హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌లో భాజపా విజయం

5

ఈ ఓటమి దేవీప్రసాద్‌ది కాదు..రాంచంద్రరావు

అన్ని పార్టీలు కుమ్మక్కయ్యాయి..దేవీప్రసాద్‌

నల్గొండ-వరంగల్‌-ఖమ్మంలో తెరాస ముందంజ

అనూహ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు

హైదరాబాద్‌, మార్చి 25 (జనంసాక్షి) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో సంచలనం నమోదైంది. సునాయాసంగా గెలుపొందుతాడని భావించిన ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్‌(టీయారెస్‌)పై భారీ ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గెలుపొందారు. హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచందర్‌ రావు తొలి రౌండ్‌ నుంచే ఆధిక్యంలో కొనసాగారు. కౌంటింగ్‌ ప్రారంభం నుంచి బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మూడు రౌండ్లు ముగిసేసరికి రామచందర్‌ రావు 9,977 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉంటూ మొత్తం 13318 ఓట్లతో గెలుపొందారు. చాదర్‌ఘాట్‌లోని విక్టోరియా గ్రౌండ్స్‌లో కౌంటింగ్‌ ప్రక్రియ ముగియగా, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అవసరం లేకుండానే ఫలితం తేలీపోయింది. పోలైన మొదటి ప్రాధాన్యత ఓట్లలో రామచంద్రరావుకు 50 శాతంపైగా ఓట్లు రావటంతో ఎన్నికల అధికారులు ఆయన గెలుపును ప్రకటించారు. లెక్క ప్రకారం మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఒక వేళ ఎవరికీ యాభై శాతం ఓట్లు పోలవకపోతే ద్వితియ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అయితే బీజేపీకి 50 శాతంపైగా ఓట్లు రావటంతో గెలుపు ఖాయమైంది. దీంతో బీజేపీ నేతలు సంబరాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పూర్తిస్థాయి వెలువజక మునుపే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దేవీ ప్రసాద్‌ తన ఓటమిని అంగీకరించారు. బీజేపీ అభ్యర్థి రామచందర్‌ రావుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తన అభ్యర్థిత్వాన్ని ఆలస్యంగా ప్రకటించడం వల్లే ఓటమిపాలైనట్లు దేవీప్రసాద్‌ విశ్లేషించారు. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ ఇలా అన్ని పార్టీలు కలిసి అధికార టీఆర్‌ఎస్‌ను ఓడించాలని కుట్రలు చేశాయని దేవీ ప్రసాద్‌ అన్నారు. ఈ తీర్పు ప్రభుత్వ వ్యతిరేక తీర్పుగా భావించాల్సిన అవసరం లేదన్నారు. తనకు ఓటేసిన 40 వేల మందికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక అర్థరాత్రి దాటే సమయానికి రంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీప బీజేపీ ప్రత్యర్థిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.