హెచ్‌సీయూ నుంచి సాయుధ బలగాలు వైదొలగాలి

4

– కోదండరాం డిమాండ్‌

హైదరాబాద్‌,మార్చి22(జనంసాక్షి):హెచ్‌సీయూ హాస్టల్లో విద్యార్థుల హక్కుల్ని పోలీసులు కాలరాయడం సరికాదని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. విద్యార్థులుంటే హాస్టల్‌కు వాటర్‌ కనెక్షన్‌, ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ను నిలిపివేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. కనీసం తిందామని వంట చేస్తుంటే కూడా విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వర్శిటీలోకి సాయుధ బలగాలు ప్రవేశించొద్దని ఉన్నా..యథేచ్చగా కోర్టు ఉల్లంఘన జరుగుతుందన్నారు.

హెచ్‌ సీయూ..నో వాటర్‌..నో ఫుడ్‌..

సెంట్రల్‌ యూనివర్శిటీ మరోసారి రణరంగంగా మారింది. వర్శిటీకి జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య రావడంతో మరోసారి యుద్ధవాతావరణం నెలకొంది. అటు పోలీసులకు, ఇటు విద్యార్థులకు మధ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు యుద్ధవాతావరణం నెలకొంది. దీంతో వర్శిటీలోని హాస్టళ్లలో ఉండే విద్యార్థులు అష్టకష్టాలు పడ్డారు. తినేందుకు తిండిలేక, తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు దొరక్క తీవ్ర అవస్థలు పడ్డారు. వర్శిటీ బోధనా సిబ్బంది ఆందోళనకు దిగడంతో 5వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బోధనేతర సిబ్బందిపై దాడికి నిరసనగా మెస్‌ను మూసివేశారు. దీంతో విద్యార్థులు ఉదయం నుంచి భోజనం, నీళ్లు, విద్యుత్‌ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్శిటీ ప్రాంగణంలో వంటచేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య కాసేపు తీవ్ర వాగ్వావాదం జరిగింది. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

సౌకర్యాలు కల్పించాలి..

యూనివర్శిటీలో పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. నిన్నటి నుంచి అన్నపానీయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. వర్శిటీ సిబ్బంది కానీ.. పోలీసులు కానీ స్పందించడంలేదని వాపోయారు. వంట చేసుకొని తిందామన్నా.. వంట చేయోద్దంటూ తమపై లాఠీచార్జ్‌ చేయడం దారుణమన్నారు. కనీసం తాగేందుకు వర్శిటీలోపల నీళ్లు కూడా లేవని బయటి నుంచి తెచ్చుకుందామన్నా పోలీసులు అందుకు అనుమతించడంలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్శిటీ హాస్టల్లో చదువుకుంటున్న తమకు సర్వ హక్కులు ఉంటాయని కానీ వాటిని పోలీసులు కాలరాస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ను కట్‌చేశారని..అంతేకాకుండా వర్శిటీ బయట ఉన్న స్టాళ్లను మూసివేయించారని విద్యార్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా వర్శిటీ వీసీ స్పందించి హాస్టల్‌కి వాటర్‌ కనెక్షన్‌, ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ని పునరుద్దరించాలని విద్యార్థులు కోరుతున్నారు. లేకుంటే తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.