హైదరాబాద్ గులాబీమయం
– నేటి నుంచి టీఆర్‌ఎస్ ప్లీనరీ
– ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు
– పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్న ప్రతినిధులు
హైదరాబాద్ ఏప్రిల్ 23 (జనంసాక్షి):
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నుంచి జరగనున్న తెరాస ప్లీనరీ ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు కేకే, బాల్క సుమన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు పక్కాగా ఉన్నాయని భావించారు. ఏర్పాట్లు జరుగుతున్న తీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎల్బీస్టేడియం గులాబీ జెండాలతో అలరారుతోంది. ఎల్‌బీ స్టేడియంలో ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు భారీ స్టేజి ఏర్పాటు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డి, ఇతర ముఖ్యనేతలు కూడా ఎల్బీస్టేడియంలో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. ఇదిలావుంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్ పార్టీ ఈ నెల 24న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీ నేపథ్యంలో హైదరాబాద్ నగరం గులాబీ వనంలా మారింది. నగరంలో ప్రధాన రహదారులు, కూడళ్లు పార్టీ జెండాలు, తోరణాలు,ఫ్లెక్సీలు, కటౌట్‌లతో నిండిపోయింది. తెలంగాణాలోని పది జిల్లాల నుంచి నగరానికి చేరుకునే ముఖ్య నాయకులు, కార్యకర్తలకు ఘనస్వాగతం పలికేందుకు ఆయా జిల్లాల నుంచి నగరంలోకి ప్రవేశించే రహదారులపై 150 వరకు భారీ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసారు. సుమారు 75 వేల భారీ గులాబీ జెండాలు, 50 వేల చిన్న జెండాలు, 50 లక్షల పార్టీ తోరణాలతో నగరాన్ని ముస్తాబు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, ఆసరా పింఛన్లు వంటి పథకాలపై 400 భారీ ¬ర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఈనెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేయనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పర్యవేక్షిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ఇటీవలే పార్టీ గ్రేటర్ అధ్యక్ష బాధ్యతలను అప్పగించడంతో ఆయన నేతృత్వంలో పార్టీలోని అన్ని వర్గాలను, గ్రూపులను కలుపుకొనిపోయేందకు బాధ్యతలు తీసుకున్నారు. రాబోయే బల్దియా ఎన్నికలో సత్తా చాటడమే లక్ష్యంగా ముందుకెళుతున్న తరుణంలో ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని సాగుతున్నారు. ప్లీనరీని విజయవంతం చేసేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నారు. తెలంగాణ అవతరించిన అనంతరం, అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి ప్లీనరీ కావడంతో పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. నగర అలంకరణ, వేదిక, పార్కింగ్ తదితరాలపై మంత్రులతో సిఎం కెసిఆర్ సవిూక్షించారు. అన్ని కమిటీలు తమకు అప్పగించిన పనులను దాదాపు పూర్తిచేశాయి. ప్రతీ నియోజకవర్గం నుంచి 300 మంది ప్రతినిధుల చొప్పున మొత్తంగా 36 వేలమందిని ఆహ్వానించారు. మరో 14 వేలమంది అదనంగా వస్తారని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని 50 వేలమందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 వరకు సభ కొనసాగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రోజంతా అక్కడే ఉండబోతున్నారు. పార్టీ ప్రతినిధులతో కలిసే ఆయన భోజనం చేస్తారు. 12 తీర్మానాలను రూపొందించారు. అన్నింటిపైనా సమగ్రంగా చర్చిస్తారు. 25 మంది నాయకులకు తీర్మానాలపై మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీంతోపాటు మంత్రులంతా ఒక్కొక్క అంశంపై మాట్లాడతారు. తమ తమ శాఖలపై చర్చిస్తారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం జరగనుంది. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ సమావేశానికి అధికార పార్టీ ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో పార్టీ నేతలు, తీర్మాన కమిటీ సభ్యులతో బ’ాటీ అయ్యారు. శుక్రవారం పార్టీనేతలు ఎవరు ఏ తీర్మానం ప్రవేశపెట్టాలో ఆయన సూచించారు.ప్రవేశపెట్టే తీర్మానాలివే…1.వ్యవస్థాగత నిర్మాణం 2. పట్టణాభివృద్ధి, విశ్వనగరంగా హైదరాబాద్ 3. ప్రజా సంక్షేమం 4. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం 5. వ్యవసాయం, నీటిపారుదల, మిషన్ కాకతీయ 6. రాష్ట్ర విద్యుత్తు రంగం 7. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన 8. తాగునీటి వ్యవస్థ, పారిశ్రామిక, ఐటీరంగం 9. వర్తమాన రాజకీయాలు, తెరాస భాగస్వామ్యం 10. హరితహారం 11. బలహీనవర్గాలకు గృహనిర్మాణం, గోదావరి పుష్కరాలు తదితర అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.