సౌదీ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయండి

4

– కేంద్రాన్ని కోరిన డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 5(జనంసాక్షి):హైదరాబాద్‌లో సౌదీఅరేబియా కార్యాలయాన్ని ఆఫీసుని ప్రారంభించాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ కు డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ విజ్ఞప్తి చేశారు. హజ్‌ యాత్రికుల కోటా పెంచాలని కోరారు. ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం విదేశాంగ శాఖకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. తెలంగాణ, ఆంధ్రా, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వేల సంఖ్యలో అరబ్‌ దేశాలకు వెళ్తున్నారని, హైదరాబాద్‌ లో ఎంబసీ లేకపోవడం వల్ల ముంబై వరకు వెళ్లాల్సి వస్తోందని కేంద్ర మంత్రికి చెప్పారు. అరబ్‌ దేశాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు మృతదేహాలను తీసుకురావడంలో, అక్కడ పనిచేస్తున్నవారి సమస్యలను పరిష్కరించడంలో చాలా ఆలస్యమవుతోందని వివరించారు.తెలంగాణ వస్తే అజ్మీర్‌ దర్గాకు వస్తానని మొక్కుకున్నానని, వచ్చే నెలలో అజ్మీర్‌ దర్గాకు వెళ్తానని మహమూద్‌ అలీ చెప్పారు. వేసవి తర్వాత సీఎం కేసీఆర్‌ కూడా అజ్మీర్‌ వెళ్లేందుకు ఆలోచిస్తున్నారని వెల్లడించారు. అంతకన్నా ముందే మొక్కులో భాగంగా తెలంగాణ ప్రజల కోసం అజ్మీర్‌ లోఎకరం భూమిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని, ప్రభుత్వ భూమి దొరక్కపోతే ప్రైవేట్‌ భూమి కొనుగోలు చేసి సీఎం కేసీఆర్‌ తో ప్రారంభింపజేస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలచారి, రామచంద్రు తేజావత్‌ కూడా సుష్మాస్వరాజ్‌ ని కలిశారు. తెలంగాణ, ఆంధ్రాకే పరిమితమనుకున్న లంబాడీల మూలాలు విదేశాల్లో సైతం ఉన్నాయని పరిశోధనల్లో బహిర్గతమైందని రామచంద్రు అన్నారు. విదేశాల్లో కీలక పదవుల్లో లంబాడి సంతతికి చెందిన వారున్నారని, వారందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా విదేశాంగశాఖ కృషిచేయాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ ను కోరినమని చెప్పారు. లంబాడీలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు గతంలో కేంద్ర విదేశాంగమంత్రి హావిూ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ దిశలోనే లంబాడీ మూలాల కోసం పలు సంస్థలు పరిశోధనలు జరిపాయన్నారు.తెలంగాణలో ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేలా ఏకీకృత సర్వీసు నిబంధనను సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చారని వేణుగోపాలాచారి చెప్పారు. అందరూ మెచ్చుకునే నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌ కు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. విద్యాప్రమాణాలు మెరుగుపర్చే ఈ విధానానికి రాష్ట్రపతి ఆమోదం లాంఛనమే అని భావిస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విధానం లేకపోవడం వల్ల తెలంగాణలో ఉపాధ్యాయుల పదోన్నతులు పెండింగ్‌ లో ఉన్నాయన్నారు. విద్యా విధానంలో సైతం అడ్డంకులు ఏర్పడ్డాయని వేణుగోపాలాచారి వివరించారు.