స్వచ్ఛతకు నడుం బిగించాలి

2

– గోరఖ్‌పూర్‌  ఏయిమ్స్‌కు ప్రధాని శంకుస్థాపన

గోరఖ్‌పూర్‌,జులై 22(జనంసాక్షి):స్వచ్ఛత కోసం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. యూపీ గోరఖ్‌పూర్‌ జిల్లాలో మహంత్‌ ఆవైద్యనాథ్‌ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ప్రచారం చేసిన సాధువుల గురించి కూడా తాను విన్నానని తెలిపారు. తల్లి, అక్కాచెల్లెళ్లు గౌరవంగా జీవించాలంటే మరుగుదొడ్లు నిర్మించుకోవాలని వారు తమ భక్తులకు సూచించారని పేర్కొన్నారు. నేత్రాల శస్త్ర చికిత్స కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పేదలను ఆదుకున్న సాధువులను కూడా చూశాను అని చెప్పారు. దేశంలో ఉన్న లక్షలాది సాధువులు, మఠ వ్యవస్థలు, భారత్‌ను ఆధునీకరించడంలో, సుసంపన్నం చేయడంలో కీలకపాత్ర పోషించగలవు అని వెల్లడించారు. ఇప్పటికే చాలా మంది ఆ బాధ్యతలు నిర్వరిస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. గోరఖ్‌పూర్‌లో రూ. 1,011 కోట్లతో ఏర్పాటుచేయనున్న ఎయిమ్స్‌కు మోదీ శంకుస్థాపన చేశారు. 150 ఆపరేషన్‌ థియేటర్లు, 750 పడకలతో ఎయిమ్స్‌ను ఏర్పాటుచేయనున్నారు. దీంతో పాటు ఎరువుల ప్లాంట్‌ పునరుద్ధరణకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఈ ప్లాంట్‌ 1990 నుంచి ఖాళీగా ఉంది. దీంతో రూ. 6వేల కోట్లతో ప్లాంట్‌ను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభిస్తే.. 4వేల మందికి ఉద్యోగాలు లభించడంతో పాటు రైతులకు యూరియా అందుతుంది. ఇటీవల కేంద్ర కేబినెట్‌ ఎ/-లాంట్‌ పునరుద్ధరణతో పాటు ఎయిమ్స్‌ ప్రతిపాదనను కూడా ఆమోదించింది. దీంతో ఈ రెండింటికి ప్రధాని మోదీ నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కల్‌రాజ్‌ మిశ్రా, అనంత్‌ మిశ్రా, పీయూష్‌ గోయల్‌, యూపీ గవర్నర్‌ రామ్‌ నాయక్‌, భాజపా ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు.