సోలార్‌ విద్యుత్‌ రంగంలో విప్లవం

C

ఒకే యేడాది 2500 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం

దేశ చరిత్రలో సరికొత్త రికార్డు

విద్యుత్‌ రంగంపై సీఎం ప్రత్యేక దృష్టి

హైదరాబాద్‌,జూన్‌3(జనంసాక్షి): సోలార్‌ విద్యుత్‌ రంగంలో వేగంగా పనులు ప్రారంభించాలని యోచిస్తున్న సర్కారు అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తోంది. ఒక యేడాదిలో 2500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్‌లను నెలకొల్పి దేశంలోనే రికార్డు సృష్టించాలని సర్కారు ప్రణాళికలు వేస్తోంది. విద్యుత్‌ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యాంశాలు ప్రకటించింది. సోలార్‌ పవర్‌ ప్లాంట్లకు నెల రోజుల్లోనే అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోలార్‌ విద్యుత్‌ కేంద్రాలు నిర్దేశిత స్థలంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లాలు, సబ్‌ స్టేషన్ల వారీగా సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు ఉండాలని సూచించింది. ఉత్పత్తి అయిన విద్యుత్‌ ను సవిూప సబ్‌ స్టేషన్‌ కే పంపాలని నిర్దేశించింది. ఒకే ఏడాది 2,500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎంత భూమినైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్లాంట్లకు అనుమతుల్లో ఇబ్బందులు రాకుండా పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించింది. పీపీఏ కుదిరిన ఏడాదిలో విద్యుత్‌ అందుబాటులోకి తీసుకురావాలని నిర్దేశించింది. వ్యవసాయానికి పగటిపూట 9గంటల విద్యుత్‌ సరఫరా చేసేందుకు సోలార్‌ పవర్‌ పూర్తి అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి 2,747 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నది.

నిర్ణీత గడువు కంటే ముందే విద్యుత్‌ అందిస్తే ప్రోత్సహకాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నెల ముందే విద్యుత్‌ అందిస్తే మెగావాట్‌ కు రూ. 2 లక్షలు, 2 నెలల ముందే విద్యుత్‌ అందిస్తే మెగావాట్‌ కు రూ. 3లక్షలు, 3 నెలల ముందే విద్యుత్‌ అందిస్తే మెగావాట్‌ కు రూ. 5లక్షల ప్రోత్సాహకం ఇస్తామని వివరించింది.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సోలార్‌ విద్యుత్‌ విధానం అమలు చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ సోలార్‌ విద్యుత్‌ విధానానికి ఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ ప్రత్యేక అవార్డు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది. మిగతా రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అవలంభించాలని ఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ సూచించిందని పేర్కొన్నది. తెలంగాణ సోలార్‌ విద్యుత్‌ విధానాన్ని ఆలిండియా విండ్‌ అండ్‌ సోలార్‌ పవర్‌ అసోసియేషన్‌ కూడా మెచ్చుకుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

గత ప్రభుత్వాలు 500 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి టెండర్లు పిలిస్తే 232 మెగావాట్లకు మాత్రమే పిపిఏలు కుదిరాయని రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తుచేసింది. తెలంగాణ రాష్ట్రంలో గతేడాది 500 మెగావాట్లకు టెండర్లు పిలిస్తే 2 వేల మెగావాట్లకు పైగా టెండర్లు వచ్చాయని పేర్కొన్నది. ఈ ఏడాది మరో 2 వేల మెగావాట్లకు టెండర్లు పిలిస్తే 6 వేల మెగావాట్లకు పైగా టెండర్లు వచ్చాయని ప్రభుత్వం వివరించింది.