హైకోర్టు ఏర్పాటులో జాప్యం ఎందుకు?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి తొమ్నిది నెలలు గడిచినా ఇంకా హైకోర్టును విభజించటంలో మాత్రం కేంద్రం
మీనమేషాలు లెక్కిస్తున్నది. ఇప్పటికే పలు బార్ అసోసియేషన్లు హైకోర్టు ఏర్పాటును డిమాండ్ చేస్తూ
రోడ్డెక్కిన్రు. అయినా కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేదు. తెలంగాణ రాష్ట్రం విడిపోయాక ఒకటి అరా మినహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాలు విడిపోయినయి. కానీ హైకోర్టు విషయంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రత్యేక హైకోర్టు కోసం ఇప్పటికే న్యాయవాదులు గత కొద్దిరోజులుగా ఆందోళనలు తీవ్రతరం చేసిన్రు. ఇప్పటికే పలు పద్ధతుల్లో నిరసన తెలుపుతున్న న్యాయవాదులు ఈ ఆందోళనలు ఇలానే కొనసాగించాలి. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తితో పోరాడితే హైకోర్టు సాధన పెద్ద కష్టమేమీకాదు. ఇప్పటికే నిరసనలు, ధర్నాలతో ప్రత్యేక హైకోర్టు సాధన ఉద్యమం హోరెత్తుతున్నది. ఆందోళనకు ప్రజల నుండి కూడా మద్దతు లభిస్తుంది. ఛలోఢిల్లీ, ఛలో సెక్రటేరియట్ లాంటి కార్యక్రమాలు చేపట్టడం హైకోర్టు సాధన దిశగా మరో ముందడుగేనని చెప్పాలి. ఇప్పుడున్న హైకోర్టులో సీమాంధ్రుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు చేపట్టిన నియామకాల్లో జరిగిన అవకతవకల కారణంగా తెలంగాణ న్యాయవాదులకు అన్యాయం జరిగింది. సీమాంధ్ర ప్రభుత్వాధినేతల కనుసన్నల్లో జరిగిన అక్రమ నియామకాల్లో హైకోర్టులోని పలు కీలక పోస్టుల్లో ఆంధ్ర ప్రాంత వాసులను నియమించిన్రు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగినా వారి ఆధిపత్యం కొనసాగటం వల్ల తెలంగాణ న్యాయవాదులకు అన్యాయం జరుగుతోంది. తెలంగాణ హైకోర్టు, ప్రత్యేక బార్ కౌన్సిల్
ఏర్పాటు చేస్తే స్థానికులకు ఇకనుంచైనా న్యాయం జరుగుతుంది. ఇప్పటికే న్యాయవ్యవస్థలో తెలంగాణ అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. ఏపీలో 595 కోర్టులుంటే తెలంగాణలో 439 కోర్టులున్నయి. జూనియర్ సివిల్ జడ్డి కేడర్‌లో 338 మంది ఏపీ అభ్యర్థులుండగా తెలంగాణకు చెందినవారు 159 మంది మాత్రమే ఉన్నారు. సీనియర్ సివిల్ జడ్డి కేడర్‌లో ఏపీ నుండి 155 మంది ఉంటే తెలంగాణ వారు కేవలం 44 మంది, అలానే జిల్లా జడ్జిలుగా ఏపీ నుంచి 181 ఉంటే తెలంగాణ నుంచి 39 మంది మాత్రమే ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 6నెలల్లో జేసీజే నియామకాలు పూర్తికావాలి. అయితే ప్రస్థుతమున్న పరిస్థితుల్లో నియామకాలు చేపడితే తెలంగాణ అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే 8వ తేదీన జరపనున్న ఎంపిక పరీక్ష రద్దు చేయాలని తెలంగాణ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నరు. ప్రత్యేక హైకోర్టు నియమించేవరకు ఎలాంటి నియామకాలు చేపట్టొద్దంటున్నరు. మరోవైపు హైకోర్టు ఏర్పాటులో ఆలస్యంతో ప్రత్యేక స్టాండింగ్ కౌన్సిల్ల ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు ప్రత్యేక హైకోర్టు లేకపోవడంతో స్టాండింగ్ కౌన్సిల్ల నియామకంలో తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. అసలే ప్రభుత్వ న్యాయవాదుల పోస్టుల సంఖ్య తక్కువ. దీంతో తెలంగాణకు చెందిన పలువురు న్యాయవాదులు స్టాండింగ్ కౌన్సిళ్లపై ఆశలు పెట్టుకున్నరు. హైకోర్టు విభజన జరిగితే ప్రభుత్వం తరపున వాదించాల్సిన కేసుల్లో న్యాయవాదులు తెలంగాణ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిళ్ల
