సోనియా అల్లుడి కథ అలహాబాద్ హైకోర్టుకు
విచారణ ఎందుకు జరపొద్దో వివరణ ఇవ్వండి
తాఖీదులు జారీ చేసిన న్యాస్థానం
అలాహాబాద్, అక్టోబర్ 11 (జనంసాక్షి) :
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా వ్యవహారం అలహాబాద్ హై కోర్టుకు చేరింది. వాద్రాకు, రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్‌కు మధ్య గల అక్రమ సంబంధం వల్ల వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని, దీనిపై విచారణ జరపాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ గురువారం అలాహాబాద్ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. రాబర్ట్ వాద్రాపై వచ్చిన ఆరోపణ విూద విచారణకు జరిపించాలని ప్రధానిని ఆదేశించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇండియా అగెనెస్ట్ కరప్షన్ సభ్యుడు, సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ గత వారం రాబర్ట్ వాద్రాపై సంచలన ఆరోపణలు చేశారు. వాద్రా తన పరపతిని ఉపయోగించి డీఎల్‌ఎఫ్‌కు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని, అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి వడ్డీ లేని రుణాలు పొందడమే కాకుండా, తక్కువ ధరకు ప్లాట్లు దక్కించుకున్నారని ఆరోపించారు. వాద్రాకు, డీఎల్‌ఎఫ్‌కు మధ్య ఇచ్చి పుచ్చుకోవడం క్విడ్ ప్రో క్రో కిందకే వస్తుందని, దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి. ఇదిలా వాద్రాపై కేజ్రీవాల్ ఆరోపణలన్నీ రాజకీయ లబ్ధి కోసమేనని కొట్టి పారేసిన యూపీఏ ప్రభుత్వానికి, కోర్టు అదేశాలతో నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయింది.