18 నుంచి విద్యా పక్షోత్సవాలు : కలెక్టర్‌

విజయనగరం, జూన్‌ 12 : జిల్లాలోని ప్రతి ప్రభుత్వం పాఠశాలకు ఒక పరిధిని నిర్ణయిస్తున్నామని, ఆ పరిధిలోని బడిఈడు పిల్లలందరిని పాఠశాలలకు చేర్పించే బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులదేనని జిల్లా కలెక్టర్‌ ఎం.వీరబ్రహ్మయ్య చెప్పారు. జూన్‌ 18 నుంచి జులై 2వ తేదీ వరకు నిర్వహించే విద్యా పక్షోత్సవాల్లో ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి బడిఈడు పిల్లలను ఏదైనా స్కూళ్లలో చేర్పించేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. విద్యా పక్షోత్సవాలపై కలెక్టర్‌ తన చాంబర్‌లో సమీక్షించారు. ఆగస్టు చివరునాటికి జిల్లాలో బడికి వెళ్లని బడిఈడు పిల్లలు ఉండరాదని స్పష్టం చేశారు. పిల్లలను స్కూలుకు పంపించబోమని చెప్పే తల్లిదండ్రులపై విద్యా హక్కు చట్టం క్రింద పోలీసులు ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యా పక్షోత్సవాల్లో భాగంగా 15 రోజులు వివిధ కార్యక్రమాలను చే పట్టాలన్నారు. జూన్‌ 25న ప్రత్యేక అవసరాలు గల పిల్లల దినోత్సవం నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగా ఆ రోజున పిల్లలకు వినికిడి సాధనాలను, చేయూత పరికరాలను అందించనున్నట్లు చెప్పారు. జూన్‌ 26న సివిల్‌ వర్కు డేగా నిర్వహిస్తున్నామని, ఆరోజు జిల్లాలోని పలు చోట్ల నిర్మించిన అదనపు తరగతి గదులను, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్లను ప్రారంభిస్తారని చెప్పారు. 27వ తేదీన రాజీవ్‌ మాద్యమిక శిక్షాభియాన్‌ దినోత్సవంగా నిర్వహించి ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల భవనాలు ప్రారంభిస్తారని, ఇన్‌స్పైర్‌ అవార్డులను అందజేస్తారని తెలిపారు. 28వ తేదీ బాలికల విద్యా దినోత్సవంగా నిర్వహించి బాలికలను శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేస్తామని, కస్తూర్భా విద్యాలయాల్లో బాలికలను చేర్పించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తామన్నారు. 29న నీరు, పారిశుద్ధ్యం దినోత్సవం నిర్వహించి పాఠశాలల్లోని మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు చేపడతామన్నారు. 30న విద్యా హక్కు దినోత్సవంగా నిర్వహించి విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, క్రీడా సామగ్రి పంపిణీని నిర్వహిస్తామన్నారు. జులై 1న ఆదర్శ పాఠశాలల దినోత్సవం నిర్వహిస్తామని, 2న నాణ్యతతో కూడిన విద్య దినోత్సవంను నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణారావు, రాజీవ్‌ద విద్యామిషన్‌ ప్రాజెక్టు అధికారి కెవి రమణ, జిల్లా పరిషత్‌ సిఇఓ బి.హేమసుందర్‌ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.