సూపర్ స్పెషల్ దోపిడీ
సీఎం రిలీఫ్ ఫండ్‌లో స్కాం
కార్పొరేట్ ఆసుపత్రుల బండారం బయటపెట్టిన సీఐడీ
హైదరాబాద్, మార్చి 9(జనంసాక్షి) : మరో సూపర్ స్పెషల్ దోపిడీ బాగోతం బయట పడింది. సీఎం రిలీఫ్ ఫండ్ అక్రమాలపై సీఎం నియమించిన సీఐడీ టీం పలు కార్పొరేట్ ఆసుపత్రుల అక్రమాల తీగ లాగితే డొంక కదులుతోంది. సీఎం రిలీఫ్ ఫండ్ పై సీఐడీ విచారణలో కార్పొరేట్ ఆస్పత్రుల బాగోతం బయటపడుతోంది. సీఐడీ 1,251 ఆస్పత్రుల అప్లికేషన్లు విచారించింది. 54 ఆస్పత్రులకు సంబంధించిన అప్లికేషన్లలో అవకతవకలు జరిగినట్టు సీఐడీ గుర్తించింది. కరీంనగర్, వరంగల్ జిల్లాలో 20 ఆస్పత్రులు, హైదరాబాద్లో 34 ఆస్పత్రుల అప్లికేషన్లలో అవకతవకలు జరిగాయని సీఐడీ నిర్దారణకు వచ్చింది. ఇప్పటికే కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. సీఎంఆర్‌ఎఫ్ అభ్యర్థనకు వచ్చిన అప్లికేషన్లపై ఆయా ఆస్పత్రుల యాజమాన్యాన్ని సీఐడీ ప్రశ్నించనుంది. విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్వోటీ పేరుతో అక్రమాలకు పాల్పడిన ఆస్పత్రులు, కార్పొరేట్ ఆస్పత్రుల పేరుతో నకిలీ లెటర్హెడ్స్ ను సీఐడీ గుర్తించింది. విచారణ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కు త్వరలో నివేదిక సమర్పించనున్నట్లు సీఐడీ వెల్లడించింది.