స్మగ్లర్లను కాపాడేందుకే కూలీల కాల్చివేత?

5

మృతుల్లో అధికులు నిరుపేదలు, దళితులు

అన్ని పార్టీల్లోనూ ఎర్రచందనం స్మగ్లర్లు

కొందరు చట్టసభల్లో ఉంటే ఇంకొందరు గత పాలకులు

ఉన్నతాధికారులు మొదలు చెక్‌పోస్టు సిబ్బంది వరకు అందరూ పాపులే!

తీగలాగితే డొంక కదులుతుందనే కూలీల హత్య

చెన్నై,ఏప్రిల్‌14(జనంసాక్షి): చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంశేషాచల అటవీ ప్రాంతంలో వారం క్రితం అంటే ఈ నెల ఏడో తేదీ తెల్లవారుజామున జరిగిన పోలీసు కాల్పుల ఘటన వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని పలు ప్రజాసంఘాలు, పలువురు సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయపార్టీల్లోనూ ఎర్రచందనం స్మగ్లర్లున్నారని, వారిని కాపాడేందుకే ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌ అని అంటున్నారు. ఈ కూలీలను కాల్చి చంపకుండా పట్టుకుని విచారిస్తే… ఎర్రచందనం స్మగ్లర్ల తీగ లాగితే డొంక కదులుతుందనే ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. మృతి చెందిన 20 మందిలో ఒక్క స్మగ్లర్‌ కూడా లేడని, మృత్యువాత పడిన వారంతా అమాయక నిరుపేద కూలీలేనని స్పష్టంగా నిరూపితమైందంటున్నారు. అసలైన స్మగ్లర్లంతా చట్టసభల్లో కూర్చుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాక గతంలో రాష్ట్రాన్ని ఏలినవారే ఎర్రచందనం స్మగ్లింగ్‌ దందా నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. సాక్షాత్తూ గతంలో రాష్ట్రాన్ని ఏలిన ఓ బడానేత సోదరుడే స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నాడని విమర్శిస్తున్నారు. సమగ్ర విచారణ జరిపితే అసలు దొంగలు బయటపడతారనే అమాయక కూలీలను పొట్టనబెట్టుకున్నారని అంటున్నారు. గత కొంత కాలంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌ మాఫియా వేళ్లూనుకు పోయిందని, దీంట్లో అటవీశాఖ ఉన్నతాధికారులు మొదలు చెక్‌పోస్టుల వద్ద కాపలా ఉండే బంట్రోతు సిబ్బంది దాకా అంతా భాగస్వాములుగా ఉన్నారని అంటున్నారు. తమ పాపం పండే రోజు వచ్చిందనే భయంతోనే అమాయకులైన కూలీలను అధిక కూలీ ఆశ చూపి కావాలనే పొట్టనబెట్టుకున్నారని మృతుల కుటుంబసభ్యులు సహా సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అందుకే శేషాచలం ఎన్‌కౌంటర్‌ ఘటనపై సీబీఆతో గానీ, సిట్టింగ్‌ జడ్జితోగానీ సమగ్ర విచారణ జరిపించాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు శేషాచలం ఎన్‌కౌంటర్‌పై తమిళనాడు హైకోర్టు కూడా ఘాటుగానే స్పందించింది.తిరువణ్నామలై జిల్లాకు చెందిన శశికుమార్‌ అనే మృతుడి భార్య కోర్టులో పిటిషన్‌ వేసింది. బుల్లెట్‌ గాయాలేకాక, తన భర్త ఒంటిపై కత్తిగాట్లు కూడా ఉన్నాయని విమర్శించారు. దీనిపై సీరియస్‌గా స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి మృతదేహాలను భద్రపరచాలని, తదుపరి విచారణపై త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