రూపంలో వాదనలు వినిపించొచ్చు. కానీ హైకోర్టు విభజన తర్వాతనే నియామకాల ప్రక్రియ చేపట్టాలని న్యాయవాదులు కోరుతుండటంతో జాప్యం తప్పని పరిస్థితి నెలకొంది. నియామకాల నిలుపుదల డిమాండ్ నేపథ్యంలో ఇప్పటికే వెలువడిన పలు నోటిఫికేషన్లను తెలంగాణ న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టు విభజన జరిగిన తర్వాతనే ఎలాంటి నియామకాలైనా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నరు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన సమర్థులైన న్యాయవాదులను స్టాండింగ్ కౌన్సిళ్లుగా నియమిస్తేనే ప్రభుత్వం నిర్ణయాలపై దాఖలవుతున్న వ్యతిరేక పిటిషన్లను సమర్థవంతంగా తిప్పికొట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియమితులైన స్టాండింగ్ కౌన్సిల్లే పలు కేసులకు సంబంధించి వాదనలు వినిపిస్తున్నాయి. వీరిలో ఎక్కువమంది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు కావటంతో తెలంగాణ ప్రభుత్వం పలు సంధర్భాల్లో ఇరకాటంలో పడుతోంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు విభజన జరిగితే కొత్త స్టాండింగ్ కౌన్సిళ్లు ఏర్పాటవుతాయని, వాటిలో అవకాశాలు తమకే దక్కుతాయని తెలంగాణ న్యాయవాదులు ఆశిస్తున్నరు. తద్వారా తెలంగాణ ప్రభుత్వం తరపున వాదించటానికి మెరుగైన అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నరు. మరికొన్ని రోజుల్లో న్యాయశాఖ స్టాండింగ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నందున ప్రత్యేక హైకోర్టు కూడా ఏర్పడితే తెలంగాణ న్యాయవాదులకు మరిన్ని అవకాశాలు దక్కుతాయి. అయితే ప్రత్యేక
హైకోర్టు ఏర్పాటును అడ్డుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుట్రలు చేస్తున్నడని తెలంగాణ న్యాయవాదులు
ఆరోపిస్తున్నరు. కేంద్రంలో భాగస్వామిగా అధికారం పంచుకుంటున్న బాబు తెలంగాణకు హైకోర్టు ఇస్తే ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రాంత వాసులకు అన్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర చక్రం తిప్పుతున్నడని తెలంగాణ న్యాయవాదులు ఆరోపిస్తున్నరు. నిజానికి ఇక్కడున్న సీమాంధ్రులకు ఎలాంటి ఆందోళన లేకున్నా హైకోర్టు ఏర్పాటు చేస్తే గతంలో తను అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతిపై విచారణకు బీజాలు పడతాయనే భయంతోనే బాబు వాళ్లను అడ్డంపెట్టుకుని హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్నారనేది టీ న్యాయవాదుల వాదన. తెలంగాణ హైకోర్టు ఏర్పడితే ఇక్కడ నివసించే ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుంది. నియామకాల్లో సైతం తెలంగాణ న్యాయవాదులకు రావాల్సిన న్యాయమైన వాటా దక్కుతుంది. దీన్ని జీర్ణించుకోలేకనే బాబు మోకాలడ్డుతున్నడని టీ న్యాయవాదులు అంటున్నరు. అయితే పోరాటాలు చేసైనా తమ న్యాయమైన వాటా దక్కించుకుంటామని, హైకోర్టు ఏర్పాటుకు పోరాటం ఉదృతం చేస్తామని అంటున్నరు. న్యాయవాదులు చేస్తున్న పోరాటం కొనసాగితే తప్పక హైకోర్టు త్వరలోనే ఏర్పడుతుంది.