14 అంశాలపై పోరాటం
– టీజేఏసీ చైర్మన్ కోదండరాం
హైదరాబాద్,ఏప్రిల్ 10(జనంసాక్షి): తెలంగాణ జేఏసీ ఇకపై పరిపూర్ణంగా ఉద్యమ సంస్థగానే కొనసాగబోతోంది. ప్రజల సమగ్రాభివృద్ధి కోసం.. మలిపోరుకు సన్నద్ధమైంది. రాష్ట్ర సాధన కోసం చేసినంతటి పోరాటాన్నే ప్రజల కోసం చేయాలని నిర్ణయించింది. ప్రాజెక్టుల రీ-డిజైన్, విద్యుత్ ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని టీ-జేఏసీ డిమాండ్ చేసింది. ఆదివారం, హైదరాబాద్‌లోని నాచారంలో ప్రొ.కోదండరామ్ అధ్యక్షతన టీ-జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ఏ రాజకీయ పార్టీనీ జాక్‌లో చేర్చుకోరాదని నిర్ణయించారు. అవసరాన్ని బట్టి అంశాలవారీ మద్దతును మాత్రం తీసుకోవాలని తీర్మానించారు.
డిమాండ్లు..
జేఏసీ సమావేశంలో భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. మొత్తం 14 అంశాలపై తీర్మానాలు చేశారు. తెలంగాణ సర్కార్ మంచి చేస్తే అభినందించాలని,.. ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తే ప్రజలను సవిూకరించి పోరాటాలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సామాజిక తెలంగాణ కోసం ప్రజల గొంతుకగా ఉండాలని టీ-జేఏసీ నిర్ణయించింది. ఇక తెలంగాణకు పెనుముప్పులా మారిన ఓపెన్‌కాస్ట్ బొగ్గు తవ్వకాలను ఆపాలని.. దానికి ప్రత్యామ్నాయం ఆలోచించాలని జేఏసీ సూచించింది. అదేవిధంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ దాని అనుబంధ పరిశ్రమలను వెంటనే తెరవాలని, తెలంగాణలో స్థాపించే పరిశ్రమల్లో స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో తీవ్రమైన కరవు ఉన్న నేపథ్యంలో.. మరికొన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని టీ-జేఏసీ కోరింది. తెలంగాణ సాంప్రదాయ వృత్తులను కాపాడుకునేందుకు, విద్య,వైద్య రంగాలను బలోపేతం చేసేందుకు త్వరలోనే సదస్సులు నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. ముఖ్యంగా సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులపై దృష్టి సారించిన జేఏసీ.. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల రీ-డిజైన్లు, విద్యుత్ ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
మొత్తానికి ప్రజల పక్షాన పోరాడేందుకు తెలంగాణ జేఏసీ మరోసారి భవిష్యత్ కార్యాచరణను సిద్దం చేసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ తీరుపై ఆచితూచి స్పందిస్తున్న కోదండరామ్.. ఇకపై సర్కారు ప్రజా వ్యతిరేక చర్యలపై కఠిన వైఖరితో.. పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు.