విభజన 21 కమిటీల నివేదికలు మే 8న వెబ్‌సైట్లో : జైరామ్‌ రమేశ్‌


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణపై ఏర్పాటు చేసిన 21 కమిటీల నివేదికలను మే 8వ తేదీన వెబ్‌సైట్లో ఉంచుతామని కేంద్ర మంత్రి జైరామ్‌ రమేశ్‌ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చే జూన్‌ 2వ తేదీ తర్వాత కూడా విభజన ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. కీలకమైన బదలాయింపులన్నీ జూన్‌ 2లోగా పూర్తి చేస్తామని ఆ తర్వాత మిగతా శాఖల్లో విభజన ప్రక్రియ ఉంటుందని తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో హోం శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యూష్‌సిన్హాతో పాటు పలువురు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉద్యోగుల పంపిణీపై మార్గదర్శకాలను కూడా నివేదికల్లో పొందుపరుస్తామని ఆయన చెప్పారు. జూన్‌ 2 తర్వాత రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులపై ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. విభజన తర్వాత ఎన్నో అంశాలు చర్చించాల్సి ఉన్నందున హోం శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మే 9న విభజన కమిటీలతో పాటు హోం శాఖ అధికారులతో మారోసారి సమావేశమవుతామని జైరామ్‌ రమేశ్‌ వెల్లడించారు.