హితవచనాలతో కాలుష్యాన్ని తొలగించలేం
ఓట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ అన్న సూక్తి పాలకులకు కనువిప్పు కావాలి. పథకాలు ఎవరు ప్రకటించినా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ వాటిని అమలు చేసే సత్తా, చిత్తశుద్ది కావాలి. కాలుష్య కాసారాంగా మారిన గంగానదిని కాలుష్యం నుంచి రక్షిస్తానని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ రెండేళ్లయినా పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలు లేవు. ఆయన ప్రవచించిన స్వచ్ఛభారత్ ఓ నినాదంగా మిగిలిపోయింది. ప్రధాని బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి మాటల మనిషిగా మిగిలి పోకూడదు. నిజానికి రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నది సామెత. మంచి పనులు చేయడానికి ప్రచారం సరిపోదు. అందులోనూ భారత దేశంలో మంచి మాటలు పనిచేయవు. కొన్ని పనుల విషయంలో కఠినంగా, చట్టబద్దంగా తప్పనిసరిగా చేయడం అవసరమని గుర్తించాలి. ప్రజలకు నీతి వాక్యాలు తలకెక్కడం లేదు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పడం వల్ల వినే స్టేజీలో దేశ ప్రజలు లేరు. రాజకీయ నాయకుల ఉచిత పథకాలతో వారు అసమర్థులుగా, చైతన్య హీనులుగా తయారయ్యారంటే అతిశయోక్తి కాదేమో. అందుకే స్వచ్ఛభారత్ రెండేళ్లయినా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుని పోతోంది. హెల్మెట్ ధరించకుంటే ఫైన్ వేస్తామని చెప్పగానే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి కనిపిస్తున్నారు. ఇది కూడా అంతే… చెత్తే వేస్తే జైలుకు వెళ్లక తప్పదని చెప్పి చూడండి ఫలితం ఉంటుంది. .వాననీటిని సంరక్షించకుంటే బేడీలు తప్పవని చెప్పాలి. చెట్లునరికినా, ఇసుక తోడేసినా జైలు తప్పదని హెచ్చరిక చేస్తే తక్షణ ప్రయోజనం కలుగుతుంది. కఠిన శిక్షలు అమలు చేస్తేనే అనుకున్న లక్ష్యాన్ని కనీసం ఓ పదేళ్లలో సాధించగలం. తాజాగా ప్రధాని జలసంరక్షణకు పిలుపునిచ్చారు. ఇది కొత్త మాటేం కాదు. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్టాల్ల్రో జలసంరక్షణ, మొక్కల పెంపకం, చెరువుల పునుద్దరణ పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే ఇదంతా ప్రభుత్వ కార్యక్రమంగానే సాగుతోంది. ప్రజలను భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రులు చూస్తున్నా సాధ్యం కావడం లేదు. కత్తి మెడవిూద పెట్టి లేదా, తుపాకీ ఎక్కుపెడితే తప్ప పనులు సాగని రోజులివి. ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు పడిపోతున్నాయి. నీటిని సంరక్షించండి. చుక్కచుక్కనూ ఒడిసి పట్టండి… అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు, రైతులకు పిలుపునిచ్చారు.’మన్‌కీ బాత్’ ద్వారా రేడియోలో ఈ సందేశమిచ్చారు.
