21న నివేదిక : పితాని

హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి) : మంత్రుల కమిటీ మధ్యంతర నివేదికను ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు ఇవ్వనున్నట్టు మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. ఆదివారంనాడు మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన కమిటీ సమావేశ మైంది. పార్టీ, ప్రభుత్వ పరిస్థితులపై కమిటీ చర్చించింది. అనంతరం పితాని మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన ఎంపీలతోను, 18న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోను సమావేశమై అభిప్రాయాలను సేకరించనున్నట్టు చెప్పారు. అనంతరం 19వ తేదీన మరోసారి కమిటీ సమావేశమై అభిప్రాయాలను క్రోడీకరించి నివేదికకు ఒక రూపమిస్తామన్నారు. 21వ తేదీన ముఖ్యమంత్రికి, పీసీసీ అధ్యక్షునికి అందజేయనున్నట్టు తెలిపారు.