సెలవులు కాదు కావాల్సింది చిత్తశుద్ధి!
ప్రజాస్వామ్య దేశంలో ప్రభువులకు ప్రజలపట్ల చిత్తశుద్ధి ఉంటేనే నాలుగు కాలాలపాటు ఏలగలుగుతారు. భారతదేశంలాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ సూత్రం నూటికి నూరుపాళ్లు అచ్చుగుద్దినట్లు వర్తిస్తుంది. అనాదిగా మూస పద్ధతుల్లో ఓటర్లను ప్రలోభపెట్టి గద్దెనెక్కిన నేతలున్నారు కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇటీవల కాలంలో ఓటరు విజ్ఞతతో వ్యవహరిస్తున్నడు. అందుకే దేశరాజకీయాల్లో సంచలనాలకు కొదువలేకుండా పోతోంది. పదేళ్ల పాలనలో యూపీఏ వైఫల్యాలే 2014 లోక్‌సభ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో మోదీ నేతృత్వంలోని బీజేపీ గద్దెనెక్కడానికి కారణభూతమైనవి. అయితే మోదీ మాటల మరాఠీ అని 8నెలల్లోనే తేలిపోవడంతో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మోదీ ఎనిమిది నెలల పాలనపై అసంతృప్తితో ఉన్న హస్తిన ఓటరు అసెంబ్లీ ఎన్నికల్లో మోదీకి దిమ్మతిరిగే ఫలితాల్ని అందించారు. రోజులు మారాయి. ప్రజల్లో చైతన్యం వెల్లివిరుస్తోంది. టెక్నాలజీ పుణ్యమా అని సమాచారం అరచేతిలో చేవాణిలో అందుతోంది. ఎవరు ఏం చేస్తున్నారని బేరీజు వేసుకోవడంలో ఓటరుకు పెద్ద కష్టమేమీ కలగటంలేదు. దీంతో అనతికాలంలోనే రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓటర్లు ఆలోచించటం మొదలుపెట్టారు. సాంప్రదాయ ఓటు బ్యాంకుతో ఇంతకాలం నెట్టుకొచ్చిన జాతీయ పార్టీలకు ఇక అది ఎంతమాత్రం సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అందుకే దిల్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీలు చావుదెబ్బ తిన్నవి. ఇంతటి ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శలో పడ్డట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దేందుకు పార్టీ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న యువరాజు రాహుల్ గాంధీ కొంతకాలంపాటు అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ భవిష్యత్ కోసం మెరుగైన ప్రణాళికలు రూపొందించాలనే ఉద్దేశంతోనే రాహుల్ సెలవు తీసుకున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీలో నెంబర్ టూ గా ఉన్న రాహుల్ పార్లమెంట్ సమావేశాలకు ముందు సెలవు తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా… కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రణాళికలను తయారు చేయాలని భావిస్తున్న నేపథ్యంలోనే యువరాజుకు సెలవు అని పార్టీ సీనియర్లంటున్నరు. సెలవు సమయంలో రాహుల్..పార్టీ భవిష్యత్తు విధివిధానాలను రూపొందిస్తారు. సెలవు తర్వాత..మళ్లీ రాహుల్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో వందేళ్లకు పైబడిన చరిత్రగల పార్టీ ఇంతటి ఘోర వైఫల్యాలను మూట గట్టుకోవటానికి కారణాలు విశ్లేషించుకోవాల్సిన అవసరముంది. సెలవుపెట్టి మరీ పార్టీ భవిష్యత్ గురించి ప్రణాళికలు వేస్తున్నరని తెలుస్తున్న నేపథ్యంలో సెలవులకంటే ప్రజలకు చేరువగా ఉండటంలో గడిపితే ప్రజాసమస్యలపై స్పష్టమైన అవగాహన వస్తుంది. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీకి, వందేళ్లకుపైగా సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీకి ఎందుకీ దుస్థితి దాపురించిందనే అంశాలపై ప్రదానందా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. అబద్ధాలతో, అసత్య ప్రచారాలతో, సంప్రదాయ ఓటు బ్యాంకుతో ఇన్నాళ్లు నెట్టుకొచ్చిన పార్టీలు ఇక మనుగడ సాగించడం కష్టమని గుర్తించాలి. ఇన్నాళ్లూ సమాచారం తెలుసుకోవడం ఓటర్లకు కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు టీవీలు, చేవాణిలు, చరవాణిలు ఇలా ఎన్నో ప్రసార సాధనాలు, మాధ్యమాలు అందుబాట్లోకి వచ్చాయి. దీంతో సమాచారం సులువుగా అందరికీ చేరుతోంది. మరోవైపు ప్రజల్లో ఇన్నాళ్లూ పేరుకుపోయిన అసంతృప్తి, వ్యవస్థపై నెలకొన్న అసహనం శరవేగంగా మార్పుకు నాంది పలుకుతోంది. ఇలాంటి నేపథ్యంలో పార్టీలు కూడా రాజకీయ పంథా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన కొంత కాలంగా పార్టీల్లో పేరుకుపోయిన కుళ్లు, కుట్రలు, కుతంత్రాల మూలంగా జాతీయస్థాయి పార్టీలు భ్రష్టుపట్టిపోయాయి. దేశవ్యాప్తంగా ఉండే డిమాండ్లను అర్థంచేసుకుని సమస్యలను పరిష్కరించే నేర్పు, ఓర్పు