జీవకోటికి ప్రాణాధారమైన జలాన్ని రక్షించుకునేందుకు ప్రజా ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. ఉపాధి హావిూ పథకం కింద దేశవ్యాప్తంగా అయిదు లక్షల చెరువుల్ని తవ్వించే పనిని ప్రభుత్వం తన బాధ్యతగా చేపట్టిందని చెప్పారు. దేశంలోని భిన్న ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోతున్న దృష్ట్యా చిన్నచిన్న జలాశయాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. నిజంగా మాటలతో ఇది సాధ్యమా అన్నది ప్రధాని మోడీ ఆలోచన చేయాలి. మాటలతో అమలయ్యే కార్యక్రమమే అయితే చెత్త భారత్ నిత్యం దర్శనమిస్తుందా..? ఉపాధి హావిూ కింద జరుగతున్న పనులు ఏనాడైనా పాలకుల గమనించారా అన్నది చూడాలి. ఉపాధి నిధులతో ప్రాణాధారమైన చెట్లను నరికివేస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడా పొదలు లేకుండా చేస్తున్నారు. చిన్నా చితకా మొక్కలను పీకి అవతల పడేస్తున్నారు. చిత్తశుద్దిలేని ప్రకటనలను పక్కన పెట్టి నిరంకుశంగా మంచి పనులను చేపట్టాలి. మంచి పనుల కోసం నిరంకుశంగా వ్యవహరిస్తే తప్ప మన దేశం ముందుకు సాగదు. జలసంరక్షణ, మొక్కల పెంపకం, కాలుష్య నివారణ, ప్లాస్టిక్ నిషేధం, సేంద్రియ వ్యవసాయం తదితర పనులను మెడపై కత్తి పెడితే తప్ప జరగవని గుర్తుంచుకోవాలి. రైతులు తక్కువ ఎరువుల్ని వినియోగిస్తూ, ఆధునిక సాంకేతిక పద్ధతుల్ని అవలంబించాలనీ, తమ కోసం ఉద్దేశించిన యాప్ ద్వారా ప్రయోజనాలు పొందాలనీ మోదీ సూచించారు. నిజానికి ఇవన్నీ కూడా కఠిన చట్టాలతోనే ముందుకు తీసుకుని పోవాలి. విదేశీ గుత్తాధిపత్యం ఉన్న సంస్థలను ప్రోత్సహించడం వల్లనే ఇవాళ ఎరువులు పురగుమందులను విచ్చిలవిడిగా వాడే దుస్థితిలో రైతులు ఉన్నారు. దీంతో సేంద్రియ వ్యవసాయం మంటకలిసింది. ఇవన్నీ తెలియకనే ప్రధాని ఆర్భాట ప్రచారం చేస్తున్నారని అనుకోవాలా? ఎందుకిలా జరగుతున్నదీ ప్రధానికి తెలియదా? వీటిని అమలు చేయడానికి నాయకత్వ లక్షణాలు కావాలి. కఠినాతి కఠినంగా అమలుచేసే ధీరత్వం కావాలి. భారత ప్రజలకు కావాల్సింది హితవచనాలు కావని పాలకులు గుర్తించాలి. కేంద్రంలో లేదా రాష్టాల్ల్రో ఉన్న ప్రభుత్వాలు ఇలాంటి వాటి విషయాల్లో కఠినంగా వ్యవహరించడం అవసరం. నదులన్నీ కాలుష్య కాసారాలుగా మారుతున్నా పట్టించుకోకపోవడం వల్లనే ఇవాళ దౌర్భాగ్యం దాపురించింది. గంగా మొదలు అన్ని నదులు కాలుష్యం కాటుకు కుంచించుకుని పోతున్నాయి. ప్లాస్టిక్ సహా వ్యర్థాలన్నీ నిండిపోతున్నా ఏవిూ చేయలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. గంగా ప్రక్షాళనను మాటలతో కాకుండా చేతలతో చేసి చూపివుంటే ఇవాళ ప్రధాని మోడీ పిలుపును అందరూ శిరసా వహించేవారు. గంగలాగానే గోదావరికీ కాలుష్యం నుంచి విముక్తి కలిగిస్తామని ప్రకటించిన కేంద్రం.. ఈ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. గోదావరి పరీవాహకంలో వెలసిన పట్టణాలు, పరిశ్రమల వ్యర్థాలతోపాటు.. ఒడ్డునున్న పలు ఆలయాలకొచ్చే భక్తుల నిరంతర స్నానాలు, శ్మశాన వాటికలు, మరపడవల వినియోగంతో కాలుష్యభారం నానాటికీ పెరుగుతోంది. దీనివల్ల నీటిలో శుభ్రత మరింత లోపిస్తుంది. ఇంత జరుగుతున్నా.. గోదావరిలో కలిసే మురుగును శుభ్రం చేసి వదిలే పక్రియకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టలేకపోతున్నాయి. కొన్నిచోట్ల పంచాయతీలు, పట్టణాలు తూతూ మంత్రంగా ఈ పనులు నిర్వహిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇలా జరగడానికి ప్రభుత్వాల చేతకాని తనం కాక మరోటి కాదు. వీటిని పరిరక్షించుకోకపోతే భవిష్యత్ లేదు. మన్‌కీ బాత్‌లో మాటలతో కాలుష్యం తొలగిపోదని, కఠిన నిర్ణయాలు, కార్యాచరణతోనే వీటిని జయిస్తామని ప్రధానిగా మోడీ గుర్తించి అడుగులు వేయాలి.