కోల్డ్ స్టోరేజీ నుంచి బయపడని మహిళా బిల్లు
ప్రధానిగా మోడీ పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లు దాటినా మహిళా రిజర్వేషన్ బిల్లు మాట ఎత్తడం లేదు. విపక్షంలో ఉండగా ఈ బిల్లుపై తరచూ మాట్లాడిన వారు ఇప్పుడు నోరు మెదపడం లేదు. గతంలో మహిళా బిల్లు గురించి మాట్లాడిన ప్రస్తుత మంత్రి సుష్మాస్వరాజ్ కూడా దీనిపై నోరుమెదపడం లేదు. ఎందుకనో బిజెపి ఈ విసయంలో కాంగ్రెస్‌ను మించి పోయింది. కాంగ్రెస్ మయాంలో కనీస ప్రయత్న మైనా జరిగింది. ఈ వర్షాకాల సమావేశాల్లో కూడా దీనిపై ఎవరూ నోరు మెదపడం లేదు. ప్రాంతాయ పార్టీల సంగతి పక్కన పెడితే కాంగ్రెస్,కమ్యూనిస్టులు కూడా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. సంపూర్ణ మెజార్టీ సాధించిన మోడీ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ఆదర్శాలు వల్లించే ఆర్ఎస్ఎస్ కూడా ఎందుకు మౌనంగా ఉంటుందో తెలియడం లేదు. అందుకే మహిళాబిల్లు కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు రావడం లేదు. చిత్తశుద్ది ఉంటే బిల్లును లోక్‌సభకు తీసుకుని వచ్చి విపక్షాలను ఇరుకున పెట్టవచ్చు. కానీ అలా జరగడం లేదు. బిజెపికి థింక్ ట్యాంకర్స్ లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చు. నిర్ణయాలపై చర్చించే మేధావులు బిజెపిలో ఉన్నా వారిని పక్కన పెట్టడం వల్ల మోడీ, అమిత్‌షాలు ఏది నిర్ణయిస్తే అదే జరుగుతోంది. వెంకయ్య నాయుడు లాంటి వారు ఏది చెబితే అది జరుగుతోంది. అందుకే వారికి విమెన్స్ రిజర్వేషన్ బిల్లు ఆనడం లేదు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు మద్దతివ్వడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ చిత్తశుద్దిని చాటుకోవాలి. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించుకోగలిగితే వారి అభ్యున్నతికి అది మరింత దోహదపడుతుందనడంలో సందేహం లేదు. రాజకీయ పార్టీలకు మహిళల పట్ల నిజమైన గౌరవం, అసలైన ప్రేమాభిమానాలు ఉన్నాయా లేదా అనేదానికి రిజర్వేషన్ బిల్లు ఆమోదం ఓ పరీక్ష. అవి మద్దతిస్తున్నాయా లేదా అనేదే అసలైన గీటురాయి. మెజార్టీ ఉందన్న అహంలో అద్వానీ, మరుళీమనోహర్ జోషి లాంటి వారిని మోడీ పక్కన పెట్టింనందుకు పాలనలో చిత్తశుద్ది కొరవడింది. మహిళలు వంటింటికే పరిమితం కావాలన్న తిరోగమన భావజాలం ఒక వైపు, తమ రాజకీయ గుత్తాధిపత్యానికి బీటలు పడతాయన్న భయం మరోవైపు మహిళా బిల్లును కదలనివ్వటం లేదని అర్థం అవుతోంది. ఇప్పటికైనా పాలక పార్టీలు కపట నాటకాలకు తెరదించి మహిళా సాధికారికతకు చేయూతనివ్వాల్సిన అవసరాన్ని గుర్తించాలి. కనీసం మహిళా సభ్యులన్నా మధ్యమధ్యలో ఈ బిల్లు గురించి ప్రస్తావిస్తే తప్ప గుర్తుంచుకునేలా లేరు. లేకుంటే దేశంలో మహిళా బిల్లు తీసుకుని రావాలన్న సంకల్పం నెరేవేరేలా లేదు. దాదాపు పుష్కరకాలం గడిచినా ఈ విషయంలో పాలకులు, ప్రతిపక్షాలు మాట్లాడడం మానేశారు. పురుషాంకార అధికార కేంద్రానికి బిందువుగా ఉన్న పార్లమెంటులో దీనిపై మాట్లాడే సత్తా ఉన్న లీడర్లు కనిపించడం లేదు. పదేళ్ల యూపిఎ పాలనలో తమకు లోక్‌సభలో మెజార్టీ లేదని గడుపుతూ వచ్చారు. పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మోడీ, ఎన్నికలకు ముందు ఎన్నో ఆదర్శాలు వల్లించారు. కానీ ఆచరణలో ప్రజలకు మాత్రం మేలు జరిగే చర్యలేవీ తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. రెండేళ్లు అధికారంలో ఉన్నా మహిళా బిల్లుపై అసలు మాట్లాడడం మానేశారు. మోడీ వచ్చాక మాకు మేలు జరిగిందని చెప్పుకునేలా ప్రజలు చర్చించుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించక పోవడమే మోడీ పాలనకు నిదర్శనంగా చెప్పుకోవాలి. గత రెండు దశాబ్దాలుగా పాలకులు అనుసరిస్తున్న విధానాలు, ప్రపంచీకరణ నేపథ్యంలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక దాడి, స్త్రీ అస్తిత్వాన్ని నాశనం చేసే కుట్ర చేస్తున్నది. సామ్రాజ్యవాదం, ఫ్యూడల్ లక్షణాలతో కూడిన పెట్టుబడిదారీ విధానం, మత ఛాందసవాదం మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటానికి పూనుకుంటున్నాయి. స్త్రీ అంటే ఇప్పటికీ పిల్లలు కనే యంత్రంగా, తమకు సుఖాలను ఇచ్చే సాధనంగా చూడడం మనలను మనం అవమానించుకోవడం తప్ప మరోటి కాదు. మన ఆలోచనలో, భావనలో, కార్యంలో మార్పు రానంతవరకు స్త్రీలపట్ల గౌరవ భావన పెరగదు. ఇలాంటి వాటి నుంచి బయటపడి మహిళలకు చట్టసభల్లో ప్రానిధ్యం పెంచాలన్న ఉద్దేశంతో తీసుకుని వచ్చిన మహిళా బిల్లుపై అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ చిత్తశుద్ది ప్రదర్శించడం లేదు. చట్టసభల్లో వారికి రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన మహిళా బిల్లును ఆమోదింపచేసేందుకు తక్షణం చర్య తీసుకుని వెంటనే చట్టాన్ని తీసుకుని రావాలి. మహిళల గురించి గొప్పగా చెబుతున్న ఆర్ఎస్ఎస్ దీనిపై నోరుమెదపాలి. అత్యాచార ఘటనల విషయంలో కఠిన చర్యలను తీసుకోకుంటే తిరుగబాటు ఉద్యమాలకు మహిళలు వెనకాడరని గుర్తుంచుకోవాలి. ప్రపంచవాప్తంగా స్త్రీలు తమ అస్తిత్వం కోసం అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. యూపి, బీహార్ లాంటి రాష్టాల్ల్రో ఇంకా అరాచకాలు కొనాసగుతున్నాయి. అందుకే మహిళా బిల్లుతో మహిళలకు ప్రాతినిధ్యంపెంచడంతో పాటు, ఉద్యోగాల్లో రిజర్వేసన్లు పెంచాలి. మహిళల రక్షణకు చట్టాలు కఠినం చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల వల్ల పెద్ద సంఖ్యలో గ్రావిూణ మహిళలు పరిపాలనా రంగంలోకి అడుగిడుతున్నా అక్కడా పెత్తనం భర్తలదో, తండ్రిదో తనయుడిదో అవుతుందే తప్ప వారికి స్వేచ్ఛ దక్కడం లేదు. నేరుగా ఆమె కుర్చీని ఆక్రమించుకున్నా ఇలా పెత్తనం చెలాయించే వారితో మహిళా సాధికారికత అవహేళనకు గురవుతుంది. లోక్‌సభ అనుమతి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న 33 శాతం రిజర్వేషన్ బిల్లు దీనికి నిదర్శనం. పాలక పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా ఈ బిల్లుపట్ల వ్యవహరిస్తున్నందునే దశాబ్దం దాటినా అది చట్టానికి నోచుకోలేదు. దీనిపై చిత్తశుద్ది చాటుకునే అవకాశం ఇక మోడీదే తప్ప పార్టీలది కాదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మోడీ ఇప్పుడు సర్వసతంత్రంగా వ్యవహరిస్తున్న ప్రధాని అని గుర్తుంచుకోవాలి.