత ధోరణి, వారి అడుగులకు మడుగులొత్తుతున్న తెలంగాణ మంత్రుల బానిసత్వ వైఖరి కాక ఇంకేమి కాదు. ఉద్యమకారులపై పోలీసుల దాష్టీకాన్ని దమనఖాండను కనీసం ఖండించలేని స్థితిలో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఉన్నారంటే వారిని ఎలా చూడాలి. కనీసం చలో అసెంబ్లీకి అనుమతి ఇప్పించలేని దయనీయ స్థితిలో తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉన్నారంటే సీమాంధ్రుల ఆధిపత్యం ఎంత తీవ్రంగా ఉందో తేటతెల్లమవుతోంది. హైదరాబాద్‌కు చెందిన మంత్రులు మీడియాతో మాట్లాడుతూ చలో అసెంబ్లీ విజయవంతమైందో.. విఫలమైందో ప్రజలకే తెలుసంటూనే నగర ప్రజలకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. అంటే ఎంత తీవ్ర నిర్బంధం మధ్య నగరముందో ఇట్టే అర్థమవుతుంది. ఇంత నిర్బంధాన్ని పెట్టి చలో అసెంబ్లీని అడ్డుకోగలిగామని సీమాంధ్ర సర్కారు గొప్పలు చెప్పుకుంటుంటే, శభాష్‌.. భాగా చేశారు అంటూ కాంగ్రెస్‌ అధిష్టానం వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తోంది. ఇక్కడ సీమాంధ్ర సర్కారు, కాంగ్రెస్‌ అధిష్టానం ఒక విషయాన్ని విస్మరిస్తున్నాయి. అణచివేత ద్వారా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పాక్షికంగా అడ్డుకోగలిగాయేమో కానీ తెలంగాణ ప్రజల్లో ఉన్న తెలంగాణ ఆకాంక్షను తుడిచిపెట్టలేరు. నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ కోసం ప్రజలు శాంతియుతంగా ప్రజాస్వామిక పోరాటాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి నిర్బంధాలే కొనసాగిస్తే వారిలో ఆగ్రహం పెల్లుబుకడం కష్టమేమీ కాదు. తీవ్ర అణచివేత నిర్బంధాన్ని ఎదుర్కొన్న ఈజిప్టు, సిరియా ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటు అక్కడ నియంతల పాలననే అంతమొందించాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు. తెలంగాణ బిడ్డలపై లాఠీలు ఝలిపించి, బాష్పవాయు గోళాలు ప్రయోగించి, పరిగెత్తించి కొట్టిచ్చిన సీమాంధ్ర సర్కారు అందుకు ఫలితం అనుభవించకా తప్పదు. దానికి తందానా ఈ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులకూ గుణపాఠం చెప్పేరోజు దగ్గర్లోనే ఉంది. ఈ విషయాన్ని విస్మరించి గ్రేటర్‌ హైదరాబాద్‌ మంత్రులు అవాకులు, చెవాకులు పేలుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ, సీమాంధ్ర సర్కారు తెలంగాణ ప్రజల నిరసన తెలిపే హక్కును అణచివేయాలని ఇంతగా ఎందుకు సంకల్పించిందో అర్థం కాని ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలమేరకే పాలన సాగాలి. కానీ కనీసం నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వకుండా నియంత్రించాలని చూడడం ఎంత వరకు సమంజసం. చలో అసెంబ్లీ అంటే శాసనసభ వరకు కాకపోయిన ఇందిరాపార్క్‌ వరకైనా అనుమతి ఇవ్వొచ్చు. వారిలో ముగ్గురికో, నలుగురికో అనుమతి ఇచ్చి వారి నుంచి మెమోరాండం సమర్పించవచ్చు కానీ తెలంగాణ అంశామంటేనే అంటరానిది అన్న భావన సీమాంధ్ర సర్కారు వ్యక్తపరుస్తోంది. దానికి ప్రతిఫలం కూడా అనుభవించక తప్పదని మాత్రం గుర్తించలేకపోతుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదనే విషయాన్ని విస్మరించి విర్రవీగిన పాలకులకు గుణపాఠం చెప్పే రోజు కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు.