స్వచ్ఛభారత్‌ ఓ నినాదం

2

– ఆచరణలో శూన్యం

– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌

ముంబై,ఏప్రిల్‌ 12(జనంసాక్షి): స్వచ్ఛభారత్‌ నినాదంగా మారిందని, ఎక్కడా స్వచ్ఛ కార్యక్రమాలు జరుగుతున్న దాఖలాలు లేవని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. ముంబైలోని లోని అతిపెద్ద డంపింగ్‌యార్డ్‌ డియోనార్‌ను సందర్శించారు. స్వచ్ఛ భారత్‌ గురించి మాట్లాడే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముంబై చెత్త సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. కాలుష్యం దెబ్బకు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల ఈ డంపింగ్‌ యార్డులో పలుమార్లు మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ మంటల కారణంగా పరిసర ప్రాంతాల్లో విపరీతమైన కాలుష్యపు పొగ వ్యాపించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 326 ఎకరాల ప్రాంతంలో ఉన్న ఈ డంపింగ్‌ యార్డులో దాదాపు 12 మిలియన్‌ టన్నుల చెత్త ఉంది. రాహుల్‌ గాంధీ దేవనార్‌ డంపింగ్‌ యార్డును పరిశీలించడంతో రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఈ డంపింగ్‌ యార్డు అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. డంపింగ్‌ యార్డు పరిశీలించిన అనంతరం రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. స్వచ్ఛభారత్‌ గురించి మాట్లాడుతున్నారు.. ఒకసారి ఇక్కడ పరిస్థితి చూడండి.. అంటూ రాహుల్‌ విమర్శించారు. ముంబయి లాంటి నగరంలో చెత్త తొలగించడానికి సరైన విధానం ఉపయోగించట్లేదన్నారు. ముంబయి కార్పొరేషన్‌ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ప్రస్తుతం కార్పొరేషన్‌ శివసేన పార్టీ ఆధ్వర్యంలో నడుస్తోంది.ఈ దశలో నగర సమస్యలపై ఆయన స్పందించారు.