ఘటనలో 20 మంది కూలీలు హతమయ్యారు. అయితే ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి అనేక కారణాలున్నాయి. సంఘటనా స్థలంలో దొరికిన దుంగలు తాజావి కాకపోవడం, పాతవి కావడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మృతుల కుటుంబ సభ్యులు సైతం ఎన్‌కౌంటర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇదో బూటకపు ఎన్‌కౌంటరని, బస్సులో ప్రయాణిస్తున్న వారిని కిందకు దించి మరీ చంపేశారని ఆరోపిస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకున్న ప్రత్యక్షసాక్షి  శేఖర్‌ కథనం ప్రకారం నగరి నుంచే పోలీసులు ఈ కూలీలను పట్టుకెళ్లారు. చెట్లు నరికేందుకు అధిక కూలీ ఆశ చూపటంతో తామంతా బస్సెక్కి తిరుత్తని మీదుగా తిరుపతి బయల్దేరామని చెప్పాడు. అయితే నగరిలోనే పోలీసులు బస్లులోంచి 7మందిని తీసుకెళ్లారని చెప్తున్నారు. కేవలం తమిళనాడు కూలీలను భయభ్రాంతులను చేయటానికే కాల్పులు జరిపారని, ఇది ఉన్నతాధికారులతోపాటు ఏపీ సీఎంకు తెలిసే జరిగిందని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్‌కౌంటర్‌ ఘటనపై పోలీసులు చెప్తున్నట్లుగా కూలీలు గొడ్డళ్లు, రాళ్లతో దాడికి ప్రయత్నించారని నిరూపించటానికి సాక్ష్యాధారాలు లేకపోవడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పోలీసు కాల్పుల్లో ఈతగుంట వద్ద 9మంది, పచ్చినోడుబండ బండ వద్ద 11 మంది ఎర్రచందనం కూలీలు మృతి చెందారు. అయితే ఎర్ర చందనం స్మగ్లర్ల నెపంతో 20 మంది అమాయక కూలీలను కాల్చి చంపడంతో తమిళనాడు భగ్గుమంది. ఈ ఘటనపై తమిళనాడు సిఎం పన్నీర్‌ సెల్వం దిద్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్‌ ఘటనపై తమిళనాడు సీఎం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.మరోవైపు తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌కౌంటర్‌ ఆమోద యోగ్యం కాదంటూ ఎండీఎంకే అధ్యక్షుడు వైకో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్‌ నేత ఇళంగోవన్‌ డిమాండ్‌ చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కరణానిధి ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. తమిళనాడులోని పలు ప్రజాసంఘాలు ఏపీ సీఎం చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేశాయి. ఇప్పటికే పలు తమిళ సంఘాలు ఆంధ్రా ఆస్తులపై దాడి కొనసాగిస్తున్నాయి. తమిళ కూలీలెవ్వరూ ఆంధ్రప్రదేశ్‌ లోకి వెళ్లొద్దంటూ సరిహద్దు వద్ద తమిళనాడు అధికారులు చెక్‌ పోస్టులు ఏర్పాటుచేశారు. తమిళనాడుకు చెందిన కూలీలను ఎన్‌కౌంటర్‌ చేయడంపై తమిళనాడు భగ్గుమంది. పొట్టకూటికోసం కూలీ పని చేసుకునే వారిని కాల్చివేస్తారా? అంటూ చెన్నెలో నిరసనలు మిన్నంటాయి. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని తమిళర్‌ కచ్చి అనే సంస్థ హెచ్చరించింది. చెన్నైలోని ఆంధ్రా ఆస్తులు, బ్యాంకులు, వ్యాపార సంస్థలు ¬టళ్లపై దాడి చేస్తామని ప్రకటించింది. దీంతో చెన్నై పోలీసులు అలర్టయ్యారు. ఆంధ్రా సంస్థలు, ఆస్తుల వద్ద చెదురుమదురు ఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఇప్పుడు ఆంధ్రా, తమిళనాడు మధ్య మాత్రం పూడ్చలేని అగాధం ఏర్పడింది. చెన్నైలో ఆంధ్రులపై భౌతిక దాడులు జరగటం, మేం ఆంధ్రులం కాదు, తెలంగాణ వాళ్లం అని అక్కడ బతుకుతున్న ఆంధ్రోళ్లు చెప్పుకోవాల్సి రావడం పరిస్థితికి అద్దం పడుతున్నది.