12 మంది ఎమ్మెల్యేలు ‘అధికార’క విలీనం

3

– స్పీకర్‌ నిర్ణయం

– శాసనసభ సచివాలయం బులెటిన్‌ విడుదల

హైదరాబాద్‌,మార్చి10(జనంసాక్షి):తెలంగాణలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.తెలంగాణ రాష్ట్రంలో 12 మంది తెదేపా ఎమ్మెల్యేలు తెరాసలో విలీనమయ్యారు. ఈ మేరకు శాసనసభ సచివాలయం బులెటిన్‌ విడుదల చేసింది. ఇటీవల పార్టీ మారిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు తెలంగాణ స్పీకర్‌ మధుసుదనాచారి గురువారం ప్రకటించారు. సైకిల్‌ దిగి గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యేలను ఇక నుంచి టీఆర్‌ఎస్‌ సభ్యులుగా అసెంబ్లీలో గుర్తించనున్నట్టు తెలిపారు. వీరికి అధికార పార్టీ సభ్యులుగా శుక్రవారం అసెంబ్లీలో సీట్లు కేటాయించనున్నారు. తాజా చేరికలతో టీఆర్‌ఎస్‌ సంఖ్య 83కి పెరిగింది. కాగా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ 4వ నిబంధన ప్రకారం తమ విలీనానికి అనుమతి ఇవ్వాలని సైకిల్‌ దిగి కారు ఎక్కిన టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ఇటీవల స్పీకర్‌ కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. శాసనసభలోనూ తమను టీఆర్‌ఎస్‌ సభ్యులుగా గుర్తించాలని ఆ లేఖలో కోరారు. స్పీకర్‌ కు రాసిన లేఖలో తలసాని శ్రీనివాస యాదవ్‌, ఎర్రబెల్లి దయాకరరావు, సాయన్న, ప్రకాశ్‌ గౌడ్‌, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, మాధవం కృష్ణారావు, కేవీ వివేకానంద గౌడ్‌, ధర్మారెడ్డి, రాజేందర్‌ రెడ్డి సంతకాలు చేశారు. మరోవైపు బుధవారం అరెకపూడి గాంధీ, మాగంటి గోపినాథ్‌ కూడా టీఆర్‌ఎస్‌ లో చేరారు. ఇక తెలంగాణలో టీడీపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఇక ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య ఉండగా, ఆయన కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉన్నారు.

తెరాసలో చేరిన తెదేపా ఎమ్మెల్యేలు వీరే..

ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, సాయన్న, తీగల కృష్ణారెడ్డి, వివేకానందగౌడ్‌, ధర్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ

ప్రకాశ్‌గౌడ్‌, మాగంటి గోపీనాథ్‌, రాజేందర్‌రెడ్డి