హస్తినలో కేటీఆర్‌ బిజీ బిజీ

4

– పలువురు కేంద్రమంత్రులతో వరుస భేటీలు

హైదరాబాద్‌,మార్చి18(జనంసాక్షి):  రాష్ట్రంలోని వివిధ సమస్యలను కేంద్రం దృష్టికి తెచ్చామని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఆయన కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీహబ్‌ రెండో దశ నిర్మాణానికి కేంద్రాన్ని రూ.100 కోట్లు కోరామన్నారు. టీహబ్‌ రెండో దశ ప్రారంభానికి కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ని ఆహ్వానించామని, ఐటీఐఆర్‌ మౌలిక సదుపాయాలకు రూ.3వేల కోట్లు ఇవ్వాలని అడిగామన్నారు. మేకిన్‌ తెలంగాణలో భాగంగా రాష్ట్రం ప్రోత్సహకాలు ఇస్తోందని కేటీఆర్‌ పేర్కొన్నారు. మేకిన్‌ తెలంగాణ అమలుకు కేంద్రం రూ.50కోట్లు భరించాలని, కరీంనగర్‌కు స్మార్ట్‌ సిటీలో స్థానం కల్పించాలని కేంద్రమంత్రిని కోరినట్లు కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్‌సింగ్‌, రవిశంకర్‌ ప్రసాద్‌తోపాటు పలువురిని కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర మంత్రులను రాష్టాభ్రివృద్ధికి సహకరించాలని కోరానని వివరించారు. రూ.100 కోట్లు టీ హబ్‌కు ఇవ్వాలని రవిశంకర్‌ప్రసాద్‌ను కోరామని తెలిపారు. ఐటీఐఆర్‌ మార్పు విషయంలో పరిశీలిస్తున్నామని తెలిపారని వివరించారు. రవిశంకర్‌ ప్రసాద్‌ను హైదరాబాద్‌ రావాల్సిందిగా ఆహ్వానించామన్నారు. వెంకయ్యనాయుడును కలిసి కరీంనగర్‌కు స్మార్ట్‌ సిటీ జాబితాలో స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశామన్నారు.  డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల పథకం, మిషన్‌ భగీరథ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను వివరించామని కేంద్రం కూడా ఏమైనా ఆర్థిక సాయం అందజేస్తే బాగుంటుందని కోరామని వివరించారు. ఏపీ, తెలంగాణ రాష్టాల్ర ముఖ్యమంత్రులు ఇద్దరు అసెంబ్లీలో సీట్ల పెంపకం విషయంలో సుముఖంగా ఉన్నారని వాటిని పెంచే ప్రయత్నం చేయాలని రాజ్‌నాథ్‌సింగ్‌కు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. మంత్రి వెంట అధికార ప్రతినిధులు వేణుగోపాలచారి, రామచంద్రుడు తదితరులు ఉన్నారు.