హెచ్‌సీయూ వీసీని వెంటనే రీకాల్‌ చేయాలి

1

– సుశీల్‌ కుమార్‌ షిండే డిమాండ్‌

హైదరాబాద్‌,మార్చి28(జనంసాక్షి):  విద్యార్థులను తన పిల్లల్లా చూడాల్సిన హెచ్సీయూ వీసీ అప్పారావు వారిపట్ల వివక్ష చూపారని కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే విమర్శించారు. అప్పారావు ఇప్పటికైనా రాజీనామా చేయాలని, లేదంటే కేంద్ర ప్రభుత్వం వీసీ పదవి నుంచి ఆయన్ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. సోమవారం హైదరాబాద్‌ వచ్చిన షిండే.. రోహిత్‌ తల్లి రాధికను పరామర్శించారు. హెచ్సీయూలో ఎమర్జెన్సీ వాతావరణం ఉందని, రోహిత్‌ది ఆత్మహత్య కాదు, సంస్థాగత హత్య అని విద్యార్థులు.. షిండే దృష్టికి తీసుకువచ్చారు. షిండేతో దళిత, యువజన సంఘాల నేతలు భేటీ అయ్యారు.షిండే మాట్లాడుతూ.. ‘రోహిత్‌ ఆత్మహత్య జరిగిన రోజునే వీసీగా అప్పారావు తప్పుకోవాల్సింది. ఆయనపై అట్రాసిటీ కేసు పెట్టిన పోలీసులు ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్‌ చేయలేదు?దళితులను అణచివేయాలని కేంద్రం చూస్తోందని మండిపడ్డారు.  విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో షిండేతో పాటు కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, మహారాష్ట్ర ఎంపీ రాజీవ్‌ సతావ్‌  పాల్గొన్నారు.వ్యక్తిగత పూచికత్తుపై విద్యార్థుల విడుదల హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌ సీయూ)లో వైస్‌ చాన్సలర్‌ అతిథి గృహంపై దాడి కేసులో అరెస్టయిన 25 మంది విద్యార్థులు, ఇద్దరు ప్రొఫెసర్లకు ఎట్టకేలకు కోర్టులో బెయిల్‌ లభించింది.  మొత్తం 27 మంది నిందితులను రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాల్సిందిగా కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. నిందితులు ప్రతివారం పోలీస్‌ ఠాణాకు వెళ్లి సంతకం చేయాలనే షరతును కూడా విధించింది. కోర్టు ఉత్తర్వులు అందిన వెంటనే విద్యార్థులు విడుదలయ్యే అవకాశం ఉంది. వీసీపై పోరాటంలో నేడు బెయిల్‌ పొందటాన్ని విజయంగా భావిస్తోన్న హెచ్‌ సీయూ స్టూడెంట్స్‌ జేఏసీ.. చర్లపల్లి జైలు నుంచి వర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించాలని భావిస్తోంది. అయితే ఎలాంటి ర్యాలీలను అనుమతించేదిలేదని పోలీసులు చెప్పారు.  రోహిత్‌ ఆత్మహత్య అనంతరం రెండునెలలు సెలవుపై వెళ్లిన వీసీ అప్పారావు ఈ నెల 23న మళ్లీ బాధ్యతలు స్వీకరించేందుకు సన్నద్ధం అవుతుండగా, ఆయన రాకను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, కొందరు ప్రొఫెసర్లు ఆందోళనల నిర్వహించారు. ఈ క్రమంలోనే వీసీ గెస్ట్‌ హౌస్‌ లో అద్దాలు, పూల కుండీలు ధ్వంసం అయ్యాయి. విషయం పోలీసుల లాఠీచార్జి వరకు వెళ్లడం, 27 మంది అరెస్ట్‌ కావటం తెలిసిందే. జైలులో ఉన్న విద్యార్థులను సోమవారం కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే పరామర్శించారు. విద్యార్థులతోపాటు రోహిత్‌ తల్లి రాధికను కూడా ఆయన కలుసుకున్నారు. హెచ్‌ సీయూలో చోటుచేసుకున్న పరిణామాలపై సమగ్ర విచారణ జరిపిస్తానని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్‌ త్వరితగతిన ఆ పని చేయాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.