హైకోర్టును విభజించండి
సభ ఏకగ్రీవ తీర్మాణం
హైదరాబాద్,మార్చి18(జనంసాక్షి): హైకోర్టును విభజించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేస్తామని లోక్‌సభలో ప్రకటించిన కేంద్ర మంత్రి సదానందగౌడకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. అడ్వకేట్ జనరల్ ఇచ్చిన సూచనల మేరకే తీర్మానం ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు. ఆ క్రమంలోనే సభలో తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు సీఎం తెలిపారు. దీనిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. గురువారం ప్రభుత్వ పక్షాన న్యాయశాఖ కార్యదర్శి హస్తిన వెళ్లిన కేంద్ర మంత్రి సదానంద గౌడను కలిసి హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారని సిఎం పేర్కొన్నారు. హైకోర్టు ఏర్పాటుపై పూర్తి వివరాలతో కూడిన లేఖను కేంద్రానికి అందజేస్తామని సీఎం తేల్చిచెప్పారు. హైకోర్టును విభజన చేయాలని ఇప్పటికే ప్రధాని మోడీకి, న్యాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. హైకోర్టు విభజన కోరుతూ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శాసనమండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇంద్రకరణ్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని విపక్షాలు బలపర్చాయి. మండలిలోనూ హైకోర్టు విభజన కోరుతూ ఏకగ్రీవ తీర్మానం జరిగింది. శాసనసభలో కూడా హైకోర్టు విభజన కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం విదితమే. ఉద్యోగాలు, స్థల కేటాయింపులపై జానారెడ్డి, కిషన్ రెడ్డి చేసిన సూచనలమేరకు తీర్మానంలో కాకుండా తరవాత ప్రత్యేకంగా లేఖలో ప్రస్తావిస్తామని సిఎం తెలిపారు. హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు విభజన చేపట్టాలని తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్ని పక్షాలు ఏకగీవ్రంగా ఆమోదం తెలిపాయి.మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్‌సేన్ గుప్తాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హైకోర్టు విభజన అంశంపై చర్చించారు. గత కొన్ని రోజులుగా హైకోర్టును విభజించాలని న్యాయవాదులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం విభజనకు సానుకూలంగా ఉండడం, అసెంబ్లీలో తీర్మానం చేయడం తదితర అంశాలను చర్చించారని ముఖ్యమంత్రి కేసీఆర్, గుప్తాతో చర్చించారు.