జాతీయ పార్టీల్లో కరువైపోయింది. ఈ నేపథ్యమే స్థానిక పార్టీలకు ఆయుధంగా మారుతోంది. జాతిని యావత్తూ ఒక గాటన కట్టగల జాతీయపార్టీలు కుదేలవటానికి అవి చేసుకున్న స్వయంకృతాపరాధమే ప్రధాన కారణం. అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారు. కులం,మతం, ప్రాంతం ప్రాతిపదికన రాజకీయాలు చేసి ఏ ఎండకాగొడుగు పడుతూ జాతి సమగ్రతకు విఘాతం కలిగే పరిస్థితులు తలెత్తడానికి పార్టీలే కారణభూతమవుతున్నాయి. అధికారం కోసం ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హామీలిస్తూ మేనిఫెస్టోల్లో మెరుపులు మెరిపించి అధికారం దక్కగానే హామీలను తుంగతో తొక్కుతున్నారు. స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో అత్యధికంగా పరిపాలించిన కాంగ్రెస్ ఏనాడో రిజర్వేషన్ల విధానం తెచ్చింది అయినా ఇప్పుడు మళ్లీ ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు అంటూ సరికొత్త విధానంతో ఎన్నికలకు వెళ్తోంది. ఇన్నాళ్లూ పేదలపై నిజమైన ప్రేమ కురిపించి ఉంటే ఇన్నేళ్లలో ఎప్పుడో ఆర్థిక అసమానతలు తొలగిపోయేవి కానీ అధికారంలో ఉన్నప్పుడు పేదలు గుర్తుకురారు. కీలక సమస్యలు వచ్చినప్పుడు సంకీర్ణంలో ఉన్నందున ఏమీ చేయలేమని చేతులెత్తేయటం కాంగ్రెస్‌కు ఓ సాంప్రదాయంగా మారింది. ఇలాంటి రాజకీయాలను చూసి విసిగిపోయిన జనం కొత్తదనం కోసం చూస్తున్నారు. జాతిని యావత్తూ ఒకే గాటన కట్టగల సామర్థ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ ఇప్పుడు సెలవు తీసుకుని ఆలోచించటం ఆహ్వానింఛదగిందే అయినా.. ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం నిజంగా ఉంటే అసలు సెలవుల అవసరం ఏముంటుంది. నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వాటికి పరిష్కారాలు వెతికితే ప్రజారంజక నేతగా ఆవిర్భవించటం రాహుల్ లాంటి నేతకు వారసత్వంగా వచ్చిన అవకాశం. ప్రజలకు మేలు చేసే దిశగా ఆలోచిస్తే నవ్విన నాపచేనే పండిందన్నట్టుగా రాహుల్ గాంధీ జనాకర్షక నేతగా ఎదగటం నల్లేరుమీద నడకే. చేయాల్సిందల్లా చిత్తశుద్ధితో ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారాల్ని చూపించటమే. అయితే అధికారం కోసం అర్రులు చాస్తూ ప్రజాకర్షక చట్టాల్ని రూపొందించకుంటే మాత్రం ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. గద్దెదిగే సమయంలో యూపీఏ కొన్ని కీలక చట్టాల్ని తెచ్చినా యూపీఏ పాలనలో పెరిగిపోయిన అవినీతి, అధికధరలు కాంగ్రెస్‌ను కాపాడలేక పోయాయి. యూపీఏ హయాంలో లోక్‌పాల్, భూసేకరణ చట్టం వంటి ప్రజోపయోగ చట్టాలు తెచ్చినా ప్రస్థుత ఎన్‌డీఏ ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కుతూ ప్రజాగ్రహానికి గురవుతోంది. ఫలితమే హస్తిన ఎన్నికల్లో ఘోరపరాజయం. 2014లో బీజేపీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలే తప్ప మోడీ మంత్రం కాదని హస్తిన ఎన్నికల్లో నిరూపితమైంది. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మన్ననలు పొందేలా కార్యచరణ రూపొందించుకుని ప్రజాకర్షక విధానాలు చేపడితే రాహుల్‌కు మున్ముందు ప్రడాదరణ లభిస్తుందనటంలో మాత్రం ఎలాంటి సందేహంలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 6 శాతం ఓట్లతో జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన ఏపార్టీ కాంగ్రెస్‌కు సాటిలేదు. ఎందుకంటే ప్రజాకర్షణ కూడగట్టడంలో విఫలమై కమ్యూనిస్టు పార్టీలైన సీపీఐ,సీపీఎంలు పతనావస్థలో ఉన్నాయి. అధికారంలో ఉన్న బీజేపీని మతమౌఢ్యం పట్టిపీడిస్తోంది. జనతా పరివార్‌కు ఆశించిన స్థాయిలో మద్దతు కరువైంది. మాయావతికి ఆదరణ కరువైంది. ఇలా అంతా పతనమైన నేపథ్యంలో జాతీయ స్థాయిలో అంతోఇంతో ఆదరణఉన్న కాంగ్రెస్ యువరాజుకు ప్రజాస్యలపై చిత్తశుద్ధితో వ్యవహరిస్తే అనతికాలంలోనే ఆదరణ లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతే తప్ప సెలవులపేరుతో కాలయాపన చేస్తే పరిస్థితి చేయిదాటే ప్రమాదమూ పొంచి ఉంది. హస్తినలో కేజ్రీవాల్ లాంటి యువరక్తం సృష్టించిన రికార్డు విజయం నుంచి సంప్రదాయ పార్టీలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రజలు నిజాయితీని కోరుకుంటున్నరు. అది ఎవరు చూపెడితే వారికి పట్టం కడతరు. ప్రజాశ్రేయస్సును మరిస్తే ఎంతటి మహామహులైనా చరిత్రలో కలిసిపోక తప్పదని గ్రహించాలి.