హైదరాబాద్‌ అద్దంలా మెరవాలి

5

బస్తీబాటలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, మే 17(జనంసాక్షి) : హైదరాబాద్‌ నగరం అద్దంలా మెరవాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో భాగంగా న్యూ అశోక్‌ నగర్‌ బస్తీ బాటలో పాల్గొన్న సీఎం బస్తీని అద్దంలా తీర్చిదిద్దుతామని హావిూ ఇచ్చారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో డిగ్రీ, జూనియర్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అర్హులందరికీ వెంటనే పెన్షన్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. న్యూ అశోక్‌ నగర్‌ బస్తీలో స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అశోక్‌నగర్‌లో మురికి కాల్వలు, వీధులు, ఇండ్ల పరిస్థితిని సీఎం కేసీఆర్‌ స్వయంగా పరిశీలించారు. స్థానికులతో పాటు డ్వాక్రా మహిళల సమస్యలను తెలుసుకున్నారు.

నగరంలో రోడ్లపై పేరుకుపోయిన చెత్తా చెదారం, పొర్లే మురికి కాల్వలు లాంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం చేపట్టామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్‌ వల్ల ఇరుకు గదులు, చిన్న సందులు, మౌలిక సదుపాయాల లేమి, ప్రాథమిక ఆరోగ్యానికి నోచుకోకపోవడం వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రజల సహకారంతో వివిధ బస్తీల్లోని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.

సీఎం కేసీఆర్‌ అశోక్‌ నగర్‌ బస్తీ వాసులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ ప్రాంతంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, వంద ఫీట్ల రోడ్డు, కాలేజీలు, విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని ప్రజలు ముఖ్యమంత్రిని కోరారు. వారి విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు.

సమస్యల పరిష్కారానికి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత లేదని, కావాల్సింది ప్రజల సహకారమేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. పార్శీగుట్టతో పాటు సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని చాలా బస్తీల పరిస్థితి దుర్భరంగానే ఉందన్నారు. హైదరాబాద్‌ లో ఇలాంటి బస్తీలు చాలా ఉన్నాయని, వాటన్నింటిలో మార్పు రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

నిరుపేదలు సైతం అన్ని సౌకర్యాలతో గౌరవప్రద జీవితం గడపాలన్నదే తన ఆశయమని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇరుకు గదులున్న ఇండ్లు, పనికిరాని ఇండ్లను తొలగించి దశలవారీగా కొత్త ఇండ్ల నిర్మాణం చేపడ్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. బస్తీలను బాగు చేసే శక్తి ప్రజలే ఇవ్వాలని కోరారు. చెత్త సేకరణ కోసం ప్రతి ఇంటికి ప్రభుత్వమే రెండు ప్లాస్టిక్‌ చెత్త బుట్టలు సరఫరా చేస్తుందని, చెత్త తీసుకెళ్లడానికి రిక్షాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

బస్తీల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ప్రభుత్వ ఖర్చులతోనే వైద్యం చేయిస్తామని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని, నిరుపేదలకు ప్రభుత్వ ఖర్చుతోనే ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. స్థలాలు సేకరించి విద్యాసంస్థలు, పేదలకు ఇండ్లు కడ్తామని చెప్పారు. చాలా బస్తీల పరిస్థితి ఆగమాగం ఉందని, వీటిని పూర్తి స్థాయిలో చక్కదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

అశోక్‌నగర్‌ లో మంచినీటి సమస్య తీర్చడానికి వెంటనే ఐదు బోర్లు వేయాలని ఆదేశించారు. అంతర్జాతీయ క్యారమ్స్‌ ఆటగాడు కె.శ్రీనివాస్‌ కు తగిన సాయం చేస్తమని చెప్పిన సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చారు.