స్నూపింగ్‌పై దద్దరిల్లిన ఉభయసభలు

2

న్యూదిల్లీ,మార్చి16(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురించి ఢిల్లీ పోలీసులు ఆరాతీయడంపై రాజ్యసభలో, లోక్‌సభలో తీవ్ర దుమారం రేగింది. రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీసే లక్ష్యంతోనే వారిపై ఎన్డీయే ప్రభుత్వం నిఘా పెడుతోందని కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. జుట్టు రంగు, కాలి చెప్పుల సైజు, స్నేహితుల వివరాలు వంటివి అడగాల్సిన అసరమేంటని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ప్రత్యర్ధి పార్టీ నేతల వ్యక్తిగత జీవితాలపై నిఘాపెట్టడానికి ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపణలు గుప్పించింది. అధికారపక్షం ప్రతిపక్షాలపై రాజకీయ కక్షలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. అయితే పోలీసు విచారణ సాధారణంగా జరిగే వ్యవహారమేనని అధికార పక్షం వివరణ ఇచ్చింది. అయినప్పటికీ సంతృప్తి చెందని కాంగ్రెస్‌ రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేసింది. ఈ అంశమై  గులాంనబీ ఆజాద్‌ మాట్లాడుతూ రాహుల్‌ గాంధీపై ఇలాంటి విచారణ జరిపించడం సరికాదన్నారు. ఆయన ఒక్కరే కాదు.. ఉభయ సభల్లోని ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడి గురించైనా ఇలాంటి గూఢచర్యం తగదని అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలను భయపెట్టడం, బెదిరించడం, అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆజాద్‌ ఆరోపించారు. సభలో కానీ, బైట కానీ, ప్రత్యర్ధి పార్టీలు నోరు తెరవకుండా అణిచివేయాలని అధికారపక్షం ప్రయత్నిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కాంగ్రెస్‌ ఆరోపణనలపై అధికారపక్షం తరఫున ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌ నేతలు కొండను తవ్వి.. ఎలుకను పట్టినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వివరాల సేకరణ పద్ధతిని 1987లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆయన గుర్తుచేశారు. ప్రముఖ వ్యక్తుల వివరాలను ఒకట్రెండేళ్లకు ఒకసారి సవిూక్షించడం మామూలేనని చెప్పారు. దివంగత నేత, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ మరణించినప్పుడు చెప్పులను బట్టే ఆయన శరీరాన్ని గుర్తించినట్లు జైట్లీ గుర్తుచేశారు. ఎలాంటి వివరాలు సేకరించాలన్న నిర్ణయం భద్రతా వర్గాలు చేస్తాయని, దానిపై రాజకీయం చేయడం తగదని జైట్లీ అభిప్రాయపడ్డారు. పార్టీ బేధాలు లేకుండా ప్రధాన నాయకుల అందరి వివరాలు ఢిల్లీ పోలీసులు సేకరిస్తున్నారని కేంద్రమంత్రి వివరించారు.  జెడ్‌ప్లస్‌ భద్రత ఉన్న వ్యక్తి నివాసానికి సమాచారం లేకుండా ఢిల్లీ పోలీసులు ఎలా వెళ్తారని ఆజాద్‌ ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు తీరుపై సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  రాహుల్‌గాంధీ కావచ్చు..మరే ఇతర వ్యక్తులపైనైనా కావచ్చని..గూఢచర్యం ద్వారా రాజకీయపార్టీలను భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. గత ఆగస్టు నుంచి దేశంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. ఈ పరిస్థితిపై ¬ంమంత్రి సభలో ప్రకటన చేయాలని కోరారు. ఎందుకంటే ఈ అంశం కేవలం ఏ ఒక్క వ్యక్తికో సంబంధించిన విషయం కాదని.. ఈ విధానం వ్యక్తిగత స్వేచ్ఛకు అవరోధమే కాకుండా ప్రజాస్వామ్యానికే ఓ గొడ్డలిపెట్టు లాంటిదని తెలిపారు.