స్పీకర్‌ నిర్ణయం ఫైనల్‌

1

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,మార్చి11(జనంసాక్షి): టీడీపీ చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ లో విలీనం చేయడం

వెనుక తమ పాత్ర లేదని తెలంగాణ మున్సిపల్‌, పట్టణాభివృద్ది, పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. విలీనంపై స్పీకర్‌ తీసుకున్న నిర్ణయంలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే స్పీకర్‌ మధుసూదనాచారి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. స్పీకర్‌ నిర్ణయంపై కామెంట్‌ చేయడం సమంజసం కాదని కేటీఆర్‌ అన్నారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌ లో చేరిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖ ఆధారంగా స్పీకర్‌ గురువారం ‘విలీనం’ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ సభ్యులుగా గుర్తించేందుకు అంగీకరించి, టీఆర్‌ఎస్‌ సభ్యులతో పాటు అసెంబ్లీలో సీట్ల కేటాయించారు. టీడీపీ ఎమ్మెల్యేల చేరికతో శాసనసభలో టీఆర్‌ఎస్‌ బలం 85కు పెరిగింది. ఇదిలావుంటే తన శాసనసభ నియోజకవర్గం సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…సిరిసిల్ల అభివృద్ధి పథాన నిలబెట్టడమే ఏకైక లక్ష్యం అని తెలిపారు. మంత్రిగా సిరిసిల్ల రుణం తీర్చుకునేలా పని చేస్తానన్నారు. సిరిసిల్ల పట్టణాన్ని అమృత్‌ పథకంలో చేర్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. పట్టణం చుట్టూ రూ.60 కోట్లతో రింగ్‌ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. సిరిసిల్లకు నలుమూలల రహదార్ల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. సిరిసిల్లలో రూ.10 కోట్లతో ఎయిర్‌టెల్‌ మోడల్‌ స్కూల్‌, ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ స్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పక్కా ప్రణాళికలతో ముందుకొస్తే.. అడిగినన్ని నిధులందిస్తామన్నారు.